డిఫై ఏజ్, డిఫైన్ గ్రేట్‌నెస్

by Disha edit |
డిఫై ఏజ్, డిఫైన్ గ్రేట్‌నెస్
X

ఈ సంవత్సరం ఫిలిప్పీన్స్‌లో AMA 12 దేశాల క్రీడాకారులకు ఐదు రోజులపాటు ఏషియాడ్‌ నిర్వహించింది. అక్కడి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో అథ్లెటిక్‌ విలేజ్‌ని, పెద్ద స్టేడియంని నిర్మించి సమర్థవంతంగా గత ఏడాది నవంబర్ 8 నుండి 12 దాకా పోటీలు నిర్వహించిన తీరు మెచ్చకోదగినది. ఈ పోటీలలో త్రోస్‌, జంప్స్‌, రన్స్‌, రేస్లు అన్ని వయసుల వారికి నిర్వహించారు. 35 ఏళ్ళ నుంచి ప్రతీ 5 సంవత్సరాలకు ఒక ఏజ్‌ గ్రూప్‌. ఇక్కడ 100 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న గ్రూప్ వాళ్లు కూడా పాల్గొన్నారు. 'డిఫై ఏజ్, డిఫైన్ గ్రేట్‌నెస్' అనే టాగ్‌ లైన్‌తో ఈ 22వ ఏషియాడ్‌ని నిర్వహించారు. నేను 65 సంవత్సరాల ఏజ్‌ గ్రూపులో పాల్గొనగలిగాను.

ఈ వయసులోనా?

నా ఫిలిప్పైన్స్‌ ప్రయాణం ఏక కాలంలో నా భ్రమణ కాంక్షనీ, క్రీడోత్సాహాన్ని తీర్చి అంతరంగిక ఆనందాన్ని కల్గించిన ప్రయాణం ఇది. మానసిక ఒత్తిడిని పూర్తిగా మరచిపోయి కొత్త వ్యక్తులతో, కొత్త ప్రాంతంలో ఉత్తేజపూరితంగా గడవగలిగాను. శారీరకంగా, మానసికంగా పూర్తిగా సంలీనమై ఎనిమిది రోజులు గడవడం సంతృప్తినిచ్చింది. ఇదో జీరో స్ట్రెస్‌ ఫార్ములా. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనకి నిరాశ, నిస్తేజం వచ్చేస్తాయి. అరవై ఏళ్ళు వచ్చే సరికి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఊబకాయం, మానసిక ఒత్తిడి, బి.పి, షుగర్‌, కొలెస్ట్రాల్‌ లాంటి సమస్యలు మొదలైపోతాయి. అన్నింటిని వదలించుకొనే దగ్గర దారి నడక, ఆటలు, పరుగులు, ఈ వయసులోనా? అన్న ప్రశ్న వేస్తారని నాకు తెలుసు. ఆటలు అందరు ఆడవచ్చు- కాని వయస్సు పైబడిన వాళ్ళు ఆడడం వేరు. దాని వల్ల వచ్చే లాభాలు వేరు. అదంతా ఒకెత్తు. నా మట్టుకు 65 ఏళ్ల వయస్సు వారితో కలిసి ఆటాడటం, 69.9 ఏళ్లు నిండి, రెండు మోకాళ్ళు పూర్తిగా ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత వచ్చిన ఒడిదుడుకులను అధిగమించి మళ్ళీ క్రీడలు కొనసాగించడం మరో ఎత్తు.

వరుసగా స్టేట్‌ మీట్లో, నేషనల్‌ మీట్లో విజయం సాధించి ఏషియాడ్లో పాల్గొనగలగడం, ఇక్కడ ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ మన జండాని పట్టుకొని నిలబడగలగడం ఎంతటి సంతృప్తినిచ్చిందో.. మరెంత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందో మాటల్లో చెప్పలేను. జావెలిన్‌ త్రోలోను, డిస్కస్‌ త్రోలోను, షాట్‌పుట్‌లోను, 5 కి.మీ వాక్ లోనూ పాల్గొన్నాను. నిజానికి మన లాంటి సీనియర్‌ సిటిజెన్లకి ఈ మెడల్స్‌, ప్లేసులు ముఖ్యం కాదు. కొత్త స్నేహాలు దేశాల సరిహద్దులు దాటి మనవైపు వెల్లువెత్తుతాయి. అప్పుడు కలిగే ఉద్రేకం, వాళ్ళని, వాళ్ళ క్రీడా స్పూర్తిని చూసినప్పుడు కలిగిన నూతనోత్తేజం ఇవి ప్రధానంగా మనకి లభిస్తాయి. మనం లెక్కించుకోవల్సిందీ ఇదే.

మంచాన పడిన మళ్లీ లేచి

ఫిలిప్ఫైన్స్‌కు వచ్చిన 12 దేశాల స్త్రీలని చూస్తుంటే మన భారతీయ మహిళల వెనకబాటుతనం తెలిసి వచ్చింది. అక్కడికి వచ్చిన స్త్రీల వయసు బిజ్‌ నెంబర్‌ చూస్తే కానీ తెలియదు. 90 ఏళ్ల వయసు స్త్రీలు రన్నింగ్‌కి, జెంపింగ్‌లకు కూడా వచ్చారు. కొందరు వృత్తి, మరికొందరు ప్రవృత్తి, ఇంకొందరు ఔత్సాహిక క్రీడాకారులు. నా రెండు మోకాళ్ళు అరిగిపోయినప్పుడు నా భుజాలు రెండూ దృఢంగా వున్నాయి కనుక, వాటికి పని చెప్పి త్రోన్ లోకి వచ్చి 'జావలిన్‌ సుహాసిని’ అనిపించుకోవడం, ఎంతటి సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేను. నిజానికి 30 సం॥లు అధ్యాపకురాలిగా గేమ్స్‌ కమిటీ బాధ్యతలు నిర్వహించాను. కాలేజిలో పిల్లల దగ్గర ఆడించడం, సహా ఉపాధ్యాయుల తోటి, విద్యార్ధుల తోటి ప్రతి ఏడు త్రో బాల్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఇలా ఉపయోగపడిరది. క్రీడా రంగంలోకి అడుగుపెట్టి నా ఆరేళ్ల ఈ క్రీడాప్రయాణంలో ఇంటర్‌ నేషనల్లో పాల్గొని రావడం చాలా సంతృప్తిగా ఉంది. కరోనా తర్వాత దాదాపు స్తబ్దతకి, మతిమరుపుకి, అధిక బరువుకి, డిప్రెషన్‌కి లోనైన నేను ఈ క్రీడల వల్ల పూర్తిగా కోలుకోగలిగాను.

అక్కడికి వచ్చిన మహిళల్ని చూస్తుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. మన చెన్నై నుంచి వచ్చి 80 ఏళ్ళ వయస్సులో జావెలిన్‌ త్రోలో పాల్గొన్న శివగామి మేడమ్‌ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆమెకు 4 నెలల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్తో కుడి చేయి, కుడి కాలు పనిచేయక పోయినా పంతంతో, పట్టుదలతో ప్రాక్టీస్‌తో చెయ్యిని మళ్లీ స్వాధీనపరుచుకొని ఆడడానికి వచ్చారు. ‘ ఇప్పటికి జావెలిన్‌ త్రోలో అంతర్జాతీయంగా 13 మెడల్స్‌ తీసుకున్న నేను మంచాన పడినా మళ్ళీ లేచి వచ్చి ఆడడం ఎంతో ధైర్యాన్నిచ్చింది’ అన్నారు. ‘ఈసారి మెడల్స్‌ కోసం రాలేదు, నాకు నేను నమ్మకాన్ని ఇచ్చుకోవడానికి వచ్చాను’ అన్న మాట పదిలపరుచుని నేను పొందిన ప్రేరణ మీకు పంచుతున్నాను. ఇలా గూడూరు నుంచి ఫిలిప్ఫైన్స్‌లో ఆటల పల్లెదాకా సాగిన నా అనుభవాల సమాహారం ఇది.

- లక్ష్మి సుహాసిని,

రిటైర్డ్ లెక్చరర్,

98852 88443

Next Story

Most Viewed