సరెండర్ దిశగా దళపతి గణపతి..?

by  |
సరెండర్ దిశగా దళపతి గణపతి..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుకు యత్నిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. తన బంధువుల ద్వారా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి ప్రస్తుతం అంతర్జాతీయ విప్లవ పార్టీల సమూహానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సాయుధ పోరాటం చేస్తున్న విప్లవ పార్టీలన్ని ఒకే గొడుగు కిందకు రావాలన్న నినాదంతో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌గా ఆవిర్భావం చేయడంలో గణపతిది కీలక పాత్ర.

2005 సెప్టెంబర్ 15న మావోయిస్టు పార్టీగా ఏర్పడిన తర్వాత కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి బాధ్యతలు చేపట్టారు. దాదాపు 13 ఏళ్ల పాటు సీసీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2018లో అనారోగ్య సమస్యలతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన స్థానంలో నంబాల కేశవరావుకు బాధ్యతలు చూస్తున్నారు. 74 ఏళ్ల వయసున్న గణపతి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన గణపతి 1970వ దశాబ్దంలో నక్సల్బరి ఉద్యమం వైపు ఆకర్షితులు కాగా, జగిత్యాల జైత్రయాత్ర సమయంలో ఆయన సాధారణ వ్యక్తిగానే హాజరయ్యారు.

ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అణగారిన వర్గాల అన్యాయంపై పోరాటపంథాను ఎంచుకుని మొదట హుస్నాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1980లో పీపుల్స్ వార్ ఆవిర్భావ సమయంలో కొండపల్లి సీతారామయ్యతో కలిసి పనిచేసి 1990వ దశాబ్దంలో కొండపల్లి పార్టీ బహిష్కరించడంతో కేంద్రకమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరుబాట చేస్తున్న క్రమంలో గెరిల్లా యుద్దం వైపు సాగడంలో గణపతిదే కీలక పాత్ర.

అయితే, గణపతి లొంగుబాటు ప్రయత్నాలపై కొంత భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు సాయుధపోరాటం చేసిన ఆయన లొంగుబాటు మార్గాన్ని ఎంచుకుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టు పార్టీని అంతర్మథనంలో పడేసేందుకే సరికొత్త ప్రచారానికి తెరలేపారా అన్న చర్చ కూడా మొదలైంది. ఏదేమైనా గణపతి కుటుంబీకులు ఈ విషయంపై క్లారిటీ ఇస్తే ఇప్పటివరకూ ఉన్న అనుమానాలన్నీ తొలగిపోనున్నాయి.


Next Story