మావోయిస్టు పార్టీ సంచలన లేఖ.. కీలక సూచనలు చేసిన జగన్

by  |
మావోయిస్టు పార్టీ సంచలన లేఖ.. కీలక సూచనలు చేసిన జగన్
X

దిశ, గుండాల: జులై 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు గ్రామగ్రామానా ప్రజాగెరిల్లా ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల సభలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో కోరారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 160 మంది ముఖ్య నాయకులు అమరులు అయ్యారని, ఆ వీరుల త్యాగాన్ని గుర్తుచేసుకోవడం కోసం, అమరులు చూపిన బాటలో పోరాడాలని సూచించారు. ప్రజా ఉద్యమాలు చేస్తున్న ప్రజా గెరిల్లా దళాలను కుట్రపూరితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. యాప నారాయణ అలియాస్ హరి భూషణ్, సారక్కతో పాటు అనేకమంది అమరులు అయ్యారని వారి ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ పేరిట ఆదివాసీలను అడవినుండి దూరం చేయటం కోసం కుట్రలు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Maoists-letter

ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న, దోపిడీ వ్యవస్థను అంతం చేయడానికి ప్రజా పోరాటాలే మార్గం అని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలను, వారు చేసిన గొప్ప పోరాటపటిమను నేటి తరానికి తెలియజేయాలని కోరారు. గ్రామాల్లో కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థను తరిమికొట్టిన చరిత్రను ఈనాటి తరానికి తెలియజేయాలని కోరారు. పేదరికంలో మగ్గుతున్న అమరవీరుల కుటుంబాలకు చేయూత నివ్వాలని జూలై 28 నుండి వారం రోజుల పాటు గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో మీ వాడలో అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని తెలిపారు.



Next Story

Most Viewed