సమీక్ష:కమనీయం కవన దవనం

by Disha edit |
సమీక్ష:కమనీయం కవన దవనం
X

హలు గుసగుసలాడే హృదయాల పొదరిల్లు కవిత్వం. ప్రసవ వేదనతో 'అమ్మతనం' 'హృదయవేదనతో' కవితాత్మకం ఆవిష్కరించబడతాయన్నది అక్షరసత్యం. ఈ 'కవన దవనం' హృదయాంతమైతే ఆదో అనిర్వచనీయ అనుభూతి. సాధారణ పాఠకులనూ సమ్మోహనపరిచేలా సాగింది 'కవన దవనం'. కవయిత్రి సుజాతకి ఇది తొలి సంపుటి అయినా ఆ తడబాటు ఏ వాక్యంలోనూ అగుపించదు. ప్రతి కవితా వస్తువు అత్యంత సాధారణం. కవనాక్షరమాల అల్లిన తీరు, శైలి, పసిడికి పన్నీరు పూసిన చందమై నడిచింది.

కవిత్వం రాయాలనే తపన, ఆరాటం మధుర కవన మల్లెలు పూయించాయి. 'మనసును స్థిరపరిచి' 'దానవుడే మానవుడు' అంటు ముగించిన ఈ బుల్లి కవన సుమగుచ్ఛంలో డెబ్భై కవన సుమాలు చేర్చబడ్డాయి. వస్తువుకు, పదార్థానికి రంగు. రుచి, వాసన ఉన్నట్టే సుజాత కవిత్వానికీ ఉన్నాయి. కాలక్షేపపు కవిత్వం తాలూకూ అక్షరాల కూర్పు, అంత్య ప్రాసల వాక్యాల పేర్పు కాదు. అనుభవాల సుడిగుండాలలో గుండె పడిన వేదన తాలుకు అనుభవాల ఆర్తి బాపతు మేఘాలు ఈ కవితా జల్లులు.

నిండా మానవత్వమే

'అవసరం' అనే కవితలో స్వార్థం తాలూకు నీడను గురించి ఎంతో అద్భుతంగా చెబుతూ, 'రంగులు మార్చేది ఊసరవెల్లి అనుకుంటే పొరపాటే అని, మనిషి స్వార్థం నిలువునా నిండిపోయి అన్ని బంధాలను తెంచుకుని ఆఖరికి పేగు బంధాన్ని సైతం మరచి మానవత్వాన్ని మంట గలుపుతున్నది' అని ఆగ్రహం చూపారు కవయిత్రి. మనుషుల మధ్య / నిత్యాగ్నిహోత్రాన్ని / రాజేస్తుంది. ఆకాంతి వెలుగులో / చోద్యం చూస్తూ / మనల్ని ఆటబొమ్మల చేసి / మనసులతో చదరంగం ఆడుతుంది / అవకాశాన్ని చూసి /చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంది' అంటారు. మధ్యతరగతి మానవులు, దేశ రక్షకులైన జవానులు, విద్యా గురువులు, రైతులు, ఎదుర్కొంటున్న బాధలతోపాటు మహిళామూర్తులు అనుభవిస్తున్న ఇంతుల ఇక్కట్ల మీద ఆవేదన వ్యక్తపరిచారు. 'మనం మనుషులం కదా?' అని వ్యంగ్యాత్మకంగా నిలదీశారు. పసిపాప నవ్వుల్ని పూలతో పోలుస్తాం / కానీ ఏ అనాధ బిడ్డను చేరదీసి ఆదరించ లేము / ఎందుకంటే మనం మనుషులం' అంటూ విశదీకరించారు.

హృదయాంతరంగం

సుజాత కవిత్వం నిండా సామాజిక స్పృహ ఆవరించి ఉంటుంది. అందమైన పదబంధాలు, వాటికి తోడు చక్కని వాక్యాలు, తనకు తెలియకుండానే అలా అలా వ్రాసుకుపోవడానికి గల కారణం ఆమెలోని గాత్ర ప్రతిభ అనిపిస్తుంది. తను చక్కని గాయని కనుక. సరోగసి, సమిధ, సమరం, యత్రనార్యస్తు వంటి కవితలు ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించాయి. ఇద్దరి మధ్య ఒంటరినై నేను / నీ విరహంలో విహరిస్తున్నా/ అల్లంత దూరాన ఉన్న నిన్ను / నా హృదయ స్పందనంత / సమీపంలో అనుభూతి పొందుతున్న / నీ ప్రేమలో నాకు నేను' అంటూ 'అమలిన శృంగారం' సాక్షిగా సాగిన తీరు ఆమె మధుర భావనల కవనానికి మచ్చుతునక. మబ్బు తెరలను / తెల్లకాగితాలు చేసి / ప్రేమ లేఖ పంపాను అందిందా?/ అంటూ ప్రశ్నించిన తీరులోనే తన కవితా గాఢతను అంచనా వేయవచ్చు. 60 పాళ్ల మానవత్వం, 20 శాతం స్త్రీవాదం, మరో 20వ భాగం బహు చక్కని భావ కవిత్వం, వెరసి శత శాతం సుజాత కవిత్వం బహుముఖీన బహు సుందరం.

ప్రతులకు:

పీవీఎల్ సుజాత

77801 53709

పేజీలు: 92, వెల: రూ.100


సమీక్షకులు

డా: అమ్మిన శ్రీనివాసరాజు

77298 83223

Next Story

Most Viewed