మిడిల్ క్లాస్ మెలోడీస్‌కు మంచి మార్కులే.!

by  |
మిడిల్ క్లాస్ మెలోడీస్‌కు మంచి మార్కులే.!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫైట్లు, పెద్ద పెద్ద డైలాగులు, గ్రాఫిక్స్‌ హంగులు లేకుండా నిజజీవితానికి దగ్గరగా ఉండే కథలతో తీసిన సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా వాళ్లు రిలేట్ చేసుకునే విధంగా ఉంటే చాలు, మంచి మార్కులు వేస్తారు. ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‌’ సినిమాకు కూడా ఎర్లీ రివ్యూస్‌లో అలాంటి మార్కులే పడ్డాయి. కథ సాధారణంగా అనిపించినప్పటికీ నటీనటుల పర్ఫార్మెన్స్, స్క్రీన్‌ప్లే సినిమాను నిలబెడుతున్నాయని చెప్పవచ్చు. కథలోకి వెళ్తే.. తన తల్లి చిన్నతనంలో నేర్పించిన బాంబే చట్నీని గుంటూరులో హోటల్ పెట్టి ఫేమస్ చేయాలని రాఘవ (ఆనంద్ దేవరకొండ) లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఏళ్ల తరబడి అతన్నే ప్రేమిస్తున్న సంధ్య (వర్ష బొల్లమ్మ), అతని లక్ష్యానికి అడ్డుగా వస్తుందా? సహకరిస్తుందా?

విజయ్ దేవరకొండ కోపం తగ్గించుకుని నటిస్తే ఎలా ఉంటుందో, అలా ఆనంద్ నటించినట్లు అనిపిస్తుంది. కానీ సిల్లీ జోకుల కారణంగా సినిమా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ట్రాక్ కంటే సైడ్‌లో నటించిన వారి ప్రేమ కథ ఆసక్తిగా అనిపిస్తుంది. నటన, కథ, కథనం అన్నీ చూస్తే ఇది థియేటర్ మెటీరియల్ కాదు, ఓటీటీ మెటీరియలే అనిపిస్తుంది. కానీ చూస్తున్నంతసేపు శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్ సినిమాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మధ్య తరగతి కుటుంబాల్లోని కుటుంబ సభ్యుల మధ్య ఉండే పైకి కనిపించని అనుబంధాలు, చెప్పుకోలేని ప్రేమలు బాగా చూపించారు. కొన్ని చోట్ల కథనం ఫోర్స్ చేసినట్లుగా సాగినప్పటికీ బోర్ మాత్రం కొట్టదు. ఎలాగూ ఓటీటీలోనే విడుదలైంది కాబట్టి రాత్రి పడుకునే ముందు చూస్తే హాయిగా అనిపిస్తుంది.



Next Story

Most Viewed