పురుషుల్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్.. కండ్లు తెరవకపోతే కష్టం..!

by  |
Male infertility Symptoms ,Diagnosis & Treatment
X

దిశ, ఫీచర్స్ : సంతానలేమి సమస్యలు.. పురుషులు, స్త్రీలు ఎవరినైనా ఒత్తిడికి గురిచేస్తాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు పెళ్లయ్యి చాలా ఏళ్లైనా పిల్లలు పుట్టడం లేదంటే.. లోపం మహిళదే అన్న భావన బలంగా ఉండేది. అందుకు సంబంధించిన పరిణామాలు కూడా వారే ఎదుర్కోవాల్సి వచ్చేది. కుటుంబ సభ్యులు, సమాజం నుంచి వచ్చే సూటిపోటి మాటలు భరిస్తూ ఒకరకమైన అపరాధ భావంతో మానసికంగా కృంగిపోయేవారు. అదే టైమ్‌లో పురుషులు మాత్రం సమస్య తమది కాదనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ.. పిల్లల్ని సాకుగా చూపి మరో పెళ్లికి సిద్ధమయ్యేవారు.

నిజానికి గతంలో సంతాన లేమి సమస్యలు మహిళల్లోనే ఎక్కువగా ఉన్నా.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మగాళ్లలోనూ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. మారిన జీవనశైలి, చెడు అలవాట్లు, స్ట్రెస్‌ఫుల్ జాబ్స్.. వంటివన్నీ ఇందుకు కారణమవుతున్నాయి. మోడ్రన్ కపుల్స్‌లో చాలామంది పురుషుల సమస్య తమదే అని తెలిస్తే, వెంటనే సరైన చికిత్సతో బయటపడుతుండగా.. ఇప్పటికీ అనేక మందిలో ఇన్‌ఫెర్టిలిటీపై అవగాహన శూన్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జూన్ 14-20 వరకు ‘మెన్ హెల్త్ వీక్’ సందర్భంగా.. పురుషుల్లో బయోలాజికల్ సిస్టమ్స్‌‌తో పాటు వారు ఎదుర్కొంటున్న ఫెర్టిలిటీ సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం రెగ్యులర్‌గా అసురక్షిత శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా గర్భం దాల్చకపోతే దంపతుల్లో ఎవరో ఒకరికి ఇన్‌ఫెర్టిలిటీ ఉందని అర్థం. ఈ సమస్య స్త్రీ, పురుషుల్లో 40 శాతం ఉంటుండగా.. ఒక్కోసారి ఇద్దరిలోనూ 20 శాతం ఉండొచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. మేల్ ఫెర్టిలిటీ, రీప్రొడక్టివ్ హెల్త్‌ ఆధారంగా నిర్వహించిన తాజా అధ్యయనం.. మెన్‌లో 51 శాతం రిస్క్ ఫ్యాక్టర్స్‌తో పాటు 45 శాతం ఆరోగ్య సమస్యలు ఇన్‌ఫెర్టిలిటీకి కారణమవుతున్నాయని గుర్తించింది. అంతేకాదు చాలామందిలో ఇన్‌ఫెర్టిలీటీకి కారణమయ్యే మార్చుకోగల ప్రమాద కారకాలు(సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్స్, స్మోకింగ్) గురించి, ఫిక్స్‌డ్ రిస్క్ ఫ్యాక్టర్స్(యుక్తవయసులోకి ఆలస్యంగా ఎంటర్ కావడం, వృషణాల పరిమాణం)తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యల(గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్, రక్తపోటు) గురించి తెలుసని వెల్లడించింది.

అయితే నేటికీ పురుషుల్లో వంధ్యత్వం గురించిన చర్చ నలుగురిలో వినబడదు. అంటే గర్భం ధరించడానికి సవాళ్లను ఎదుర్కొంటున్న జంటలు సైతం తమ సమస్యకు మెన్ ఇన్‌ఫెర్టిలిటీ కారణం కాదనే అనుకుంటారు. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో ఇలాంటి భావన ఒత్తిడికి దారితీస్తుంది. సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఎక్కువమంది పురుషులు వారి పునరుత్పత్తి ఆరోగ్యం గురించి సరైన జ్ఞానం, అవగాహన కలిగి ఉండరు. అంతేకాదు తప్పనిసరైతే గానీ మగవారిలో చాలా మంది యూరాలజిస్టులను లేదా వంధ్యత్వ నిపుణులను కలిసేందుకు ఇష్టపడరు. కానీ ఇన్‌ఫెర్టిలిటీకి సంబంధించి ముందస్తు రోగ నిర్ధారణతో పాటు చికిత్స పొందడానికి పురుషులు ఈ విషయాలను తెలుసుకోవడంతో పాటు సమస్యను అర్థం చేసుకోవడం అవసరమని ఇందిర ఐవీఎఫ్ సీఈవో, కో ఫౌండర్ డాక్టర్ ముర్దియా తెలిపారు.

