రెండు నెలల్లో రూ.6 లక్షల కోట్ల రుణాలు!

by  |
రెండు నెలల్లో రూ.6 లక్షల కోట్ల రుణాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : గడిచిన రెండు నెలల కాలంలో దాదాపు రూ.6 లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మంజూరు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 నివారణకు విధించిన లాక్‌డౌన్ వలన దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు(ఎమ్ఎస్ఎమ్ఈ), కార్పొరేట్ రంగాలకు ఈ రుణాలు జారీ చేశాయన్నారు. మార్చి 1 నుంచి మే 8 నాటికి సుమారు 46.74 లక్షల ఖాతాలకు రూ. 5.95 లక్షల కోట్ల రుణాలను పీఎస్‌బీలు బదిలీ చేశాయని మంత్రి వివరించారు. పీఎస్‌బీల నుంచి రూ. 1.18 లక్షల కోట్ల రుణాలను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీలు) పొందినట్టు చెప్పారు.లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుత నిధుల ఆధారిత నిర్వహణ మూలధన పరిమితిపై 10 శాతం అదనంగా, గరిష్ఠంగా రూ. 200 కోట్ల వరకు రుణాలివ్వడానికి పీఎస్‌బీలు సిద్ధమైన సంగతి తెలిసిందే. అలాగే అత్యవసరంగా రుణాలను పొందేందుకు, నిర్వహణ మూలధన పరిమితి పెంచడానికి అర్హత ఉన్న వారిలో 97 శాతం రుణగ్రహీతలను మార్చి 20 నుంచి మే 8 మధ్య కాలంలో పీఎస్‌బీలు సంప్రదించి రూ. 65,879 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు మరో ట్వీట్‌ ద్వారా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed