జీవితానికి కొత్త భాష్యం.. 70 ఏళ్ల ఉమన్ ట్రావెలర్ సోలో జర్నీ!

by  |
జీవితానికి కొత్త భాష్యం.. 70 ఏళ్ల ఉమన్ ట్రావెలర్ సోలో జర్నీ!
X

దిశ, ఫీచర్స్ : చాలామంది ట్రావెల్, అడ్వెంచర్‌తో కూడిన లైఫ్‌స్టైల్‌ను గడపాలని కలలుగంటారు. కానీ కుటుంబ బాధ్యతల్లో చిక్కుకోవడంతో వారి కల కలగానే మిగిలిపోతుంది. పురుషులతో పోలిస్తే మహిళలు అడ్వెంచర్ ట్రిప్స్ చేయడం ఇంకా కష్టం. అయితే ఇలాంటి అడ్డంకులు దాటిన 70 ఏళ్ల సుధా మహాలింగం(ఫార్మర్ జర్నలిస్ట్) సోలో ట్రావెలర్‌గా ఇప్పటివరకు 66 దేశాలను చుట్టేసింది. ఉద్యోగం, పెళ్లి, పిల్లల కన్నా మించిన జీవితం ఉందంటూ తన బ్లాగ్ ద్వారా సాహసయాత్రల వివరాలను పంచుకుంటున్న సుధ.. వయసును కూడా లెక్కచేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. సోలో ట్రావెలింగ్‌ అడ్డంకులను అధిగమించి విశ్వాసంతో ముందుకు సాగేందుకు పలువురికి ప్రోత్సాహాన్నిస్తోంది.

చిన్నప్పటి నుంచే తనకు ప్రయాణాలంటే చాలా ఇష్టమని చెబుతున్న మహాలింగంకు 25 ఏళ్ల వయసులో వివాహమైంది. కానీ ఆమె ఎప్పుడూ సొంతంగా, తనకు నచ్చిన ప్రదేశాలకు ట్రావెలింగ్ చేయలేదు. తన భర్త ఒక సివిల్ సర్వెంట్ కావడంతో అతనితో పాటే వెళ్లాల్సి వచ్చేది. పెళ్లైన రెండు దశాబ్దాల తర్వాత 1996లో మొదటిసారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేకుండా కైలాష్ మానసరోవర్‌కు 32 రోజుల ట్రెక్‌కు వెళ్లింది. కాగా 2000 సంవత్సరంలో ఆమె భర్త 2 నెలల అసైన్‌మెంట్ వర్క్‌ మీద స్వీడన్‌కు వెళ్లాల్సి రావడంతో తను కూడా వెళ్లింది. ఫ్రీ టైమ్ దొరకడంతో అక్కడి పర్యాటక ప్రదేశాలను చూడాలని డిసైడ్ అయింది. అలా ఫిన్‌లాండ్‌కు ఓడలో.. నార్వే, డెన్మార్క్, బెర్లిన్‌కు రైలులో సోలోగానే వెళ్లింది.

అన్‌ఫేమస్ టూరిస్ట్ ప్లేస్‌లకే ప్రయారిటీ..

ఇక 2003లో ఒక సమావేశం కోసం ఉజ్బెకిస్తాన్ వెళ్ళిన సుధ.. తన పర్యటనను పొడిగించుకుని కిర్జిస్తాన్‌ను సందర్శించాలని నిర్ణయించుకుంది. మొదటిసారిగా సోలో ట్రావెలింగ్‌లో ఉన్న మజా తెలియడంతో అప్పటి నుంచి దీన్నే హాబీగా మార్చుకుంది. భారత్‌లో 16 నగరాల్లో నివసించిన ఈ సోలో ట్రావెలర్.. 18 దేశాల్లో డ్రైవింగ్ యాత్రలు చేసింది. ఈ ప్రయాణాల్లో మధురమైన అనుభూతులతో పాటు ప్రమాదకర సంఘటనలు కూడా ఎదుర్కొంది. ఒకసారి చెల్లుబాటయ్యే వీసా లేకుండా ప్రాగ్‌లో అడుగుపెట్టగా, మరొకసారి తిరుగుబాటు సమయంలో కశ్మీర్ లోయలో చిక్కుకుపోయిన చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. సుధ ప్రయాణాలు చాలావరకు ప్రణాళిక లేనివి. ముందస్తు ప్లానింగ్, హోటల్ బుకింగ్స్ లేదా నిర్దిష్ట ప్రయాణ మార్గాలను అనుసరించకుండా వివిధ దేశాల్లో ల్యాండ్ అవడాన్ని ఇష్టపడుతుంది. ఎక్కువగా టూరిజం గురించి ప్రచారంలో లేని ప్రదేశాలకు వెళ్తుంది. హాస్టల్స్‌లో ఉండటం, స్థానికుల పద్ధతులు తెలుసుకోవడం ఆమెకు ఇష్టం.

జీవితం అంటే ఇదేకాదు..

‘నేను దేనికీ భయపడను. జీవించేందుకు అనేక మార్గాలున్నాయని అనుకుంటా. స్కూల్, కాలేజ్‌కు వెళ్లడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం ఇది మాత్రమే జీవితం కాదు. వ్యక్తిగతంగా బయటకువెళ్లి తెలుసుకునేందుకు చాలా ఉత్తేజకరమైన విషయాలు ఉన్నాయి’

– సుధ మహాలింగం సోలో ట్రావెలర్


Next Story

Most Viewed