'వనపర్తి ఒడిలో...' సమీక్ష

by Disha edit |
వనపర్తి ఒడిలో... సమీక్ష
X

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి నగరాన్ని మిత్రులు రాఘవశర్మ పూనారా.,. లేక రాఘవ శర్మని వనపర్తి పూనిందా... 'వనపర్తి ఒడిలో' పుస్తకం చేతిలోకి వచ్చాక, నవల కంటే మించిన పఠనాసక్తితో చదివాక నాకు కలిగిన అనుభూతి ఇది. పూనడం అనే భావనను మనం ఒప్పుకోకపోవచ్చు కానీ, 50 ఏళ్ల క్రితం వనపర్తి ప్యాలెస్‌లోని ఇంట్లో బాల్యాన్ని గడిపిన రచయిత అనంతరం తండ్రి ఉద్యోగరీత్యా 1973 జూలై 25న వనపర్తికి వీడ్కోలు పలికి తిరుపతికి వెళ్లారు. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత తన 14 సంవత్సరాల వనపర్తిలో జ్ఞాపకాలను మధురాతి మధురంగా వలపోసుకుంటూ ధారవాహికగా రాసి స్థానిక చరిత్ర రచనలలో వనపర్తిని తలమానికంగా నిలిపారు.

చిన్ననాటి జ్ఞాపకాల అద్భుత చిత్రీకరణ

స్థానిక చరిత్రలే దేశ చరిత్రకు పునాదులు అనే మాట ఎంత అక్షర సత్యమో వనపర్తి ఒడిలో పుస్తకంలో ప్రతి పేజీ, ప్రతి అక్షరం నిరూపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది రచయిత చిన్ననాటి జ్ఞాపకాల అద్భుత చిత్రీకరణ. మన తరంలో రాఘవశర్మ గారి జ్ఞాపకశక్తి అమోఘం, మహాద్భుతం అని చెప్పాలి. 50 సంవత్సరాల వెనుకటి తన బాల్య జ్ఞాపకాలను ఇంత సజీవంగా, నిన్ననో మొన్ననో చూసిన చందాన గుర్తుపెట్టుకుని రాయడం అసాధ్యమైన పని. కొన్ని జ్ఞాపకాలు రచయితే చెప్పుకున్నట్లు జీవితంపై చెరగని సంతకంలా నిలిచిపోతాయి. అవి ఎన్నటికీ చెరిగిపోవు. బతికినంతకాలం వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని వేటాడుతూనూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యపు జ్ఞాపకాలు. తన బాల్యాన్ని పండించిన వనపర్తిని పదేళ్ల క్రితం తిరుపతి నుంచి ప్రత్యేకంగా రైల్లో వచ్చి చూసిన రచయిత, ఎత్తైన భవనాల ముందు చిన్నపోయినట్లు కనిపించిన సుందర రాజభవనం చిన్నబుచ్చుకున్నట్లుంది అంటూ వర్ణించారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన పిదప నెహ్రూ పిలుపుమేరకు దేశంలో విలీనమైన తొలి సంస్థానంగా వనపర్తి చరిత్రలో నిలిచిపోయింది.

మాటలకు సాక్ష్యంగా అరుదైన ఫోటోలు

వనపర్తి నుంచి తిరుపతికి వచ్చి యాభై ఏళ్లైన సందర్భంగా, జింకా నాగరాజు గారు నిర్వహిస్తున్న ట్రెండింగ్‌తెలుగున్యూస్‌డాట్‌కామ్ లో 'తిరుపతి జ్ఞాపకాలు' రాయడం మొదలుపెట్టిన రచయితకు, మహబూబ్ నగర్ నుంచి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి గారు ఫోన్ చేసి 'మీలాంటి బిడ్డ ఊరుకొకరుంటే ఎంత బాగుంటుంది. స్థానిక చరిత్రలు బైటికొస్తాయి. తిరుపతి జ్ఞాపకాల లాగానే వనపర్తి జ్ఞాపకాలు కూడా రాయొచ్చు కదా' అన్నారు. వనపర్తిలో రచయిత క్లాస్‌మేట్ సీసీ రెడ్డి కూడా ఇదే మాట అనడంతో ఆ ఇద్దరి స్ఫూర్తితో వనపర్తి జ్ఞాపకాలు 2023 జనవరి 1 నుంచి రాయడం మొదలెట్టారు. డాక్టర్ గోవిందరాజు చక్రధర్ గారి సూచన మేరకు 'వనపర్తి జ్ఞాపకాలు'ను 'వనపర్తి ఒడిలో' అని మార్చారు. ఈ పుస్తకాన్ని అచ్చేసే బాధ్యతను పాలమూరి అధ్యయన వేదిక భుజానికెత్తుకుంది.

