లోహ శిల్పి నుండి కావ్య శిల్పమైన కొలిమి

by Ravi |   (  Updated:2026-07-27 00:45:21  IST  )

Kolimi authored by Gannoju Prasad Book Review

లోహ శిల్పి నుండి కావ్య శిల్పమైన కొలిమి
X

అత్యంత ప్రభావవంతమైన రచనా ప్రక్రియల్లో దీర్ఘకవిత కవుల ప్రతిభకు గీటురాయిగా పరిణమించి ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకవస్తురూపం, సుదీర్ఘత, ప్రవాహ గుణం. భాషా సరళత అనే లక్షణాలు దీర్ఘకవితకు నాలుగు ముఖాలైతే, పంచప్రాణాలను అక్షరాలుగా క్రమశిక్షణతో పేర్చిన కవి గన్నోజు ప్రసాద్ అయిదవ సంపుటి ఈ కొలిమి. కులవృత్తులకు సింహాసనం వేసి సాహిత్య లోకానికి, పాఠకులకు అందించిన దీర్ఘ కవితా సౌధం.

పంచభూతాలు, త్రిమూర్తులు లేనినాడు విశ్వకర్మ స్వయంభూగా అవతరించి విశ్వాన్ని సృష్టించినాడని ప్రతీతి. అటువంటి వృత్తి నేపథ్యంలో లోహ శిల్పిగా జన్మించిన గన్నోజు ప్రసాద్ ఈనాడు కావ్యశిల్పిగా పరిణమించాడు. కొలిమి సెగల నుండి ఎగిసిపడిన ప్రతి నిప్పురవ్వ గుండెల్లో పదిలంగా దాచుకుని దీర్ఘకవితగా అలంకరించిన అగ్నిగోళం కొలిమి.

లక్షల చెమట చుక్కల విలువ తెలిసిన కవి..

మా వాకిలి గుడి కొలువున్న దేవుళ్ళ నిధితిత్తి డాకలి కొలిమి ముల్లోక మూర్తులుగా దర్శనమిస్తూ 'వుంటరు నిత్యం వృత్తిని దైవంగా, త్రిమూర్తి స్వరూపంగా కొలిచే సనాతన భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబింప జేసాడు కవి. శ్రమైక జీవన సౌందర్యానికి, తన శరీరాన్ని, ఆత్మను అర్పించుకుంటారు కమ్మరులు.. పురాణాలు చెప్పిన కథల్లో మహర్షుల గోత్రాలు మావి కానీ ఏ పురాణములో లేని యజ్ఞ వేదిక కమ్మరి కొలిమి. నిత్యం తపస్సు చేసే మహర్షి బాపు. హిమాలయాలు చూడని ఋషి బాపు. ప్రసాద్ గారి ప్రతి రచనలో బాపుని హీరోగా చూపిస్తాడు. బాల్యం నుండి గిరిగిరి అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబ కష్టాలను తీర్చడానికి కొలిమి సెగల తాపం తగిలిన బాపు పాదాలను, బాపు నవ్వుల్లో కానరాని సంద్రాన్ని, కొలిమి గొట్టపు స్వరంగా మారిన గొంతుకను, కనుపాపల్లో దాచుకున్నాడు కవి. సంవత్సరమంతా ఎండాకాలాన్ని అనుభవించిన తన బాపు శరీరాన్ని తాకిన లక్షల చెమట చుక్కల విలువను గుర్తెరిగిన కవి గన్నోజు ప్రసాద్.

ఇక మేమే పాలకులమౌతాం!

అమావాస్య రోజు అగ్గికి వీసా దొరికిన స్వేచ్ఛ నెలంతా పెయిని కాల్చుకుని ఒక్కరోజు వెన్ననద్దుకునే దినం. చదివిన వెంటనే పాఠకుడి పెదవులపై చిరునవ్వు, కళ్ళలో సంభ్రమాశ్చర్యాన్ని కల్గించే పంక్తులివి. నెల రోజలు నిప్పుల కుంపటి ముందు చేతులు కాల్చుకొని అమావాస్య నాడు సెలవు తీసుకునే సన్నివేశాన్ని చక్కగా వర్ణించారు. నిలువెల్లా కవి అయిన తన స్వానుభవానికి కవిత్వాన్ని జోడిస్తే ఇంక తిరుగేముంటుంది. తాడిత పీడిత జనం గుండెకు కొట్లాడే గొంతుక నేనే బహుజన వాదం బలోపేతానికి బలమైన సమరం నేనే చేస్తా మా కొలిమి నిప్పుల సాక్షిగా అంటూ రాజ్యాధికార కాంక్షను వెలిబుచ్చుతున్నాడు. పాలితులుగా ఇన్నాళ్ళు తమ అస్తిత్యాన్ని నివురు గప్పిన నిప్పులా దాచిన బహుజనులు ఇక మీద పాలకులు కావల్సిన సమయం ఆసన్నమైనదని చైతన్య పరిచిన కలాన్ని వెపన్‌గా మార్చడానికి సిద్ధమవుతున్నాడు.

కొలిమి కనుమరుగైనప్పుడు..

ఏడ కాల్చి వాతలు పెడతారో అని భయపడిన చందమామ, నులకమంచంలో పొదిగిపోయిన కవి నెలవంకగా, నల్లబంగారాన్ని (బొగు) నైవేద్యంగా, కొలిమి బూడిదను ఐలోని జాతరలో పెద్ద పట్నంగా, వేములవాడ రాజన్న ఒడిబియ్యంగా,బాపు చర్మాన్ని పరిశోధనా కేంద్రంగా, రైతన్న ముల్లు కర్రను వజ్రాయుధంగా, కమ్మరుల కష్టాన్ని కురుక్షేత్ర యుద్ధంగా, వ్యవసాయ పనిముట్లకు పురుడు పోసిన బాపు డాక్టరుగా ఇలాంటి అచ్చెరువొందించే వర్ణనలు, ఉపమానాలు కొలిమిలో కోకొల్లలు. యంత్రాలు ప్రేతాత్మలై కొలిమి కంట్లో మట్టి కొడుతున్నవి బైటి కమ్మరులతో సముతుల పోరు పడలేమంటూ ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఆధునాతన యంత్రాలతో పోటీ పడలేక ఒకనాటి జీవనాధారమైన కొలిమి పాతనీరు పోయి కొత్తనీరు వచ్చినట్లుగా కనుమరగవడం విచారింపదగు విషయమే!

మనసు, కలం ఏకమై..

కుటుంబ పరమైన, వృత్తిపరమైన, ఆర్థిక, రాజకీయ. సామాజిక కోణాలెన్నింటినో కొలిమి దీర్ఘ కవితలో స్పృశించి అందులోని కవితా వస్తువు కరుణ రసాన్ని చిందించి ప్రతి పదం ప్రతి వర్ణన, ఉపమానమై అద్భుత రసాన్ని ఆవిష్కరించింది. ప్రసాద్ మనసు, కలం ఏకమై సృష్టించబడిన కవితా విన్యాసం కొలిమి. ఈ ప్రయాణం అంతులేనిదై సాహిత్య సాగరంలో ప్రతి ప్రక్రియలో మథనం చేసి అమృత ధారలు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బహుజన రాజ్యాధికారంను కలగంంటున్న ప్రసాద్‌కు అభినందనలు.

సమీక్షకురాలు

-రాధిక

98661 27112

Next Story