ఏపీకి తరలుతున్న మద్యం

by  |
ఏపీకి తరలుతున్న మద్యం
X

దిశ‌, ఖ‌మ్మం: తెలంగాణ మ‌ద్యం అక్రమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌కు త‌ర‌లిపోతోంది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని అశ్వారావుపేట, మధిర, బోనకల్లు, పెనుబల్లి, భ‌ద్రాచ‌లం తదితర మండలాల నుంచి, , మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ నుంచి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు దాటి ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి, కర్నూలు జిల్లాల‌కు రోజూ ల‌క్ష‌లాది రూపాయ‌ల విలువ చేసే మ‌ద్యం తరలుతోంది. ఏపీ ధ‌ర‌ల‌ క‌న్నా కాస్త త‌క్కువ‌కు విక్ర‌యిస్తూ వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ దందా చేస్తున్న వ్యాపారులు 3 శాఖ‌ల‌కు సంబంధించిన అధికారుల‌కు ఆమ్యామ్యాల‌ ఆశ చూపి తమ పని కానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహ‌నాల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీరోమాల్ చేరుకుంటోంది. అయితే, చెక్‌పోస్టుల వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉండ‌టంతో వారు చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఏపీలో ఫుల్ రేట్..

ఏపీ సర్కార్ మే 4న మ‌ద్యం దుకాణాల‌కు అనుమతిస్తూ 25 శాతం ధ‌ర‌ల‌ను పెంచింది. ఆ తర్వాత మరో 50 శాతం పెంచుతూ.. మొత్తంగా 75 శాతంతో మద్యం విక్రయాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కేవలం 16 శాతం పెంచి వైన్స్ లకు పర్మీషన్ ఇచ్చింది. దీంతో ఏపీలోని లిక్కర్ మాఫియా తెలంగాణపై కన్నేసింది. ఇక్కడ తక్కువ ధరకు తీసుకుని, అక్కడ అమ్ముతూ సొమ్ము చేసుకుంటుంది. ఈనెల 5న ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ధరల నిర్ణ‌యం పొరుగున ఉన్న తెలంగాణ వైన్స్ షాపు య‌జ‌మానుల‌కు బాగా క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. వాస్త‌వానికి తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాలు ప్రారంభమైన రెండ్రోజులు మాత్రమే బాగా మందుబాబులు పోటెత్తారు. ఆ త‌ర్వాత రోజుల్లో ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్ మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో గ‌త వేస‌వి కంటే గిరాకీలు బాగా తగ్గాయని ఎక్సైజ్ అధికారులు ప్ర‌క‌టించిన వివ‌రాల ద్వారా తెలుస్తోంది.

రహస్య మార్గాల్లో..

తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుంటే చెక్ పోస్టుల్లో పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో మద్యం మాఫియా రహస్య మార్గాల గుండా తరలిస్తోంది. గురువారం గద్వాల జిల్లాలోని అయిజ మండలం నుంచి ఆటో, బైకుల్లో తరలుతున్న లక్షల విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. అదే రోజు ఖమ్మం జిల్లాలోని బూర్గం పహాడ్ మండ‌లం, పాల్వంచ మండ‌లాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే భ‌ద్రాచ‌లం, వైరా, మ‌ధిర‌, ఎన్కూరు, స‌త్తుప‌ల్లి ప్రాంతాల్లో భారీగా మ‌ద్యం పట్టుబడుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని అయితే, స్థానికుల స‌మాచారం మేర‌కు మాత్రమే అధికారులు దాడులు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వారంతట వారుగా తనిఖీలు చేసేందుకు సిద్ధపడటం లేదనీ, ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed