'ఆర్థిక పునరుద్ధరణ కోసం క్రెడిట్ గ్యారెంటీ, మారటోరియం అవసరం'!

by  |
ఆర్థిక పునరుద్ధరణ కోసం క్రెడిట్ గ్యారెంటీ, మారటోరియం అవసరం!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో బ్యాంకులు, రుణ గ్రహీతలకు సాయం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గతవారం ప్రకటించిన చర్యలు ఆర్థిక సంస్థలపై ఒత్తిడిని ఆలస్యం చేసేదిగా మాత్రమే ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం తెలిపింది. ఆర్‌బీఐ రుణ పునర్‌వ్యవస్థీకరణ సహా బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి, రుణగ్రహీతల రీమేంట్‌కు మరింత సమయాన్ని ఇచ్చింది. ఈ చర్యల వల్ల రానున్న 12-24 నెలల్లో ఆర్థిక సంస్థలకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని, అయితే, ఆస్తి నాణ్యతకు సంబంధించిన సమస్యలను గుర్తించడం, పరిష్కరించడంలో ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది.

ఆర్థిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ క్రెడిట్ గ్యారెంటీ పథకం, మారటోరియం వంటి మరిన్ని చర్యలను తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు ఫిచ్ తెలిపింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న కారణంగా ఫిచ్ రేటింగ్స్ వంటి సంస్థలు దేశంలోని కార్యకలాపాలు 2020లో కంటే తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఇప్పుడున్న ఆంక్షలు మరింత కాలం కొనసాగవచ్చని, రానున్న రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తే ఏప్రిల్-మే కార్యకలాపాల క్షీణత దేశ పునరుద్ధరణను ఆలస్యం చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ భావిస్తోంది.


Next Story