అంతరంగం: నిరంతర చలనంతోనే జీవన సాఫల్యత

by Disha edit |
అంతరంగం: నిరంతర చలనంతోనే జీవన సాఫల్యత
X

నిరంతరం చలనం లేకుంటే ఆగిపోయినట్టే. మనిషికి ఆక్టివిటీ ముఖ్యం. ఏం పనీపాట లేకుంటే జీవచైతన్యం కోల్పోవుడే. మరి పని లేనోట్ల ఎవలుంటారు అని కాదు గానీ 60, 70 ఏండ్లు దాటిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందని తమకు తామే మెదడుకు సంకేతాలు ఇచ్చుకుంటరు. ఇటీవల పరిశోధనల్లో 80 ఏళ్ళు దాటితేనే వృద్ధతరం వచ్చినట్టట. జపాన్ లాంటి దేశాల్లోనైతే వంద సంవత్సరాల దాకా ఏదో పని చేస్తూనే ఉంటారు. రిటైర్ అయిపోయినం, పిల్లల పెండ్లిల్లు అయిపోయినయి, ఇగ ముసలితనం వచ్చిందని కొందరు ఒక భావనలో ఉంటారు. మెదడు ఎంత ఆలోచిస్తుంటే అంత చురుకుదనం వస్తుంది. ఎక్కువగా సృజనాత్మకత వైపు ఆలోచనలో ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడటం, ఇంటిపని, వంటపనిలో భాగస్వాములు కావడం, సామాజిక విషయాల్లో చర్చల్లో కొత్తతరంతో ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ నిరంతరం మనుషులను చలనశీలత వైపు నడిపిస్తాయి. ఇదివరకు సైకిల్ తొక్కేవాళ్ళం. ఎంత దూరమైనా నడిచేవాళ్ళం. ఇప్పుడు వాహనాలు వచ్చినయి. గతంలోలాగా నడవకపోవచ్చు. కాళ్ళకు పనిలేకపోతే ఆగిపోతయి. అట్లనే చేతులకు పనిలేకపోతే ఆగిపోతయి. శరీరంలో ఏ భాగమైన నిరంతరం ఆక్టివ్ కావాల్సిందే. మెదడు కూడా పాజిటివ్ ఆలోచనల ధోరణితో ఆలోచించాల్సిందే.

సత్సంబంధాలు అవసరం....

మెదడు ఆలోచనలకు తోడు నేర్చుకునే తత్వం ఉండాలి. నాకేంది చెప్పడం నేను 60 ఏండ్ల అనుభవం ఉన్నవాన్ని అందరికంటే పెద్ద అన్ని తెలుసు అనే ధోరణి కన్న లెర్నింగ్ అనేది నిరంతరం ఉంటేనే చురుకుగా ఉంటారు. లేకుంటే ఈ తరం నుంచి టెక్నాలజీ తెల్సుకోవాలి. కొత్త విషయాల పట్ల అవగాహన చైతన్యం రావాలి. మనిషి ఎదుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ సామాజిక జీవితం ముఖ్యం. తన వ్యాపారం తన ఉద్యోగం తన పనితానే చేసికోవడం గాకుండా కొంత పరుల కోసం సమయం ఇవ్వాల్సి ఉంటుంది. స్నేహితులు ఉండాలి. కుటుంబ బంధుత్వాల్లో సత్సంబంధాలు పెంపొందించుకోవాలి. నిరంతరం అందరితో టచ్ లో ఉండాలి. ఇదంతా వృత్తికి, వ్యాపారానికి లాభమా అంటే కాకపోవచ్చు కాని మనిషి సంఘజీవి మానసిక ఆనందం కోసమైన నలుగురు కల్సిన వాళ్ళుంటేనే తన వృత్తి వ్యాపారాల్లో 'స్ట్రెస్' లేకుండా ఉంటుంది.

మానసిక ఒత్తిడి అనేది తెలవకుండానే ఉంటది. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో గడిపినప్పుడు ఉండకపోవచ్చు కానీ తొందరగా పూర్తి చేయాలి అందరికంటే ముందుగా ఎక్కువ సంపాదించాలి అని ఇతరులతో పోల్చుకుంటే ఒత్తిడి గురి అవుతుంటారు. ఎలాంటి మానసిక ఒత్తిడి లేనితనంలో జీవితాన్ని గడపడం ముఖ్యం ఏ వయస్సు వాళ్ళయినా ఆలోచనను బట్టే ఉంటది. ఇతరులతో పోల్చుకొని స్ఫూర్తిపొందాలి తప్పితే ఈర్ష్య పొందకూడదు. మనుషులకు ప్రేమించడం, జంతువులను ప్రేమించడం, చెట్లను ప్రేమించడం పక్షులను ప్రేమించడం అంతిమంగా ప్రకృతి ఆకృతిగా జీవించడం ముఖ్యం.

ఒక్క చిరునవ్వుతో మానసిక రోగాలు దూరం

దయార్ద హృదయులు, ప్రేమాన్విత మనస్తత్వం, నిదానమైన జీవనశైలి నరంతరం ఆనందంగా గడపడం ముఖం మీద చిరునవ్వులు పూయించడం అలవాటుగా ఉంటే ఏ మానసిక రోగాలు మనిషి చెంతకు రావు. ఇవిగాకుండా పోటీపడి పైసల సంపాదన కోసం అబద్ధాలు ఆడటం, అవతలి వాళ్ళతో గిచ్చి కయ్యం పెట్టుకోవడం, సంబంధం లేకున్న ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, అహంకారం, ఆధిపత్య భావజాలం కల్గి ఉండటం మనిషికి ఉండకూడనిది. వీళ్లు జీవితం జీవించరు గడుపుతారు అంతే. సాఫల్య జీవనం గమనం అంటే ప్రేమతో జీవించడం. అది ఈనాటి ఒత్తిడి రోజుల్లో అవసరం. వయస్సులో పెద్దవాళ్ళ తత్వాన్ని బట్టే వాళ్ల పిల్లలు తయారు అవుతారు. ముఖ్యంగా ఇంట్లో కుటుంబం నుంచే కుటుంబ సభ్యుల ఆచరణ ప్రారంభం అవుతుంది.

ఆలోచనల్లో ప్రజాస్వామికత ముఖ్యం. నేను మొగోన్ని, నేను బాగా సంపాదించిన, నేను పెద్ద వ్యాపారిని, నేనో గొప్ప అధికారిని, నాది గొప్పకులం అనే తాత్విక ఆలోచన నుంచి బయటకు రావాలి. మనిషి ఎప్పుడు నిరంతరం ఆలోచనలో, సృజనాత్మక చలనశీలత సామాజిక జీవితంలో కల్సిపొతేనే అసలైన జిందగి.

అన్నవరం దేవేందర్

94407 63479


Next Story

Most Viewed