మ్యాన్ హోళ్లే సిగ్గుపడేలా వారి అవినీతి

by  |
మ్యాన్ హోళ్లే సిగ్గుపడేలా వారి అవినీతి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: భారీ వర్షాలు.. ఇటీవల మ్యాన్ హోల్ ఘటన నేపథ్యంలో ఆయా శాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రజల ప్రాణాలతో ముడి పడి ఉన్న అంశం కావడం..రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా పనులు మొదలు పెట్టాయి. ఉన్నవి లేనట్టుగా.. లేనివి ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో చేయితిరిగిన అధికారులు, ఉద్యోగులు ఇప్పడు అదే మాయాజాలం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు చెక్ పెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా అందులోని లొసుగులను ఆసరాగా చేసుకుని లక్ష్యాన్ని అధిగమిస్తున్నారు.

అక్రమాలకు చెక్ పెట్టని టెక్నాలజీ..

వాన నీటిలో కాసుల వేట మొదలైంది. భారీ వర్షాలకు మ్యాన్ హోళ్ల మరమ్మతుల పేరిట అక్రమార్జన ప్రారంభమైంది. మ్యాన్ హోల్ మూతల ఏర్పాటు, మరమ్మతులు, విపత్తు నిర్వహణ పనుల పేరిట అధికారులు ఖజానాకు గండి కొడుతున్నారు. తవ్వేస్తున్నాం.. ఎత్తు పెంచుతున్నామంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నాణ్యత పరిశీలించకపోగా ఎత్తు పెంపు అవసరమా..? లేదా..? అన్నది పట్టించుకోవడం లేదు. ఎక్కడ పనిచేసినా మొబైల్ లో ఫొటో తీసి పంపాలని, జియోట్యాగింగ్ ద్వారా ప్రాంతాలను గుర్తించే వీలుంటుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఒకే మ్యాన్ హోల్ ను రెండు, మూడు కోణాల్లో తీసీ వేర్వేరు చోట్ల పనులు చేసినట్లు చూపెడుతున్నారు. జియోట్యాగింగ్ లో ప్రాంతం పేరే వస్తుంది. దీంతో ఒకే పనిచేసి రెండు మూడు బిల్లులు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహా పనులు చేసి బిల్లులు కాజేసిన ఘటనలు ఇటీవల రెండు జోన్లలో వెలుగు చూసినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా కప్పిపెట్టినట్లు సమాచారం.

ప్రణాళిక లోపం..

వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ దాదాపు రూ.25 కోట్లతో చేపట్టిన పనుల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో అవసరం లేకున్నా మ్యాన్‌హోళ్ల ఎత్తు పెంచుతుండగా, ఇంకొన్ని చోట్ల నాసీరకంగా పనులు చేపడుతున్నారు. దీంతో ప్రజాధనం మ్యాన్‌హోళ్లలో మురుగు పాలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేటర్‌లో నాలుగు లక్షలకుపైగా మ్యాన్‌ హోళ్లు, 1.22 లక్షల క్యాచ్‌పిట్లు ఉన్నాయి. వీటిలో కోర్‌ ఏరియాలో నిర్వహణ వాటర్‌బోర్డు చూస్తుండగా, శివారు సర్కిళ్ల బాధ్యత జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉంది. దశాబ్దాల క్రితం డ్రైనేజీ, వరద నీటి పైపులైన్‌లు వేసిన సమయంలో మ్యాన్‌హోళ్లు నిర్మించారు. కాలగమనంలో రహదారులు నిర్మించడంతో మ్యాన్‌హోల్‌, క్యాచ్‌పిట్‌ మూతలు రోడ్డు కంటే లోతులో ఉండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు కనిపించకుండా వాటి పై నుంచే రోడ్లు వేశారు. మ్యాన్‌హోళ్ల వద్ద గుంతల్లా మారి వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో గ్రేటర్‌ రోడ్లపై ఎక్కువ గుంతలు కనిపిస్తాయి. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా మ్యాన్‌హోల్‌ గుంతలు ఎల్లప్పుడూ సిటీజనుల ప్రాణాలు తీస్తున్నాయి. వాస్తవంగా రోడ్ల నిర్మాణ సమయంలోనే మ్యాన్‌హోల్‌ మూతల ఎత్తు పెంచి కార్పెటింగ్‌ చేయాలి. కానీ ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు ఇంజినీర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి మరమ్మతు పేరిట రూ.25 కోట్లుకు పైగా ఖర్చు చేస్తున్నారు.

