మార్చి 31తో బీఎస్4 రిజిస్ట్రేషన్లు బంద్

by  |
మార్చి 31తో బీఎస్4 రిజిస్ట్రేషన్లు బంద్
X

తెలంగాణ రాష్ట్రంలో బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి మరింత పర్యావరణ హితమైన బీఎస్6 వాహనాల రిజిస్ట్రేషన్‌ను మాత్రమే రవాణాశాఖ చేయనుంది. మూడేండ్ల క్రితం బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వుల వల్ల బీఎస్ 3 వాహనాల రిజిస్ట్రేషన్‌కు కొన్ని ఉపశమనాలు లభించాయి. కానీ, గతంలో మాదిరిగా చివరి రోజైన మార్చి 31న టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసుకుని అనంతరం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటి వెసులుబాటు ఈసారి బీఎస్4 వాహనాలకు లేదని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుని పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రవాణా శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మార్చి 31న టీఆర్ తీసుకుని తర్వాత నెమ్మదిగా మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే వృథా ప్రయాసే అవుతుందని హెచ్చరిస్తున్నారు. బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్లపై ఏప్రిల్ 1 నుంచి పూర్తి నిషేధం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలైన బస్సులు కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మొదట టీఆర్ నంబర్ తీసుకొని బాడీ బిల్డింగ్ తర్వాత పూర్తి రిజిస్ట్రేషన్ చేసుకుందామనుకుంటే కుదరదని పేర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ కోసం భారత్ స్టేజ్ (బీఎస్) ఉద్గార నిబంధనలు దేశవ్యాప్తంగా 2000లో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అనంతరం 2005, 2010లో వరుసగా బీఎస్2, బీఎస్3 నిబంధనలను ప్రవేశపెట్టింది.

నెమ్మదించిన రిజిస్ట్రేషన్

గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతున్న కొత్త వాహనాల సంఖ్యలో పెద్దగా వృద్ధి లేదని తెలుస్తోంది. రోడ్ ట్యాక్స్, పలు ఫీజుల రూపంలో రవాణా శాఖ నుంచి ప్రభుత్వానికి గత ఏడాది రూ. 3500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదీ అంతే మొత్తంలో ఆదాయం రావొచ్చని, ఇందులో పెద్దగా వృద్ధి ఉండే అవకాశాలు లేవని తెలంగాణ రవాణాశాఖ సంయక్త కమిషనర్ సీ రమేష్ చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బీఎస్ 4 వాహనాలను డిస్కౌంట్లో విక్రయించే అవకాశం ఉండటంతో రిజిస్ట్రేషన్లలో పెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, వాహనాల కొనుగోళ్లు పడిపోయి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు తగ్గినా డ్రైవింగ్ లైసెన్సుల జారీలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed