లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆన్ లైన్ లో పెళ్లి

by  |
లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆన్ లైన్ లో పెళ్లి
X

ముంబయి : ఈ నెలలో బలమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. పరిణయమాడి ఏకమయ్యేందుకు ఎన్నో జంటలు ఎదురుచూశాయి. ఎదురుచూస్తున్నాయి. కుటుంబాలు పెళ్లి వేడుకలకు సన్నాహాలు చేసుకున్నాయి. కానీ, కరోనా ప్రవేశించడం.. లాక్ డౌన్.. కర్ఫ్యూ లతో వారి కలల్లో కొంత కలవరం రేగింది. కొన్ని జంటలు పెండ్లి ప్లాన్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. సామాజిక దూరం పాటించాలని.. ప్రజలు గుమిగూడ వద్దన్న ఆదేశాల మేరకు కొన్ని జంటలు నిరాడంబరంగా మనువాడాయి. మనువాడేందుకు సిద్ధమవుతున్నాయి. అమ్మాయి.. అబ్బాయి నివాసాలు దగ్గర్లో ఉంటే నిరాడంబరంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ లాక్ డౌన్ కారణంగా రాకపోకలపై ఆంక్షలున్న నేపథ్యంలో అమ్మాయి.. అబ్బాయి కుటుంబీకులు కలుసుకోలేని దూరంలో ఉంటే పెళ్లి తిప్పలు మరింత పెరిగినట్టే. కానీ మహారాష్ట్రలోని ఓ జంట దూరాలను దగ్గర చేస్తున్న సాంకేతికతను వాడుకుని ఆన్ లైన్ లో పెళ్లి చేసుకుంది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన మొహమ్మద్ మిన్హాజుద్ కు బీడ్ జిల్లాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆరు నెలల క్రితమే పెళ్లి తేదీని ఏప్రిల్ 3 గా ఇరు కుటుంబాలు ఖరారు చేసుకున్నాయి. కానీ, ఇటీవలే కరోనా వైరస్ ముందుకు రావడంతో ఏం చేయాలా? అని ఇరు కుటుంబాలు మల్లగుల్లాలు పడ్డాయి. చివరికి వరుడు వధువు అంగీకారంతో ఆన్ లైన్ లో పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నాయి. అంతే.. ఇరు కుటుంబాల పెద్దలు ఎవరి ఇంట్లో వారు సమావేశమయ్యారు. పెళ్లి పీటలు ఆన్ లైన్ కు ఎక్కించారు. ఖాజీ ముఫ్తీ అనీస్ ఉర్ రెహమాన్ ఈ హైటెక్ వివాహాన్ని శుక్రవారం జరిపించారు. వధూవరులు వీడియో కాల్ లోనే ఖుబూల్ చెప్పుకున్నారు. పెళ్లి ప్రమాణాలు తీసుకున్నారు. ఈ పెళ్లి విజయవంతంగా జరగడం పై ఇరు కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు పెళ్లి చేయగలిగామని, ఆడంబరంగా కాకున్నా.. తక్కువ ఖర్చులోనే వేడుకను జరుపుకున్నామని ఆనందాన్ని పంచుకున్నారు.

Tags: Maharastra, couple, videol call, marriage, online

Next Story

Most Viewed