హైదరాబాద్​ రోడ్ల నిర్వహణకు మైక్రో ప్లానింగ్​

by  |
హైదరాబాద్​ రోడ్ల నిర్వహణకు మైక్రో ప్లానింగ్​
X

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్​ రోడ్ల నిర్వాహణపై మైక్రోప్లానింగ్ అవసరమని మంత్రి కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం, విస్తరణపై గురువారం ప్రగతి భవనన్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్​ఆర్​డీపీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా రోడ్ల విస్తరణ, రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరముందని మంత్రి సూచించారు. ఈ మేరకు కావాల్సిన మైక్రో ప్లానింగ్ పైన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లకు సంబంధించిన మైక్రో ప్లానింగ్ కోసం హైదరాబాద్‌ను నాలుగు జోన్లుగా విభజించి, ఒక్కోజోన్‌లో భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిన రోడ్ల నిర్మాణం, ప్రస్తుత రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు అన్నింటిపై నివేదిక అందించాలనిఅధికారులను ఆదేశించారు.

ఈ నివేదికలో ప్రస్తుతమున్న రోడ్లతో పాటు భవిష్యత్తులో రోడ్ల పైన ఏర్పడే జంక్షన్ల అభివృద్ధి, బస్​బే నిర్మాణం, టాయిలెట్ నిర్మాణం వంటి ప్రతి అంశానికి సంబంధించి సమాచారం ఉండాలన్నారు. ఈ నివేదిక తయారీ కోసం రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్‌లతో, హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ప్రతి వంద ఫీట్ల రోడ్డు పైన ఖచ్చితంగా ఒక మీడియన్, గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర కమిషనర్ లోకేష్ కుమార్​కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొదటి దశలో చేపట్టిన 23లింకు రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. గతనెల జూన్‌లో సరాసరి 50శాతం అధికంగా వర్షపాతం నమోదైన అప్పటికీ రోడ్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రాలేదని అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మేయర్​ బొంతు రామ్మోహన్​, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్, జీహెచ్​ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Next Story