కార్మికుడికి కరోనా.. సూర్యాపేట జిల్లాలో కంటైన్‌మెంట్ జోన్లు

by  |

దిశ, న‌ల్ల‌గొండ‌: సూర్య‌పేట జిల్లా మ‌ఠంప‌ల్లిలోని ఓ సిమెంట్ కంపెనీలో ప‌ని చేస్తున్న కార్మికుడికి క‌రోనా నిర్ధార‌ణ అయిన విషయం తెలిసిందే. దీంతో కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో కాంటాక్ట్ పాజిటివ్ కేసుల నియంత్ర‌ణ కోసం జిల్లా అధికారులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప‌క‌డ్భందీగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తోన్నారు. సూర్యాపేట‌, నేర‌డుచ‌ర్ల‌, వ‌ర్ధమానుకోట‌, తిరుమ‌ల‌గిరి గ్రామాల‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించిన అధికారులు అక్క‌డ మెడిక‌ల్ దుకాణాలు మిన‌హా ఇత‌ర దుకాణాల‌ను అనుమ‌తించ‌లేదు. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను సైతం డోర్‌డెలివ‌రీకి సిద్ద‌మ‌య్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇండ్ల నుంచి జ‌నాల‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో రోడ్ల‌న్నీ నిర్మానుషంగా త‌యారయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు సక్రమంగా అందేలా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి ఉదయం నుంచి వార్డుల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న సేవలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిర్ణీత ధరలకు కూరగాయలు విక్రయించడంతోపాటు ప్రజలు సామాజిక దూరం పాటించేలా శానిటరీ ఇన్స్‌పెక్టర్ సారగండ్ల శ్రీను తన సిబ్బందితో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఈరోజు ఉదయం 8 గంటల వరకు పట్టణంలోకి పాలు రాలేదు. పట్టణ ప్రజలకు ప్రతి రోజు 10 వేల లీటర్ల పాలు అవసరం. డైరీ వాహనాలు సకాలంలో రాకపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. ఈ విష‌యం తెలుసుకున్న క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అధికారుల‌పై సీరియ‌స్ అయ్యారు. ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చూసుకునే బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌న్నారు.

Tags : Milk, not, available, public, lockdown, suryapet, corona, positive

Next Story

Most Viewed