ఈ పుస్తకం ముద్రణ బాధ్యతలతో పాటు రెండు వారాల క్రితం ఓ ఆదివారం (25-02-2024) వనపర్తి ప్యాలెస్ ఆడిటోరియంలో 250 మందికి పైగా సభికుల సమక్షంలో ఈ పుస్తకావిష్కరణను గొప్పగా నిర్వహించిన ఘనత రాఘవాచారిగారికీ, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులకూ దక్కుతుంది. వేదికపైన ఉన్న వారికే కాదు. నాటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉచితంగా ఈ పుస్తకం కాపీలను ఇచ్చి చదవాలని, పదిమందితో చదివించాలని చెప్పిన ఔదార్యం వీరిది. ఇంతమంది ప్రోత్సాహంతో తెరవెనుక వ్యక్తులు అందించిన సహకారంతో అందంగా తయారైన పుస్తకానికి నిజంగా వెలుగు నిచ్చింది వనపర్తి ప్రభాకర్ గారు తీసి పంపిన ఫోటోలు. 50 ఏళ్ల వనపర్తి జ్ఞాపకాలను ప్రతిబింబిస్తూ ఆయన తీసి పంపిన ఫోటోలు రచయిత మాటలకు, అక్షరాలకు సాక్ష్యంగా నిలబడ్డాయంటే ఆశ్చర్యం లేదు.

కాదేదీ కవిత కనర్హం

ఈ పుస్తకం స్థల పురాణాలకు ఏమాత్రం తీసిపోదు. పురాణాలు గొప్ప గొప్ప వారి చరిత్రలను ఆధారంగా చేసుకుంటే వనపర్తి చరిత్రను రచయిత కింది నుంచి రాసుకొచ్చారు. వనపర్తిలో సామాన్య కుటుంబాలు, కోటలోని పాలిటెక్నిక్ కళాశాల చుట్టూ పెనవేసుకున్న ఉపాధ్యాయులు, సిబ్బంది చుట్టూ అల్లుకున్న మానవీయ బంధాల గురించి రాసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆనాటి ప్యాలెస్ లోని తన ఇల్లు గురించి, పొట్టుపొయ్యి గురించి, కట్టెల పొయ్యి గురించి, బొగ్గుల కుంపటి, వంటకాల గురించి రమణీయంగా రాసుకొచ్చారు. 'అలాగని ఆ జ్ఞాపకాలు రచయిత కుటుంబానికో, వ్యక్తికో, లేదా వనపర్తికో పరిమితమైనవిగా కనిపించవు. ప్రతి కథనంలో, ప్రతి పేజీలో ఆనాటి గ్రామీణ జీవిత పునాదుల ముఖచిత్రాన్ని, సమిష్టి జీవితపు గొప్పతనాన్ని వర్ణిస్తారు'.

