ప్రజా కళా రూపాల సైరన్ డప్పు

by Disha edit |
ప్రజా కళా రూపాల సైరన్ డప్పు
X

మానవ పరిణామ క్రమంలో కళారూపాలు, జీవన క్రియల్లో భాగస్వామ్యం అయ్యాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో డప్పు. జానపద కళారూపాల్లో డప్పు అత్యంత ప్రాచుర్యం పొందింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాదరణ పొందిన కళారూపం డప్పు ప్రదర్శన. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అంటూ పీడిత ప్రజలతో మమేకమై ప్రజా విముక్తి పోరాటాలలో భాగస్వాములై అసువులు బాసిన వారందరో. బుర్రకథ నాజర్, సుబ్బారావు ప్రాణిగ్రహి, ప్రజాయిద్దనౌకగా కీర్తించబడిన గద్దర్, డోలకు దయ, డప్పు రమేష్ ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేకమైన బాణీ - శైలి. అయినప్పటికినీ డప్పు కళారూపానికి ప్రత్యేకత ఉంది. కారణం ఈ కళారూపం విశేష ప్రజా బాహుళ్యానికి చేరువలో ఉండడమే.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, సాయుధ రైతాంగ పోరాట కాలంలో, విప్లవోద్యమంతో విడదీయరాని బంధం పెనవేసుకుంది డప్పు. పీడిత ప్రజల ప్రచారాయుధంగా పని చేసింది డప్పు. సామాజిక ఉద్యమాల పట్టుగొమ్మ డప్పు. అణగారిన వర్గాల సహచరి డప్పు. అణచివేతను బ్రద్దలు చేసి శబ్దం డప్పు. ఇంటి పేరు డప్పుగా మారిన కళాకారులు - డప్పు రమేష్ (J. N. M.), డప్పు ప్రభాకర్(P. K. M.), డప్పు కరుణాకర్(వి.ర.సం) ... ఇలా డప్పుకు గుర్తింపు తెచ్చిన వారెందరో! ఇప్పుడు...అందె భాస్కర్ ద్వారా (ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత) అంతరించిపోతున్న కళారూపానికి గుర్తింపు అవకాశం దొరికింది.

నిజానికి ప్రజా కళల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కళారూపం డప్పు. చాటింపు డప్పు. పెళ్లి డప్పు, చావు డప్పు, గ్రామదేవతల పండుగలో డప్పు. ప్రజా జీవనంలో మమేకమైన డప్పు చావులో, పెళ్ళిలో కనిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉండే కళా వాయిద్యం డప్పు. ఉన్నోడు, లేనోడు తేడా లేకుండా అందరూ వాయించడానికి ఇష్టపడే వాయిద్యమే ఈ డప్పు. అందరూ ఇష్టపడే, జనాలను ఉర్రూతలూగించే కళాబృందాలు కనుమరుగు కావడం, ఆదరణ లేకపోవడం, ప్రత్యామ్నాయ రూపాలు అందుబాటులోకి రావడం వల్లనే. ప్రజలందరూ ఇష్టపడే ఇలాంటి కళాకారుల బృందం భవిష్యత్ తరాలకు ఒక చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఎన్నో విధాలుగా ప్రాచుర్యం పొందిన, ప్రధానంగా దళిత కళాకారులకు ఉపాధిని, గుర్తింపును తెచ్చింది డప్పు. జంతు చర్మంతో చేసిన డప్పు ఇప్పుడు ఉనికిలో లేదు. ప్లాస్టిక్ డప్పులు వచ్చాయి. కీబోర్డ్ వచ్చాక దాదాపు డప్పు వాయిద్యం అదృశ్యమైపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వాయిద్యాలు ఆదివాసుల దగ్గర, దళితవాడల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే మిగిలాయి. ప్రాచీన వాయిద్యమైన డప్పు కళా రూపాన్ని అంతరించి పోకుండా కాపాడుకోవడం కళాకారుల, ప్రజలందరి చారిత్రక బాధ్యత!

(సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డప్పు రమేష్ సంస్మరణ సభ )

- రమణాచారి

99898 63039



Next Story

Most Viewed