పుస్తక సమీక్ష: ఇవి మ‌న ఇంటి క‌థ‌లే

by Disha edit |
పుస్తక సమీక్ష: ఇవి మ‌న ఇంటి క‌థ‌లే
X

'నాకూ, నాన్న‌కు టీ, టిఫిన్‌, మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి, క్యారియ‌ర్లు క‌ట్టి పంపుతుంది. ఇంటి ప‌నంతా ఒక్క‌తే చేస్తుంది. సాయంత్రాలు త‌ల‌నొప్పి అంటూ జెండూబామ్‌తో తంటాలు ప‌డుతుంది. కాళ్ల‌నొప్పులంటూ రాత్రుళ్లు నిద్ర‌రాక మంచం మీద అటూఇటూ క‌దులుతూ స‌త‌మ‌త‌మ‌వుతుంది. రెండు, మూడుసార్లు లోబీపీతో క‌ళ్లు తిరిగి ప‌డిపోయింది. హెల్త్ కంప్లైట్స్ ఏమీ లేవు?''

మన కళ్ల ముందు జరిగినట్లు..

ఇదంతా చ‌దువుతుంటే ఇంట్లో మ‌న అమ్మ గురించే చెబుతున్న‌ట్లు ఉంది క‌దూ. అవును విశీ రాసిన ఈ మైక్రోక‌థ‌లు పుస్త‌కంలో ఇలాంటివి చాలా ఉంటాయి. అన్నీ మ‌న క‌ళ్ల ముందు జ‌రిగిన‌ట్లుగానే అనిపిస్తాయి. మ‌న జీవితంలో తార‌స‌ప‌డ్డ‌ట్లుగానే ఉంటాయి. పుస్త‌కం చ‌దువుతుంటే ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. పైగా ఏదో చ‌దువుతున్న ఫీలింగ్ కూడా క‌ల‌గ‌దు. నిత్య జీవనంలో మ‌న‌పై గాఢ‌మైన ప్ర‌భావం చూపిన సంఘ‌ట‌న‌ల‌ను నెమ‌రువేసుకుంటున్న‌ భావ‌న పుడుతుంది. చాలా క‌థ‌లు మహిళ‌ల చుట్టే తిరిగినా.. ఇవి వారికి మాత్ర‌మే చెందినవనే సందేహం మాత్రం క‌ల‌గ‌దు. ఎందుకంటే మ‌న ఇంట్లో అమ్మ‌ని, అక్క‌ని, ప‌క్కింటి పిన్నిని, ఎదురింటి అత్త‌ను మ‌న‌మెప్పుడూ జెండ‌ర్‌తో చూడం క‌దా! వాళ్ల‌ని మ‌న‌తో స‌మానంగా, మ‌న‌లో ఒక‌రిగా క‌లిపేసుకుంటాం. అందుకే ఈ క‌థ‌లు ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల గురించి చెబుతున్న ఫీలింగ్ క‌ల‌గ‌దు.

గ‌ట్టిగా కూర్చుంటే రెండు లేదా మూడు గంట‌ల్లో ఈ పుస్త‌కం పూర్తి చేయొచ్చు. ప‌రిమాణం చిన్న‌గా ఉండ‌డం వ‌ల్ల కాదు. దీంట్లో ఉన్న ప‌ఠ‌నీయ‌త అలాంటిది. ముందు చెప్పిన‌ట్లుగా విశీ రాసిన అనేక సంఘ‌ట‌న‌లు మ‌న కళ్ల ముందు క‌దిలినట్ల‌నిపిస్తుంది. కానీ, క‌థ అంత‌రార్థం బోధ‌ప‌డిన త‌ర్వాత అవును క‌దా అనుకుంటాం. మ‌న ముందు జ‌రిగిన‌ప్పుడు వాటిలో అంత భావం ఉంద‌నే విష‌యం అర్థం కాదు.

కొత్త రచయితలకు గైడ్ లాంటిది..

ఉగ్గ‌బ‌ట్టుకున్న అంకెలు, ఛాయిస్‌, దేహ రాజ‌కీయం, హెల్త్ కంప్లైట్స్ వంటి క‌థ‌లు అందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. న‌వ్వుతున్న దెయ్యం వంటి క‌థ‌లైతే మ‌న క‌ళ్లు తెరిపిస్తాయి. పుట్టింటి పేరు, జెండ‌ర్ మెస్కులినిటీ.. ఆత్మ‌ప‌రిశీల‌నకు ఆదేశిస్తాయి. జెంటిల్‌మ‌న్ ల‌వ్‌, అమ్మ కూతురు, పిల్ల‌లున్న త‌ల్లి వంటివి స్ఫూర్తిని నింపుతాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. మార్పున‌కు ప్రేరేపిస్తాయి. కొన్నైతే సిగ్గుప‌డేలా చేస్తాయి. సామాజిక స్పృహ‌ను క‌లిగిస్తాయి. పాత స్మృతుల్లోకి తీసుకెళ్తాయి. లేత వ‌య‌సులోని మ‌ధుర జ్ఙాప‌కాల‌ను క‌ళ్ల ముందుంచుతాయి. కొన్నైతే నిశ్శ‌బ్దంగా నిల‌దీస్తాయి కూడా.

కొత్త త‌రం క‌థ‌కులు, ర‌చ‌యిత‌ల‌కు ఈ పుస్త‌కం ఒక గైడ్ లాంటిదే. పదాలు వాడిన తీరు అబ్బుర‌ప‌రుస్తుంది. క‌థ‌లు, వాటిలోని సంఘ‌ట‌ల‌కు అనుగుణంగా పదాలు చక్క‌గా కుదిరాయి. ఎక్క‌డా అవి మ‌న‌ల్ని దారిత‌ప్ప‌కుడా చేస్తాయి. ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది వాక్య నిర్మాణం. పొట్టి వాక్యాలు ప‌ఠ‌నీయ‌త‌కు ఉత్ర్పర‌కంగా ప‌నిచేశాయి. కొన్నైతే ఏక ప‌దంతో ముగిసిన వాక్యాలూ ఉన్నాయి. సంద‌ర్భానుసారంగా వాడిన ఉప‌మానాలు ఆయా స‌న్నివేశాల్లోని అందాన్ని క‌ళ్ల‌కు క‌ట్టాయి. న‌వ్వులు వెన్నెల ముక్క‌ల్లాగా రాలుతున్నాయి, అతనికిప్పుడు దాహం లేదు.. ఇందాకే తీరిపోయింది, క‌ళ్ల‌తో చిన్న‌పిల్ల‌లా న‌వ్వుతోంది వంటివి మ‌చ్చుకు కొన్ని.

ముందు చెప్పిన‌ట్లు ఈ పుస్త‌కాన్ని చాలా వేగంగా పూర్తి చేయొచ్చు. కానీ, అలా చేయ‌క‌పోవ‌డమే మంచిద‌ని నా భావ‌న‌. ఎందుకంటే దీంట్లోని ప్ర‌తి క‌థ‌పై లోతుగా ఆలోచించాలి. విశ్లేషించాలి. అంత‌రార్థాన్ని ఒంట‌బ‌ట్టించుకొని మారాలి. స్ఫూర్తి పొందాలి. అందుకే ప్ర‌తి క‌థ‌పై దీర్ఘాలోచ‌న త‌ప్ప‌నిస‌ర‌ని నాక‌నిపించింది. కొన్ని క‌థ‌ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకొని పాత్ర‌లు, సంద‌ర్భాలు, స‌న్నివేశాలు అల్లుకోగ‌లిగితే దీర్ఘ‌క‌థ‌లుగా డెవ‌ల‌ప్ చేయొచ్చు. ఒక‌టి రెండింటినైతే న‌వ‌ల‌గా కూడా మ‌లిచే అవ‌కాశం ఉంది.

ప్రతులకు

రచన: విశీ

పేజీలు: 143

వెల: 150

అన్ని పుస్తకాల షాపుల్లో లభ్యం

70325 53063

...................

సమీక్షకులు

సుద‌ర్శ‌న్‌

80740 34668



Next Story

Most Viewed