కాలగమనంతో కవిత్వం రాసేవాడే కవి

by Disha Web Desk 11 |
కాలగమనంతో కవిత్వం రాసేవాడే కవి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: కాలగమనంతో కవిత్వం రాసేవాడే కవి అని,కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి పనితనమని ప్రముఖ సామాజికవేత్త,దక్కన్ ల్యాండ్ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్ అన్నారు. స్థానిక లుంబిని పాఠశాల,పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో ఆదివారం నిర్వహించిన శ్రీక్రోధినామ ఉగాది సంవత్సరం కవిసమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్తమాన సమస్యలను ప్రపంచానికి చాటే విధంగా కవి ప్రయత్నిస్తాడని,ఆ ప్రయత్నంలో భాగంగానే సమాజ మార్పును కవి ఆహ్వానిస్తాడని ఆయన అన్నారు. అలాగే పర్యావరణానికి అనుకూలంగా కవులు కవిత్వం రాయాలని, అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు.

ఓయూ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ… కవులు పఠనాసక్తిని పెంపొందించుకోవాలని, పఠనం ద్వారానే కవిత్వం రాణిస్తుందనన్నారు. కేవలం ఉగాది సందర్భంగా కాకుండానే నిరంతరం కవితా రచన చేయాలన్నారు. విశిష్ట అతిథి వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… పాలమూరు జిల్లాలో ఎంతో మంది నూతన కవులు ఆవిర్భవిస్తున్నారని,యవారిని ఎన్నో సాహిత్య సంస్థలు ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు.ఉగాది పురస్కారాలను ప్రసిద్ధ నటులు బెల్లం సాయిలు,కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్ లకు అందజేశారు.లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోట్ల వెంకటేశ్వర రెడ్డి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, వనపట్ల సుబ్బయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం మణికొండ వేదకుమార్ రచించిన 'బాలచెలిమి' పిల్లల మాసపత్రికను పిల్లలతో ఆవిష్కరింపజేశారు.



Next Story

Most Viewed