అధికారుల కాసుల వేట..!

మ్యాన్‌హోల్‌, క్యాచ్‌పిట్‌ మరమ్మతు పనులు కాంట్రాక్టర్లకు అప్పగించినా మూతలు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డులే ఇస్తున్నాయి. గతంలో ప్రధాన రహదారుల్లో 30టన్నుల సామర్థ్యంతో కూడిన మూతలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు 40 టన్నులకు పెంచారు. మూతల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో మూతకు రూ.3 నుంచి 5 వేల వరకు ఖర్చవుతునట్లు అధికారుల లెక్క. పనులు చేసినందుకు రూ.5 వేల నుంచి రూ.8 వేలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. మొత్తంగా ఒక్కో మ్యాన్‌హోల్‌ ఎత్తు పెంపునకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఖర్చు మొత్తాన్ని బిల్లులో చూపుతూ మూతల ధరను మినహాయిస్తున్నట్లు తెలిసింది. రెండు విభాగాలు చేపడుతున్న పనులకు ఒక్కో మ్యాన్‌హోల్‌కు సగటున రూ.11,356 ఖర్చవుతుండగా, మ్యాన్‌హోల్‌ పరిమాణాన్ని బట్టి ఈ వ్యయంలో హెచ్చు, తగ్గులు ఉంటాయి. రోడ్డు తవ్వి ఎత్తు పెంచినందుకు రూ.5 నుంచి రూ.8 వేలు ఖర్చవుతుందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

క్యూరింగ్ చేయడంలేదు..

పనుల్లో భాగంగా రోడ్డును తవ్వుతున్న సిబ్బంది పాత మ్యాన్‌హోల్‌ మూత తొలగించి కొత్తది ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యాన్‌హో ల్‌ ఎత్తు పెంచుతున్నారు. సిమెంట్‌తో చేసే ఈ పనులకు సరిగా క్యూరింగ్‌ చేయడం లేదు. ఎండల తీవ్రత వల్ల కొన్ని చోట్ల దుమ్ము లేస్తోంది.

-ఎండీ ఇస్మాయిల్, గ్రీన్ పీల్డ్స్ కాలనీ

వ్యర్థాలను తొలగించడంలేదు..

తవ్వకాల్లో భాగంగా వెలువడిన వ్యర్థాలనూ రోజుల తరబడి తొలగించడం లేదు. ఇది రాత్రి వేళ ప్రమాదాలకు కారణమవుతోంది. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని చాణక్యపూరికాలనీ, బాబానగర్, గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ, వెంకటరమణ కాలనీ, నాగలక్ష్మీ, మల్లపూర్ ఓల్డ్ విలేజ్, జేఎన్ఎన్ యూఆర్ఎంలో నాలుగైదు నెలలుగా మ్యాన్ హోళ్ల మరమ్మతులు చేయడంలేదు. రాత్రిపూట కాలనీల గుండా ప్రయాణించాలంటనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

– సీహెచ్ గణేశ్, వెంకటరమణ కాలనీ

కాంట్రాక్టర్ల లబ్ధికోసమే ..

కొన్ని ప్రాంతాల్లో మ్యాన్‌హోల్‌ రోడ్డుకు సమాంతరంగా ఉన్నా మరమ్మతు చేస్తున్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు, అధికారులు జేబులు నింపుకునేందుకు. అవసరమైతే ఈ పనులపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఇటీవల హెచ్చరించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

-సుర్ణం రాజేశ్, ఉప్పల్



Next Story

Most Viewed