బంధానికి నిర్వచనం

by Disha edit |
బంధానికి నిర్వచనం
X

మానవ జీవితంలో పుట్టుక, వివాహం, చావు అతి ముఖ్యమైన ఘట్టాలు. వివాహమనేది జీవిత గమనంలో మధురాతి మధుర ఘట్టం. దాంపత్య జీవితాన్ని సుఖంగా, సంతోషాలతో గడపాలని కలలుగంటారు. మంచి సంతానం కలగాలని అనుకోవడం సహజం. అందుకే పెళ్లంటే నూరేళ్లపంట. వివాహం విడదీయరాని అనుబంధం. రెండు కుటుంబాల ఆనందాల పంట. మనిషి ఒంటరి. తోడు కావాల్సిందే. ఒంటరిగా సాధించనది జంటగా సాధిస్తాడు.

సంపాదకులు పెందొట వెంకటేశ్వర్లు తన కుమారుడి వివాహం సందర్భంగా 'మూడు ముళ్లు' పేరుతో వివాహ ప్రాముఖ్యతను తెలిపే సంకలన గ్రంథం తేవాలని అనుకోవడం, కానుకగా ఇవ్వాలి అనుకోవడం అభినందనీయం. భారత రచనలో నన్నయకు నారాయణ భట్టు సహాయం చేసినట్లు ఈ 'మూడుముళ్ల' కవితా సంకలన పుస్తకానికి సహ సంపాదకులు దర్శనం లింగం సహాయ సహకారాలు మరువలేనివి. చాలా మంది కవులు చక్కటి కవితలను అందించారు.

'వివాహం పవిత్ర బంధం / వివాహం మధుర ఘట్టం / వివాహం జీవన కావ్యం / వివాహం సుస్వరాగానo' అంటూ కందేపి రాణి ప్రసాద్ ముచ్చటగా వివరించారు. 'కలిసిన రెండు మనసులు / మమతలు పల్లకిలో / కల్యాణ మండపంలోకి చేరి / ముత్యాల పందిరిలో' అంటూ ఉప్పల ప్రభాకర్ 'పెళ్లంటే' పేరుతో కవితలు చెప్పారు. 'ఎవరెవరో ఒకరి కోసం ఒకరు అన్నట్లు పుట్టి / అనుభూతుల అంతర లో ఆనందాల వెల్లువలో / అగ్నిసాక్షిగా తాళి బొట్టు తో ఏకమై' అంటూ డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి 'సప్తపది'ని విడమరిచి చెప్పారు. 'అతడు వేశాడు భౌతికంగా / ఆమె వేసింది మానసికంగా / మూడు ముళ్లు అందరి / సాక్షిగా విజయ విహారం మధ్య' అంటూ 'వివాహ క్రతువు'ను డాక్టర్ కాపు రమేష్ వర్ణించారు. 'రమణీయ భాషిత వేడుకల లో/ రెండు మనసుల అభినందనల వెల్లువన / బాజా భజంత్రీల నృత్య కేలీల సరిగమ తో/ దివినుంచి దీవెన జల్లులు కురియగా' అంటూ బాల సాహితీవేత్త ఉండ్రాల రాజేశం' కళ్యాణం కమనీయం' అని తేల్చేశారు. 'తనువుల జతలెన్నో ఉంటాయి / మనసులూ జతకట్టడమే మాంగల్య బంధం' అంటూ 'ఆలుమగలు' గొప్పదనాన్ని తిరుమల కాంతి వివరించారు. పుస్తక ముఖచిత్రం చాలా బాగుంది. ఇందులో 70 కవితలు ఉన్నాయి.

ప్రతులకు:

పెoదోట వెంకటేశ్వర్లు

ఇంటి నెంబర్ 17-128/3 శ్రీనగర్ కాలనీ

సిద్దిపేట-502103

పేజీలు 100 : ధర రూ.100

9440524546


సమీక్షకులు:

యాడవరం చంద్ర కాంత్ గౌడ్

పెద్దగుండవెళ్లి. సిద్దిపేట

9441762105

Next Story

Most Viewed