మలక్‌పేట రిటర్నింగ్ ఆఫీసర్ తొలగింపు

by  |
మలక్‌పేట రిటర్నింగ్ ఆఫీసర్ తొలగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అభ్యర్థుల ఎన్నికల చిహ్నంలో లోపం తలెత్తడంతో 26వ డివిజన్ రిటర్నింగ్ అధికారిని రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. అభ్యర్థికి కేటాయించిన గుర్తు విషయంలో సదరు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించని కారణంగా తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆ స్థానంలో కొత్త అధికారిని నియమించనుంది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి డిసెంబరు 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అప్పటికల్లా కొత్త బ్యాలెట్ పేపర్‌ను ముద్రించి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తున్నా అతనికి కేటాయించిన కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు (సీపీఎం ఎన్నికల చిహ్నం) ముద్రించింది. దీంతో అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియను నిలిపివేసింది ఎన్నికల సంఘం. ఈ నెల 3వ తేదీన ఈ డివిజన్‌లోని మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఆ డివిజన్ ఓటర్లంతా ఆ రోజున ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటు వేసినవారు కూడా మళ్ళీ వేయక తప్పదు.



Next Story

Most Viewed