మహారాష్ట్ర, గుజరాత్‌లకు నిసర్గ తుఫాన్ ముప్పు!

by  |
మహారాష్ట్ర, గుజరాత్‌లకు నిసర్గ తుఫాన్ ముప్పు!
X

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్ప పీడనం సోమవారం ఉదయానికి మరింత బలపడింది. మంగళవారం నాటికి ఇది తుఫాన్ రూపం దాల్చవచ్చునని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 3వ తేదీనాటికి నిసర్గ తుఫాన్(త్వరలో ఏర్పడబోయే ఈ తుఫాన్‌కు ‘నిసర్గ’ పేరు పెట్టారు) మహారాష్ట్ర, గుజరాత్ తీరప్రాంతాలను తాకవచ్చునని అంచనా వేసింది. వేగంగా వీచే బలమైన గాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలతో ఈ తుఫాన్ ఈ రెండు రాష్ట్రాలను చేరవచ్చునని వివరించింది. మహారాష్ట్ర, గుజరాత్ తీరప్రాంతాల్లో బుధవారం, గురువారం రెండు రోజులూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపునకు సాగుతున్నదని, అక్కడ సముద్ర పరిస్థితులు తుఫాన్ ఏర్పడటానికి అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయానికి ఈ అల్పపీడనం గోవా రాజధాని పంజిమ్ నుంచి 370 కిలోమీటర్లు, ముంబయి నుంచి 690 కిలోమీటర్లు, సూరత్ నుంచి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మంగళవారం నాటికి ఉత్తరం వైపుగా ప్రయాణించి ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్యం వైపునకు ప్రయాణించవచ్చు. అనంతరం, మహారాష్ట్రకు చెందిన రాయిగడ్‌లోని హరిహరేశ్వర్, డామన్ మధ్య గుండా జూన్ 3వ తేదీన ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీర ప్రాంతాలకు నిసర్గ తుఫాన్ చేరవచ్చునని ఐఎండీ అంచనా వేసింది.



Next Story

Most Viewed