'బెంగాల్‌లో గెలిస్తే ఉచితంగా టీకా'

by  |
బెంగాల్‌లో గెలిస్తే ఉచితంగా టీకా
X

కోల్‌కతా: మరో రెండు విడతల ఎన్నికలు మిగిలి ఉన్న బెంగాల్ ఎన్నికల సమరంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య తాజాగా టీకా పంపిణీ అంశం ప్రధాన చర్చగా మారింది. మే 5వ తేదీ తర్వాత రాష్ట్రంలో 18ఏళ్లుపైబడిన వారికి తృణమూల్ ప్రభుత్వం ఉచితంగా టీకా పంపిణీ చేస్తుందని సీఎం మమతా బెనర్జీ గురువారం సాయంత్రం హామీనిచ్చిన గంటల వ్యవధిలో బీజేపీ కూడా ఇదే తరహా వాగ్దానమిచ్చింది. బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని బీజేపీ శుక్రవారం హామీనిచ్చింది. బీజేపీది నకిలీ హామీ అని తృణమూల్ పార్టీ ఆరోపించింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం బీజేపీ చేసిన హామీని గుర్తు చేసింది. కరోనా తొలి వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, అప్పుడు ఇంకా టీకా అందుబాటులోకి రాలేదని టీఎంసీ తెలిపింది.

అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రలోభపెట్టడానికి బిహార్‌లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేస్తామని కేంద్రమంత్రులు హామీనిచ్చారని గుర్తుచేసింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని పేర్కొంది. తాజాగా, ఇతర రాష్ట్రాల్లాగే తాము కూడా 18ఏళ్లు పైబడినవారికి ఉచితంగా టీకా వేస్తామని ప్రస్తుత బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటన చేశారు. గురువారం రాత్రి బెంగాల్‌తోపాటు జార్ఖండ్ ప్రభుత్వమూ ఉచిత టీకా హామీనిచ్చింది. త్వరలో మహమ్మారి చెర నుంచి బయటపడతామని, ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతున్నదని సీఎం హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. 18ఏళ్లు నిండినవారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా టీకా వేస్తుందని ట్విట్టర్‌లో వెల్లడించారు.

Next Story

Most Viewed