10 శాతం క్షీణించిన మహీంద్రా వాహన అమ్మకాలు!

by  |
10 శాతం క్షీణించిన మహీంద్రా వాహన అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) 2020, డిసెంబర్ అమ్మకాల్లో 10.3 శాతం క్షీణతతో మొత్తం 35,187 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. 2019, డిసెంబర్‌లో మొత్తం 39,230 యూనిట్లను కంపెనీ విక్రయించింది. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 3 శాతం పెరిగి 16,182 యూనిట్లకు చేరుకున్నాయని, కమర్షియల్ వాహనాల విభాగంలో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 16,795 యూనిట్లను విక్రయించింది. 2019, డిసెంబర్‌లో విక్రయించిన 21,390 యూనిట్లతో పోలిస్తే 21.48 శాతం క్షీణించాయని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా గత డిసెంబర్‌లో మొత్తం ఎగుమతులు 3 శాతం పెరిగి 2,210 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో ఎగుమతులు 2,149 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

‘అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ అమ్మకాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లలో ఉపయోగించే మైక్రో ప్రాసెసర్ల సరఫరా కొరత వల్ల అమ్మకాలు దెబ్బతిన్నాయని’ ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ విజయ్ నక్రా చెప్పారు. పండుగ సీజన్ తర్వాత కూడా డిమాండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది పరిశ్రమ మెరుగైన వృద్ధిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.

ట్రాక్టర్ అమ్మకాలు 25 శాతం పెరిగాయి…

అయితే, వ్యవసాయ రంగం మద్దతుతో ఎంఅండ్ఎం ట్రాక్టర్ అమ్మకాలు 2020, డిసెంబర్‌లో 25 శాతం పెరిగి 21,173 యూనిట్లుగా నమోదయ్యాయని, 2019, డిసెంబర్‌లో మొత్తం 17,213 యూనిట్ల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. అలాగే ఎగుమతులు 1,244 యూనిట్లుగా నమోదయ్యాయని, అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో ఎగుమతులు 17,991 యూనిట్లుగా నమోదైనట్టు వెల్లడించింది.

Next Story

Most Viewed