పురుషుల మాంసాహార అలవాట్లతో వాతావరణ మార్పులు..

by  |
పురుషుల మాంసాహార అలవాట్లతో వాతావరణ మార్పులు..
X

దిశ, ఫీచర్స్: ప్లాస్టిక్ వస్తువుల మితిమీరిన వాడకం, వాహన కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని తెలిసిందే. కానీ మనుషుల నాన్ వెజ్ హ్యాబిట్స్‌ వల్ల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు వెలువడుతున్నాయని, పైగా మహిళల కన్నా పురుషుల మాంసాహార అలవాట్లే 40 శాతం ఎక్కువ కారణమవుతున్నాయని యూకేలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఆహార సంబంధిత ఉద్గారాల్లో నాలుగింట ఒక వంతు ఆల్కహాల్, కాఫీ, కేకులు, స్వీట్లు వంటి ఆప్షనల్ ఫుడ్, డ్రింక్స్ కారణమని ఈ పరిశోధనలో తేలింది.

ఈ నేపథ్యంలో స్థిరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెట్టేవిధంగా పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు. పానీయాలను మానేయడంతో పాటు తీపి చిరుతిళ్లను తగ్గించడం వల్ల కూడా కొంత ప్రభావాన్ని తగ్గించవచ్చని వివరించారు. ఇక పాశ్చాత్య దేశాల్లో సాధారణ ఆహారం కంటే వేగన్, వెజిటేరియన్ ఫుడ్ మూడింట ఒక వంతు చౌకగా లభిస్తోందని మరొక అధ్యయనం కనుగొంది. కాగా ‘ప్లోస్ వన్’ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం 3,200 నిర్దిష్ట ఆహార పదార్థాలకు సంబంధించిన ఉద్గారాలను విశ్లేషించడంతో పాటు దాదాపు 212 మంది బ్రిటిషర్ల ఆహారాలను పరిశీలించింది. ఈ వ్యక్తులు తీసుకునే ఫుడ్, తాగే డ్రింక్స్‌ వివరాలను 24 గంటల వ్యవధిలో మూడుసార్లు నమోదు చేసింది.

ఈ లెక్కన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో దాదాపు సగం వరకు జంతు ఉత్పత్తులే కారణమని అధ్యయనం కనుగొంది. వీటిలో దాదాపు 31% మాంసం నుంచి కాగా, 14% పాడి ఉత్పత్తుల నుంచి వస్తున్నట్టు తెలిపింది. ఇక శాకాహారం కంటే మాంసాహారం 59% ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు దారి తీస్తుందని.. పురుషులు ఎక్కువగా మాంసం, ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకుంటున్నందున వారి ఆహారంలో 41% ఎక్కువ ఉద్గారాలు ఉంటున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed