సమీక్ష:ఫాసిజం పక్కనే ఎగురుతున్న ఆజాదీ

by Disha edit |
సమీక్ష:ఫాసిజం పక్కనే ఎగురుతున్న ఆజాదీ
X

ఒక అంతానికి సూచనలు' అనే వ్యాసంలో హిందూ జాతి వికాసం పతన సూచనలను గమనించడానికి, పెరుగుతున్న హిందూత్వ పాపులారిటీపై విస్తృతంగా అధ్యయనం చేశారు అరుంధతి ‌రాయ్. హిందూత్వ యుద్ధోన్మాద వ్యూహాలు, జనాలను బలిపశువులను చేయడం, మోదీ నిరంకుశ పాలనా తీరు వంటివాటిని ఒక తరహా ఫాసిజంగా అభివర్ణించారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం, ఒకే రాజ్యాంగం అనే హిందూత్వ భావనలోని అసంబద్ధతను ఎండగట్టారు. 'ఒక దేశం కంటే, ఒక ఖండాన్ని తలపించే భూభాగంపై ఈ ఏకత్వ భావనను రుద్దడం ఏమిటని?' నిలదీశారు. యూరప్ కంటే ఎక్కువగా 780 భాషలు కలిగిన సంక్లిష్ట, వైవిధ్యపూరిత దేశం సముద్రమంత విస్తారమని గ్రహించాలంటారు.

రుంధతి ‌రాయ్ సాహిత్య జీవితం విశిష్టమైనది. తన తొలి నవల 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' 1997లోనే అంతర్జాతీయ ప్రచురణ రంగ పరిశ్రమ దృష్టిని విపరీతంగా ఆకర్షించినప్పుడు అయిదు లక్షల పౌండ్లను అడ్వాన్సుగా ఆమె పొందగలిగారు. తర్వాత ఆ నవలకు ప్రతిష్టాత్మక 'బుకర్ ప్రైజ్' వచ్చినప్పుడు కాస్మొపాలిటన్ నవలా రచనలో ఆమె పేరు మార్మోగిపోయింది. దశాబ్దాల క్రితం సాల్మన్ రష్దీ తదితరులలాగా ఆమె పేరు నాగరిక ప్రపంచంలో ఇంటి పేరుగా మారిపోయింది.

తదుపరి 20 సంవత్సరాల కాలంలో అంటే 2017లో 'ది మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్' అనే రెండో నవలను ప్రచురించారు. అప్పటి వరకు ఆమె సమకాలీన భారతదేశం ఎదుర్కొంటూ వచ్చిన ప్రతి సమస్య మీద, దానికి కారణమైన వ్యవస్థ పైనా విస్ఫులింగాలు కురిపిస్తూ తనకే సాధ్యమైన శక్తివంతమైన వచనంతో విరుచుకుపడ్డారు. అతికొద్ది మంది రచయితల వ్యాసాలు మాత్రమే నవల చదివినంత సులభంగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఆ స్థానం తెలుగు సాహిత్యంలో రంగనాయకమ్మగారికే దక్కుతుంది.

నిప్పు కణికలు

తొలి నవలకు, రెండో నవలకు మధ్య 20 ఏళ్ల కాలంలో అరుంధతి ‌రాయ్ కలం నుంచి వచ్చిన రచనలు వైవిధ్యానికి మారుపేరుగా నిలిచాయి. భారత ఆర్థిక వృద్ధి గాథ, పాకిస్తాన్‌తో అణ్వాయుధ పరుగు పందెం, నర్మదా డ్యామ్ ప్రాజెక్టు వలన నిర్వాసితులైన వేలాది మూలవాసీ ప్రజల వ్యథ, దేశంలోని ఆదివాసీ లోతట్టు ప్రాంతాలలో మావోయిస్టుల తిరుగుబాటు, వీటన్నింటికి పరాకాష్టగా కాశ్మీరులో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న క్రూర సైనిక ఆక్రమణ వంటి ఎన్నో సంక్లిష్ట అంశాలను రాయడం ద్వారా జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా సంచలనం కలిగించారామె. ఆమె ఎన్నుకున్న ఇతివృత్తాలు వివాదాస్పదం కాకుండా ఉండలేదు.

21వ శతాబ్ది భారత్ వెలుగునీడలపై ఆమె దృష్టి సారించినప్పుడు దేశీయంగా పాలక వ్యవస్థలపై నిరంతరం ఘర్షణ పడటం తప్ప మరొక మార్గం ఆమెకు లేకుండా పోయింది. అన్నిటికంటే మించి కాశ్మీర్‌ వేర్పాటువాదానికి ఆమె ప్రకటించిన మద్దతుపై ఎంత వివాదం చెలరేగిందంటే 2010లోనే ఆమె దేశద్రోహం అనే దరిద్రపు కేసులో చిక్కుకుని పదేళ్లపాటు విచారణను ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ దేశ ప్రజానీకంపై పాలకవ్యవస్థ నిత్య అత్యాచారాలను ఆమె ఎత్తి చూపినప్పుడు, ఆమెను దేశభక్తి పైత్యం తలకెక్కిన మూక ఎన్నిసార్లు ట్వీట్ల ద్వారా రేప్ చేసిందో, ఎన్నిసార్లు ఆమె అంగాంగాన్ని బూతులతో కుళ్లబొడిచిందో లెక్కలేదు. సమకాలీన భారతదేశంలో ఆమె పొందినన్ని అవమానాలు, నిందలు, బూతు సత్కారాలు మరే రచయిత్రీ పొందివుండదంటే అతిశయోక్తి కాదు.

