బుక్ కల్చర్ వైపు నడిపించే పుస్తకం

by Disha edit |
బుక్ కల్చర్ వైపు నడిపించే పుస్తకం
X

పిల్లల కథలు ఎలా ఉండాలి పిల్లలు ఎటువంటి కథలు ఇష్టపడతారు పిల్లలు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన రచయితలు బాలల రచయితలుగా పిల్లల హృదయాలను చూరగొంటారు.

నిజానికి పిల్లలు పుస్తకానికి దగ్గర అవ్వాలంటే అది ఆకర్షణీయంగా ఉండాలంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఆకర్షణీయమైన ముఖచిత్రంతో బొమ్మలతో ఉన్నప్పుడు పిల్లలు దాని పట్ల ఆకర్షితులవుతారు. పిల్లల కథల్లో భాష వారు నిజజీవితంలో మాట్లాడుకుంటున్న భాషకు దగ్గరగా ఉండాలి. దీర్ఘ సమాసాలు, నిఘంటు సహాయంతో చదవగలిగే పదాలు బాలల కథల్లో ఏ కోశానా కనిపించకూడదు. పిల్లల నిజ జీవితానికి దగ్గరగా ఉన్న వస్తువుతో రాసిన కథలను పిల్లలు బాగా ఇష్టపడతారు.

ముక్కామల జానకిరామ్ రాసిన 'ఆఫ్ లైన్' కథలకు పైన పేర్కొన్న లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. పేరు పెట్టడంలోనే రచయిత లక్ష్యం స్పష్టమవుతున్నది. కరోనా కాలం తర్వాత పిల్లలు పూర్తిగా ఆన్లైన్ ప్రపంచానికి ఆకర్షితులవడం వల్ల పుస్తకం పట్ల శ్రద్ధ తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఇటీవల సర్వేలన్నీ పిల్లలకు చదవడం రాయడం రావడం లేదని ఘోషిస్తున్నాయి అంటే దాని మూలాలను అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన జానకిరామ్ పుండు ఎక్కడ ఉందో మందు అక్కడ పెట్టాలనుకున్నాడు. అందుకే ఆఫ్ లైన్ కథలకు శ్రీకారం చుట్టాడు. కరోనా కాలంలోనే ప్రారంభించి రెండు సంవత్సరాల్లో రాసిన అరవైకి పైగా కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఇరవై రెండు కథలు ఇవి.

జానకిరామ్ కథల్లో వాయసవనం, కాకుల గుట్ట, సుందరవనం, నందనవనం, కుంతల అరణ్యం, అలకానంద అరణ్యం, చంద్రవంక అడవి, హరిత మాల అరణ్యం, చవన అరణ్యం చంద్ర కోన అడవి వంటి జానపద కథల్లో కనిపించే అడవుల పేర్లే కాక డాట్ కామ్ అడవి, అమెజాన్ అడవి, జొమాటో అడవి వంటి అత్యాధునికమైన పేర్లతో కూడిన అడవులు కూడా కనిపిస్తాయి. అలాగే రూటర్, బ్రూసి, చిన్ను, చిట్టి, తేజు అనే కుందేళ్లు, జామర్, ఆరాధ్య, అకిరా అనే ఉడతలు, బాంబి, జిత్తు అనే నక్కలు సుచలుడు అనే సింహం, హరిణి అనే జింక, చేపల రాజు పేరు కొర్ర రాజు ఆయా కథల్లో కనిపిస్తాయి. ఈ పేర్లు పెట్టడంలోనే కథకుడు పిల్లలను ఆకర్షిస్తాడు.

ఈ కథల్లో పదమూడు కథలు జంతువులు పక్షులు, పాత్రలుగా కలిగి ఉన్న కథలు. ఈ పాత్రలన్నింటిలో మానవ స్వభావం ఇమిడి ఉంది. జానకిరామ్ తాను పిల్లలకు చెప్పదలచిన అంశాన్ని పశుపక్షాదుల పాత్రల ద్వారా అలవోకగా చెప్పగలిగాడు. ఎంతటి సంక్లిష్టమైన విషయాన్నైనా పిల్లలకు అర్థమయ్యే స్థాయిలో చెప్పవచ్చు అంటారు మానసిక శాస్త్రవేత్తలు. జానకి రామ్ పిల్లల మనస్తత్వాన్ని బాగా తెలిసినవాడు కనుక పిల్లల స్థాయికి దిగి కథలు రాయగలిగాడు.

