మరపురాని ' అమ్మ '

by Disha edit |
మరపురాని  అమ్మ
X

హృదయాన్ని తాకిన కథను ఎప్పటికీ మరిచిపోలేం. ఏళ్లు గడిచినా మన కళ్ళ ముందు నిలిచే ఉంటుంది. ఇలాంటి స్త్రీలు నీకు ఎక్కడ కనిపిస్తారు ? మాకు కనిపించరేం ? అని చలాన్ని మిత్రులు అడిగినప్పుడు, ‘మన చుట్టూ ఉంటారు.. మనం గమనించం అంతే’ అంటూ సమాధానమిస్తాడు చలం. కొద్ది మంది మాత్రమే మనకు కనిపించని స్త్రీ వ్యక్తిత్వాలను చూడగలరు. కొద్దిమంది రచయితలు మాత్రమే అలాంటి స్త్రీల మనస్తత్వాలను బంధించి వారి కథల్లో మనకూ చూపిస్తారు. అలాంటి కథను చదివి లోతుగా ఆ పాత్ర మనసుల్లోకి వెళ్లి మనం చూసామా? కొందరి స్త్రీల పట్ల మన అభిప్రాయాలు, మన ఆలోచనలూ మారిపోతాయి.

చలం తరువాత వేశ్యా జీవితాలను లోతుగా పరిశీలించిన రచయిత సలీం. వెలయాలు, కులట, జార స్త్రీ, వేశ్య.. సమాజం ఏ పేరుతో పిలిచినా సలీం కథల్లో మాత్రం ఆమె మనసున్న మానవతా మూర్తి. వేశ్యా జీవితాలను నేపథ్యంగా తీసుకుని సలీం ఎన్నో కథలు రాశారు. అందులో అమ్మ (1995) కథను ఎప్పటికీ మరిచిపోలేం.అమ్మ కథలో నాగమణి ఓ వేశ్య. పాతికేళ్ల వయసు ఉంటుంది. నా అనే దిక్కు ఉండరు. తన శరీరాన్ని అమ్ముకుంటేనే నాలుగు మెతుకులు నోట్లోకి పోతాయి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఆ మురికి కూపంలోనే ఆమె బ్రతుకు గడిచిపోతూ ఉంటుంది. నాగమణి గుడిసెకు కాస్త దూరంలో స్వరాజ్యం, కొండడి గుడిసె ఉంటుంది. రిక్షా తొక్కే కొండడు ఏరోజుకారోజు రెండు రూపాయలు తెచ్చి స్వరాజ్యాన్ని మహారాణిలా చూసుకుంటూ వుంటాడు. కొండడికి ఓ రోజు విష జ్వరం వస్తుంది. వారి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. నాలుగు రోజులు గడిచాక జ్వరం తగ్గుతుంది. కానీ శవంలా మారిన కొండడు ఆకలితో మెలి తిరిగిపోతూ ఉంటాడు. లోకం తెలియని స్వరాజ్యానికి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరి ముందు చేయి చాచాలో తెలియదు. ఆప్యాయంగా పలకరించే నాగమణి గుర్తొస్తుంది.

నాగమణి అంటే కొండడికి చెడ్డ కోపం. ఆమె నీడ కూడా పడడం ఇష్టం ఉండదు. కానీ ఈ పరిస్థితుల్లో తప్పదు. స్వరాజ్యం వెళ్లి నాగమణితో ఓ రెండు రూపాయలు ఇవ్వమని ఆకలి తీర్చమని అడుగుతుంది. సమయానికి నాగమణి దగ్గర డబ్బు ఉండదు. ఏం చేయాలో తోచదు. ఆకలి తీర్చాలి. లేదంటే కొండడు చస్తాడు. నాగమణి ఓ రోగిష్టి దగ్గరికి వెళ్లి తన శరీరాన్ని రెండు రూపాయలుకు అమ్ముతుంది. ఆ రెండు రూపాయలు తెచ్చి స్వరాజ్యానికి ఇస్తుంది. దీంతో కొండడి ఆకలి తీర్చమని చెప్తుంది. కథ ఇంతే. మనసుపెట్టి చదివిన పాఠకులకు మాత్రం నాగమణి పాత్ర ఆకలి తీర్చే అమ్మలా కనిపిస్తుంది.

అన్ని సమస్యల కన్నా ఆకలి మహా ఘోరమైనది. స్త్రీల మానప్రాణాలు బలైపోయేందుకు ఆకలి కూడా ఓ ముఖ్య కారణమే. ఎంతోమంది అభాగ్యులు నిస్సహాయ స్థితిలో, ఆకలి తీర్చుకోవడానికి తెలిసి తెలియని పరిస్థితుల్లో, ఒంటరి బ్రతుకుల్లో దారి తప్పుతూ ఉంటారు. వీరి శరీరాలు మలిన పడతాయే కానీ వారి మనసులు పవిత్రంగానే ఉంటాయి. స్త్రీ మనసు ఎప్పటికీ మలిన పడదు. అది స్వచ్ఛమైనది. స్త్రీ ఎప్పటికీ అమ్మే. ఆకలి తీర్చే అమ్మ. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా..

-వి పద్మ,

తెలుగు ఉపాధ్యాయురాలు

98666 23380



Next Story

Most Viewed