అమ్మకాల సీజన్‌లోనూ ఏసీ, కూలర్లపై ప్రతికూల ప్రభావం!

44

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పలు హోమ్ అప్లయెన్స్ కంపెనీలు ఈ ఏడాదిలో పలు ఉత్పత్తుల గిరాకీ పెరుగుతుందని, అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని ప్రకటించాయి. అయితే, అనూహ్యంగా ఏప్రిల్‌లో కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఎయిర్ కండీషనర్లు(ఏసీ), ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ వంటి గృహోపకరణాల అమ్మకాలపై ప్రభావం ప్రతికూలంగా ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఓ నివేదికలో తెలిపింది. మాములుగా ప్రతి ఏటా వేసవి కాలంలో ఏసీలు, కూలర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. గతేడాది అమ్మకాలపై కరోనా ప్రభావం ఉండటంతో ఈసారి డిమాండ్ అత్యధికంగా ఉంటుందని కంపెనీలు భావించాయి. అయితే అంచనాలు తలకిందులయ్యాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంలేదని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. సాధారణంగా మొత్తం అమ్మకాల్లో 70 శాతానికి పైగా ఏసీ అమ్మకాలు జనవరి-జూన్ మధ్య జరుగుతాయి. మార్చి-మే మధ్య కాలంలో మాత్రమే 50 శాతం అమ్మకాలు నమోదవుతాయి. ఇలాంటి సమయంలో ఆటంకాలు ఏర్పడితే పరిశ్రమ వృద్ధిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నివేదిక తెలిపింది. ఈ ఉత్పత్తులను కొనాలంటే వీటిని ఇంట్లో అమర్చేందుకు మెకానిక్‌లు ఉండాలి. కరోనా విజృంభిస్తున్న వేళ ఇది ప్రమాదకరమని కస్టమర్లు భావిస్తున్నారు. సాంకేతిక కారణాలతో అమ్మకాలు తగ్గిపోయాయని నివేదిక వివరించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో కంపెనీలు వీటి ధరలను కూడా పెంచేశాయి. అమ్మకాలు తగ్గేందుకు ఇది కూడా కరణమని నివేదిక వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..