26 ఉపాఖ్యానాలుతో రూపొందిన 'వనపర్తి ఒడిలో' పుస్తకాన్ని మొదటే చదివిన ఆచార్య జి. హరగోపాల్ (చిన్నప్పటి జ్ఞాపకాల అద్భుత చిత్రీకరణ), ఆచార్య వకుళాభరణం రామకృష్ణ (స్థానిక చరిత్రలే దేశ చరిత్రకు పునాదులు) పేరిట ముందుమాటలను హృద్యంగా రాశారు. ఎం. రాఘవాచారి (ఎదలోతులు మీటిన వనపర్తి ఒడిలో) పేరిట వెనుకమాటను కళ్లు చెమర్చేలా రాశారు. ఈ మూడు వ్యాసాలతో ఈ పుస్తకం సారాంశాన్ని వీరు అద్భుతంగా పరామర్శించారు.

దేశదేశాలను చుట్టిన వనపర్తి జ్ఞాపకాలు

అందుకే పుస్తకంగా రాకముందే 'వనపర్తి ఒడిలో' ఎక్కడెక్కడికో పయనించింది. వెబ్ సైట్‌లో పోస్ట్ అవుతున్నప్పుడే అనేక వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. రచయిత మాటల్లోనే చెప్పాలంటే ఏడు ఖండాలను, సప్త సముద్రాలను దాటేసింది. భూగోళానికి ఆవల ఉన్న అమెరికాను చేరింది. గల్ఫ్ తీరాలనూ తాకింది. వనపర్తి విడిచి దేశదేశాలకు జీవిక కోసం వెళ్లిపోయిన ఎందరినో పలుకరించి వారి హృదయ కవాటాలను తెరిచింది. దశాబ్దాల వారి మౌనాన్ని బద్దలు గొట్టింది. మది పొరల్లో దాగి ఉన్న జ్ఞాపకాలను పదుగురితో పంచుకోవడానికి వనపర్తి ఒడిలో ప్రేరేపించింది. ఇంతమందిని ఎందుకు ఈ పుస్తకం కదిలించిందో రచయితే చెబుతారు.

పలుకింత.. పులకింత

రోజురోజుకూ సామాజిక జీవితం సంక్లిష్టమవుతూ, మానవ సంబంధాలను క్లిష్టమైన ఆర్థిక స్థితిగతులు నిర్దేశిస్తూ, నోటికి తాళాలు వేస్తూ, పలుకు బంగారమైపోతో, పక్కింటి వారితో మాట్లాడటమే కరువైపోతో, పక్కనున్న మనిషితో మాటల్లేని, కుటుంబంలోనే పలకరింపులు లేని ప్రస్తుత జీవితంలో, పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలోకి, పెద్దలను వృద్ధాశ్రమాల్లోకి పంపుతున్న సంక్షుభిత సమయంలో 'వనపర్తి ఒడి'లో ఎందరినో ఆప్యాయంగా పలకరించింది. తన చిన్న నాటి జ్ఞాపకాల పలుకు ఇంతైతే, దేశదేశాల నుంచి స్పందించి తన జ్ఞాపకాలను సొంతం చేసుకున్న వారి పులకింత అంతగా ఉందంటారు రచయిత.

ఆ పలుకుల, పలకరింపుల పరిమళాల తీయదనాన్ని ఆస్వాదించాలంటే 'వనపర్తి ఒడిలో' కంటే మించిన పుస్తకం మరొకటి దొరకదు. ముఖ్యంగా ఈ పుస్తకం లోని ఒక్కో కథనం చదువుతూ పోతుంటే మన చుట్టూ ఉన్న వారి జీవితాలపై, ఆ పాత జ్ఞాపకాలపై రాయడం ఇంత సులభమా, అవి ఇంత హృద్యంగా ఉంటాయా? అనిపించక మానవు. చివరగా... 'వనపర్తి ఒడి'లో పుస్తకం రచయితది మాత్రమే కాదు... మీదీ, నాదీ, మనందరిదీనూ.

ప్రతులకు

'వనపర్తి ఒడిలో'

పుటలు -150. వెల 150

పాలముూరు ప్రచురణలు - 55

ఆలూరి రాఘవ శర్మ - 94932 26180

అన్ని ప్రముఖ పుస్తకాల ప్రచురణ సంస్థల్లో లభ్యం


సమీక్ష

కె. రాజశేఖర రాజు

73496 94557



Next Story

Most Viewed