ఇటలీ వెళ్లనున్న భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్

by  |
Mary-Kom
X

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ శిక్షణ నిమిత్తం ఇటలీ బయలుదేరి వెళ్లనున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మేరీ కోమ్ మెరుగైన శిక్షణ కోసం ఇటలీ వెళ్తున్నట్లు తెలిసింది. ఇండియా నుంచి టోక్యో వెళ్లనున్న అథ్లెట్లపై ఒలింపిక్ నిర్వాహక కమిటీ కఠినమైన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీని వల్ల దాదాపు 14 రోజుల పాటు శిక్షణకు దూరంగా ఉండాల్సి వస్తుందని భావించే మేరీ కోమ్ ఇటలీ ప్రయాణానికి సిద్దపడినట్లు తెలుస్తున్నది. అక్కడ శిక్షణ అనంతరం ఇటలీ నుంచి నేరుగా టోక్యో బయలుదేరి వెళ్లనున్నది.

ఇప్పటికే పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి స్థాయిలో సిద్దపడిన మేరీ కోమ్.. గతంలో తాను సాధించిన కాంస్య పతకాన్ని స్వర్ణంగా మార్చాలని ధృఢ నిశ్చయంతో ఉన్నది. ‘నేను నా ప్రణాళికను మార్చాను. రేపు లేదా ఎల్లుండి ఇటలీకి బయలుదేరి వెళ్తాను. ఇండియా నుంచి వెళ్లాలంటే రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. చాలా కాలంగా కఠినమైన శిక్షణ తీసుకొని మంచి లయను సాధించాను. ఈ సమయంలో క్వారంటైన్ బ్రేక్ తీసుకొని దాన్ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. అందుకే ఇటలీ వెళ్తున్నాను’ అని మేరీ కోమ్ అన్నది. మేరీ కోమ్‌తో పాటు ఆమె పర్సనల్ కోచ్ చోటే లాల్ యాదవ్ కూడా వెళ్లనున్నారు.


Next Story