ఇక కథల్లోకి వెళితే నేటి పిల్లలు ఎదుర్కొంటున్న సామాజిక మానసిక సమస్యలు చర్చించడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించే దిశగా ఈ కథలు సాగాయి. పిల్లలు కంప్యూటర్కు సెల్ ఫోన్‌కు అతుక్కుపోయిన వైనం చూసి మురిసిపోయే తల్లిదండ్రులు ఎందరో... నిజానికి పిల్లలు ఏం చేస్తున్నారు. అందులో ఏం చూస్తున్నారు అనే విషయంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. లేకపోతే ఆన్లైన్ స్నేహాలు ఇతరత్రా చెడు మార్గం పట్టే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించమని హెచ్చరించే కథ 'అంతర్జాలంలో ఉడుత'. భౌతిక రూపం కంటే మనం చేసే పనుల వల్ల మనకు గౌరవం దక్కుతుంది అని తెలియజెప్పే కథ 'రంగు రంగుల కాకి'. సోషల్ మీడియాలో అపరిచితుల స్నేహాల వల్ల జరిగే అనర్థాలను విడమర్చి చెప్పే కథ 'తెరపై స్నేహం.. తెర వెనుక ద్రోహం '. ఇతరులను బాధపెట్టి సంతోషించే శాడిస్ట్ బుద్ధికి గుణపాఠం చెప్పిన కథ 'నక్క తిక్క కుదిరింది'.

మనుషుల్లో అంతరిస్తున్న మానవత్వాన్ని గురించి చర్చించిన కథ 'చిలుక సాహసం'. వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించే కథ 'సారీ నాయనమ్మ '. స్వార్థ బుద్ధి తగదని చెప్పే కథ 'మారిన బుజ్జి కుందేలు'. పట్నంలో పిల్లలు ఏం కోల్పోతున్నారో తెలియజేసే కథ 'పట్నం వచ్చిన మామయ్య'. జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే అనర్థాలను తెలిపే కథ 'అమ్మ చెప్పిన పాఠం'. బాలల సామాజిక స్పృహను ఆవిష్కరించిన కథ ''బలే బలే బాలల చెరువు '. ధైర్యం కోల్పోకూడదు అని తెలిపే కథ 'అకీరా అరణ్య యాత్ర '. ఆపదలో ఆదుకునే వాడే 'అసలైన మిత్రుడు' అని చెప్పే కథ, నమ్మకద్రోహం పనికిరాదు అని తెలిపే కథ, సెల్ ఫోన్ పుణ్యమా అని తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవడం లేదనే అపవాదు ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీనివల్ల కలిగే అనర్ధాలను తెలిపే 'కథ కాస్త టైం కావాలి '

ఆన్లైన్ కంటే ఆఫ్ లైన్ జీవితమే గొప్పది అని తెలిపే కథ 'ఆఫ్ లైన్ '. చిన్నపిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలను తెలిపే కథ 'జ్ఞానోదయం'. పరుల మాటలు నమ్మి సహజ సామర్ధ్యాలను వదిలివేస్తే కలిగే ఇబ్బందులను తెలిపే కథ 'కోకిల గానం నెమలి నృత్యం'. పదవి అనేది నీతి నిజాయితీతో మాత్రమే సంపాదించుకోవాలి గాని వక్రమార్గాలు కూడదని చెప్పే కథ 'నక్కకు ఆశాభంగం'. సమయపాలన పాటించాలి అని చెప్పే కథ 'అమ్ములు మారిందోచ్'. తల్లిదండ్రుల మాట జవదాట కూడదని చెప్పే కథ 'తప్పు తెలుసుకున్న బుజ్జి కుందేలు'. జీవవైవిద్య అవసరాన్ని చాటి చెప్పే కథ 'కప్ప మేలు'. ఇట్లా కథలన్నీ పిల్లలకు జీవన విలువలు అందించేవే. పిల్లలను లుక్ కల్చర్ నుండి బుక్ కల్చర్ వైపు మళ్లించేవే. పుస్తకంలోని అన్ని పేజీలను రంగుల బొమ్మలతో వేయడం వల్ల ఈ పుస్తకం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.

ఇటీవల కాలంలో బాలసాహిత్యంలో విస్తృతంగా కథలు రాస్తున్న ఈ యువ రచయిత... పిల్లల్లో నైతిక విలువలు పాదుగొలపడానికి ఉపయుక్తమైన కథలు వెలువరిస్తున్నారు. ఆన్లైన్ ప్రపంచంగా మారుతున్న కోవిడ్ అనంతర కాలంలో పిల్లలను పుస్తకం వైపు మళ్లించడానికి ఈ ఆఫ్ లైన్ కథలు ఒక చారిత్రక అవసరం. ముక్కామల జానకిరామ్ రాబోయే కొన్ని దశాబ్దాలకు బాల సాహిత్యానికి గొప్ప భరోసా సంతకం.

పుస్తకం : 'ఆఫ్ లైన్' కథలు

పుటలు: 80 - వెల : 200

ప్రతులకు: నవతెలంగాణ బుక్ హౌస్

ప్రక్రియ : బాలల కథలు

రచయిత: ముక్కామల జానకీరామ్

63053 93291


సమీక్షకులు

డాక్టర్ సాగర్ల సత్తయ్య

79891 17415



Next Story

Most Viewed