సాహస ప్రకటన

ఇన్ని అవమానాల మధ్య ఆమె ఆజాదీ పేరిట తీసుకొచ్చిన వ్యాస సంకలనం కూడా నిరంతరం కొనసాగుతున్న భయభీత వాతావరణంలోనే రూపొందింది. అజాదీ అంటే స్వాతంత్ర్యం అని అర్థం. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాశ్మీరీ నిరసనకారులు జపిస్తున్న నిత్య ఉద్యమ మంత్రం అజాదీ. ఈ వ్యాస సంకలనానికి కావాలనే 'ఆజాదీ' అనే పేరు పెట్టారామె. దేశంలో పాలనా పగ్గాలు బీజేపీ చేతులలో పడ్డాక హిందూత్వ భావనకు పెరిగిన ప్రజాదరణను నాజీ జర్మనీ కాలంలో ఫాసిజానికి పెరిగిన ప్రజాదరణతో పోల్చారు అరుంధతి ‌రాయ్ 'నిశ్శబ్దమే ఇప్పుడు బిగ్గరగా వినిపిస్తున్న నినాదం' అనే ఈ సంకలనంలోని వ్యాసంలో ఆమె 'కాశ్మీర్‌లో గత 30 ఏళ్లలో జరిగిన ఘటనలు క్షమించరానివంటూ' సాహస ప్రకటన చేశారు.

మూడు దశాబ్దాల హింసాత్మక ఘటనలలో పౌరులు, మిలిటెంట్లు, భద్రతా బలగాలు మొత్తంగా 70 వేలమంది హతులయ్యారు. వేలాది మంది అదృశ్యమయ్యారు. వేలాది మంది యువత చిన్నస్థాయి అబుఘ్రాయిబ్ (తాలిబన్లపై అమెరికా) తరహా చిత్రహింసా కేంద్రాలలో నిత్యం నలిగిపోతూ వచ్చింది. దాదాపు వెయ్యి పేజీలతో 2019లో ప్రచురితమైన 'మై సెడిషియస్ హార్ట్' (నా దేశద్రోహ హృదయం) అనే కాల్పనికేతర సంకలనంలోంచి తీసిన తొమ్మిది వ్యాసాల సంకలనమే 'ఆజాదీ' 2018 ప్రారంభం నుంచి 2020 ప్రారంభం వరకు రెండేళ్ల కాలంలో రాసిన ఈ వ్యాసాలు మొదట బ్రిటన్‌లో లేక అమెరికాలో ఉపన్యాసాలుగా లేదా పొడవాటి ముద్రణలుగా రూపొందాయి.

పదునైన మాటలతో

'ఒక అంతానికి సూచనలు' అనే వ్యాసంలో హిందూ జాతి వికాసం పతన సూచనలను గమనించడానికి, పెరుగుతున్న హిందూత్వ పాపులారిటీపై విస్తృతంగా అధ్యయనం చేశారు అరుంధతి ‌రాయ్. హిందూత్వ యుద్ధోన్మాద వ్యూహాలు, జనాలను బలిపశువులను చేయడం, మోదీ నిరంకుశ పాలనా తీరు వంటివాటిని ఒక తరహా ఫాసిజంగా అభివర్ణించారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం, ఒకే రాజ్యాంగం అనే హిందూత్వ భావనలోని అసంబద్ధతను ఎండగట్టారు. 'ఒక దేశం కంటే, ఒక ఖండాన్ని తలపించే భూభాగంపై ఈ ఏకత్వ భావనను రుద్దడం ఏమిటని?' నిలదీశారు.

యూరప్ కంటే ఎక్కువగా 780 భాషలు కలిగిన సంక్లిష్ట, వైవిధ్యపూరిత దేశం సముద్రమంత విస్తారమని గ్రహించాలంటారు. నిత్యం బహుళత్వానికి మద్దతుగానే ఆమె రచనలు ఉంటాయి. నిజంగానే 'ఆజాదీ'లో ఆమె రూపొందించిన అంశం ఏమిటంటే సంఘీభావం, మానవతావాదాల ఫ్రంట్ లైన్ నుంచి రాసే జీవిత సంఘర్షణే. ఇక్కడే ఏ రచయిత అయినా ఆమె సాహిత్య రచనా శక్తి అందుకున్నా శిఖరస్థాయికి చేరగలరు.

రచయిత్రి:

అరుంధతి రాయ్

తెలుగు అనువాదం:

అర్విని రాజేంద్రబాబు, ప్రశాంతి, పి. వరలక్ష్మి, వెంకటకిషన్ ప్రసాద్

ప్రతులకు:

మలుపు బుక్స్

2-1-42/1 నల్లకుంట

హైదరాబాద్-500044

email : [email protected]

పేజీలు 167 : వెల రూ.150

సమీక్షకులు

-రాజశేఖర్

73964 94557

Next Story

Most Viewed