అధిక లాభాల్లో మార్కెట్లు

by  |
అధిక లాభాల్లో మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా అధిక లాభాలతో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఆర్‌బీఐ విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, ద్రవ్యలభ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించడంతో ప్రధానంగా బ్యాంకింగ్ రంగం షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో స్వల్ప ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ఆర్‌బీఐ ప్రకటన తర్వాత మార్కెట్లలో జోరు పెరిగింది.

ఇన్వెస్టర్ల ఉత్సాహానికి తోడు పలు కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పెరగడంతో సూచీలు జోరుగా కదలాడాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 326.82 పాయింట్లు ఎగసి 40,509 వద్ద ముగియగా, నిఫ్టీ 79.60 పాయింట్లు లాభపడి 11,914 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 3 శాతం వరకు పుంజుకోగా, ఐటీ రంగ షేర్లు బలపడ్డాయి.

మీడియా, ఫార్మా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధిక లాభాలతో ట్రేడవ్వగా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.18గా ఉంది.



Next Story

Most Viewed