మెస్సీ భవిష్యత్ ఏంటి?

by  |
మెస్సీ భవిష్యత్ ఏంటి?
X

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ప్రపంచంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలను అభిమానులు గమనిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) చాంపియన్స్ లీగ్‌లో చీలిక రావడం.. 12 ఎలైట్ క్లబ్స్ కలిపి కొత్త సూపర్ లీగ్ ఏర్పాటు చేయడం తెలిసిందే. తాజాగా దిగ్గజ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ క్లబ్ మారడంపై సందిగ్దత నెలకొన్నది. ప్రస్తుతం ఎఫ్‌సీ బార్సిలోనా తరపున ఆడుతున్న మెస్సీ కాంట్రాక్టు జూన్ చివరి నాటికి ముగియనుంది. నాలుగు నెలల క్రితమే మెస్సీ మాంచెస్టర్ సిటీకి మారడానికి సిద్దపడ్డాడు. అయితే బార్సిలోనాతో ఉన్న ఒప్పందం కారణంగా అప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయాడు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ తన కెరీర్ ప్రారంభం నుంచి బార్సిలోనా తరపునే ఆడుతున్నాడు. ఆ జట్టుకు ఎన్నో సార్లు చాంపియన్స్ లీగ్ ట్రోఫీని అందించాడు. గత సీజన్‌లో లీగ్‌కు క్వాలిఫై కాకపోవడంతో అతడి కెప్టెన్సీపై క్లబ్ అనుమానాలు వ్యక్తం చేసేంది. దీంతో అతడు వేరే క్లబ్‌కు మారడానికి సిద్దపడ్డాడు.

బరిలోకి దిగిన తండ్రి..

లియోనల్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ ఆదివారం అర్జంటీనా నుంచి బార్సిలోనా చేరుకున్నారు. మెస్సీకి ఏజెంట్‌గా కూడా వ్యవహరించే సీనియర్ మెస్సీ.. బార్సిలోనాతో ఒప్పందంపై చర్చించేందుకు అక్కడకు వచ్చారు. ఈ వారంలో ఇటలీ వెళ్లి అక్కడ కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకున్న అనంతరం బార్సిలోనా చేరుకుంటారని తెలుస్తున్నది. కొడుకు భవిష్యత్ గురించి బార్సిలోనా క్లబ్ ప్రెసిడెంట్ జోన్ లాపోర్టాతో సమావేశం అవుతారని తెలుస్తున్నది. అయితే జోన్ ఇంత వరకు సీనియర్ మెస్సీకి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తున్నది. అగ్రిమెంట్ ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. ఈ సీజన్ ముగిసిన తర్వాత మెస్సీ తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. మెస్సీ కోసం మాంచెస్టర్ సిటీ, పారిస్ సెయింట్ జర్మనియా క్లబ్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మెస్సీ కుటుంబానికి, బార్సిలోనా క్లబ్ మాజీ ప్రెసిడెంట్ జోసెఫ్ మారియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అతడిని బార్సిలోనాతోనే ఉంచడానికి ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మెస్సీకి వచ్చిన ముప్పేమీ లేదు..

యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో వచ్చిన చీలిక కారణంగా మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వచ్చే చిక్కేమీ లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం రెబెల్ లీగ్ అయిన యూరోపియన్ సూపర్ లీగ్‌ను ఏర్పాటు చేసిన క్లబ్స్‌లో బార్సిలోనాతో పాటు మాంచెస్టర్ సిటీ కూడా ఉన్నది. ఆ లీగ్‌లో ఆడే ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముప్పు వాటిల్లుతుందని యూఈఎఫ్ఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని ప్రైవేట్ లీగ్స్ లాగే ఈఎస్ఎల్ ఒకటని.. అందులో ఆడినంత మాత్రాన అంతర్జాతీయ క్రీడాకారులకు ముప్పేమీ లేదని ఇప్పటికే కొత్త లీగ్ చీఫ్ ఫ్లోరెంటీనో పెరెజ్ స్పష్టం చేశారు. అవసరం అయితే మెస్సీని మరో లీగ్‌లో ఆడటానికి కూడా అవకాశం కల్పిస్తామని ఇతర క్లబ్స్ ఆఫర్స్ ఇస్తున్నాయి. అయితే మెస్సీ తన తండ్రితో కలసి ముందు బార్సిలోనాతో చర్చలు జరిపిన తర్వాతే భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.



Next Story

Most Viewed