మహారాష్ట్ర సరిహద్దు మూసివేత!

by  |

దిశ, నిజామాబాద్: కరోనా విజృంభనతో లాక్‌డౌన్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి పూర్తిగా రాకపోకలను నిషేధించింది. సరిహద్దు ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్‌పూర్, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా, రెంజల్ మండలం కందకుర్తి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలను నిలువరిస్తోంది. కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర ఫస్ట్‌ప్లేస్‌లో ఉండటంతో చెక్‌పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు జరుపుతూ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.

జనతా కర్ఫ్యూ ముందువరకు వాహనాలను అనుమతించిన అధికారులు ప్రస్తుతం పూర్తిగా నిషేధించారు. తెలంగాణవాహనాలను మాత్రమే సరిహద్దులోకి అనుమతిస్తుండగా, ఇక విదేశాలకు వెళ్లి మహారాష్ట్ర ద్వారా వచ్చినవారుంటే డైరెక్ట్‌గా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఒక్క సలబత్‌పూర్ చెక్‌పోస్టు వద్దనే 150కి పైగా వాహనాలను సరిహద్దుకు బయట నిలిపివేసిన అధికారులు, లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు అనుమతి ఇచ్చేది లేదని తెలిపారు. అటు బోధన్ సాలూరా వద్ద కూడా 50వాహనాలను నిలిపి వేశారు. వైద్య, నిత్యావసర, కురగాయలు, పాలకు సంబంధించిన వాహనాలకు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు.

పోలీస్, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో చెక్‌పోస్టు వద్ద పహారా కాస్తున్నారు. ప్రైవేట్ టూర్ ట్రావెల్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తే వారి వివరాలను తీసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకున్నా అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

Tags: Maharashtra Border Close, Nizamabad, Check Posts, Kamareddy, Salabatpur, Bodhan, Kandakurthi Check Post



Next Story

Most Viewed