నియామకాలు పెంచేందుకు సిద్ధమవుతున్న సంస్థలు!

by  |
నియామకాలు పెంచేందుకు సిద్ధమవుతున్న సంస్థలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని కార్పొరేట్ సంస్థలు రికవరీ సాధిస్తున్న సంకేతాలను చూపిస్తున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2021 మొదటి మూడు నెలల్లో ఎక్కువ మందిని నియమించుకోవాలని ఆలోచిస్తున్నాయని సర్వేలో తెలిపింది. దేశవ్యాప్తంగా 1,518 మంది కార్పొరేట్ యజమానుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం..2021 మొదటి త్రైమాసికంలో ఉపాధి 5 శాతం పెరుగుతుందని మ్యాన్‌పవర్ గ్రూప్ నివేదిక అభిప్రాయపడింది. వీటిలో ముఖ్యంగా ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, మైనింగ్, నిర్మాణ రంగాల్లో అధిక శాతం ఉపాధి పెరుగుదల ఉండొచ్చని, మిగిలిన అన్ని రంగాల్లో ప్రతికూల వృద్ధి ఉండేలా కనిపిస్తోందని నివేదికలో తేలింది.

అంతేకాకుండా, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, అనుసరించే విధానాలపై శ్రద్ధ, పోటీ వంటి అంశాలు ఉపాధిని పెంచేందుకు దోహదపడతాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి చెప్పారు. పండుగ సీజన్ తర్వాత ఆర్థికవ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో నియామకాల విషయంలో శ్రద్ధ కనబర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది కార్పొరేట్ యజమానులు.. డిసెంబర్‌లో ఉన్న 44 శాతంతో పోలిస్తే రానున్న తొమ్మిది నెలల కాలంలో నియామకాలు కరోనాకు ముందు స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించారు.


Next Story

Most Viewed