మేల్ ఇన్‌ఫెర్టిలిటీని ఎలా నిర్దారించవచ్చు?

జనరల్ ఫిజికల్ ఎగ్జామ్, సెమెన్ ఎనాలిసిస్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌ట్రెక్టల్ అల్ట్రాసౌండ్, హార్మోన్ల విశ్లేషణ, కొన్నిసార్లు క్రోమోజోమ్ విశ్లేషణతో పాటు టెస్టిక్యులర్ బయాప్సీ ద్వారా నిర్దారించవచ్చు. సాధారణంగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నా ఫెర్టిలిటీ సమస్య ఏర్పడవచ్చు. సెమెన్ టెస్ట్ ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు. దీంతో పాటు అంగస్తంభన పైనా శ్రద్ధ అవసరం. ఎందుకంటే అనియంత్రిత మధుమేహం న్యూరోపతికి దారితీస్తుంది. ఇటువంటి కేసుల్లో అదనంగా మరిన్ని హార్మోనల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఈ టెస్టుల ద్వారా సమస్యను సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు.

చికిత్స ఎలా ఉంటుంది?

కోఎంజైమ్ క్యూ, సెలేనియం, విటమిన్ ఈ, సీ వంటి సప్లిమెంట్లు వీర్యకణాల సంఖ్యను పెంచేందుకు తోడ్పడతాయి. ఇక అంగస్తంభనం, శీఘ్రస్కలనానికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. హర్మోన్ ట్రీట్మెంట్‌తో పాటు అవసరమైతే రీప్రొడక్టివ్ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. వీటితో పాటు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ చేయాలి. డయాబెటిస్ వంటి ఇతర జబ్బులు ఉన్నవారైతే ఆయా సమస్యల కోసం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంటర్‌కోర్స్ సమయంలో లూబ్రికెంట్స్‌ వాడకుండా ఉండటంతో పాటు, సాధారణ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే ‘ఆల్కహాల్‌, స్మోకింగ్’ వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ డైట్, ఫిట్‌నెస్‌ విషయంలో కేర్‌ తీసుకుంటూ హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవరుచుకుంటే పురుషుల్లో మంచి రీప్రొడక్టివ్ హెల్త్ పెంపొందే అవకాశం ఉంటుంది.

పురుషుల రీప్రొడక్టివ్ హెల్త్‌ కోసం డాక్టర్లు సూచించిన కొన్ని జీవనశైలి పద్ధతులు..

రెగ్యులర్‌గా డాక్టర్‌‌ను కలవండి : మీ రీప్రొడక్టివ్ హెల్త్‌ను కాపాడుకోవాలనుకుంటే మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఆయన మీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసి, సమస్య చేయిదాటక ముందే నివారించేందుకు చర్యలు తీసుకోవచ్చు.

స్మోకింగ్, పొగాకు వదిలేయాలి-ఆల్కహాల్ తగ్గించాలి : స్మోకింగ్ విషతుల్యమైంది. పురుషుల్లో అంగస్తంభన కలిగించే ప్రధాన కారణాల్లో ధూమపానం ఒకటి. దీన్ని వదిలేస్తే సమస్యను అధిగమించవచ్చు. అధిక మోతాదులో ఆల్కహాల్ వినియోగం కూడా ఇన్‌ఫెర్టిలిటీకి దారితీయొచ్చు. అందుకే సందర్భానుసారంగా తప్ప మద్యపానం ఆమోదయోగ్యం కాదు.

పరిశుభ్రత పాటించాలి : ఖచ్చితంగా పాటించాల్సిన ప్రాథమిక నియమాల్లో ఇది ఒకటి. అంటువ్యాధులకు కారణమయ్యే జననేంద్రియాల్లో సూక్ష్మక్రిములు పేరుకుపోకుండా ఉండేందుకు జననేంద్రియాల పరిశుభ్రత తప్పనిసరి.

జీవనశైలిలో మార్పులు : ఊబకాయం అనేక విధాలుగా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. సరైన పోషక ఆహారం తీసుకోవడంతో పాటు శారీరక శ్రమ చేయడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రోజుకు కనీసం 15-20 నిమిషాలు వ్యాయామం చేస్తే సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఇన్‌ఫెక్షన్ల నివారణ : క్లామిడియా, గనేరియా వంటి లైంగిక సంక్రమణలు పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతాయి. మీ లైంగిక భాగస్వాముల సంఖ్యను పరిమితం చేయడం, సంభోగ సమయంలో సేఫ్టీ ఉపయోగించడంతో పాటు సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్స్‌కు సంబంధించి రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారించవచ్చు.

Next Story

Most Viewed