దందా కోసం ఒక్కటై.. కల్తీ చేస్తున్నరు

by  |
దందా కోసం ఒక్కటై.. కల్తీ చేస్తున్నరు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మద్యం వ్యాపారులు సిండికేటై అడ్డగోలు దందా చేస్తున్నారు.. పేరుకే లైసెన్సు హోల్డర్లు ఉండగా.. గుడ్ విల్ ఇచ్చి, వాటాదారులుగా తీసుకుని.. పాతవారే బిజినెస్​చేస్తున్నారు. తాజా, మాజీ ప్రజాప్రతినిధుల అనుచరుల వైన్​షాపుల్లోనే జోరుగా మద్యం కల్తీ చేస్తూ, అధికారుల సహకారంతో నిబంధనలకు పాతరేస్తున్నారు. చాలా చోట్ల బెల్టు షాపులకు విలేజ్ డెవలప్ మెంట్ కమిటీల ఆధ్వర్యంలో వేలంపాటలు జరుగుతున్నాయి. కాగా, మద్యం అమ్మకాలే టార్గెట్ గా అధికారులు పని చేస్తుండడంతో ప్రభుత్వమే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. కల్తీ మద్యంతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలున్నాయి.

ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యం.!

చెన్నూరు మండలం పొకూరు బెల్టుషాపులో ముగ్గురు మిత్రులు కలిసి మద్యం సేవించారు. ఇందులో ఒకరు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. అయితే ఆ వ్యక్తి కల్తీ మద్యం సేవించడం వల్లే చనిపోయాడా.. అందులోని వారే మద్యాన్ని కల్తీ చేశారా.. అనేది మిస్టరీగా మారింది. ఈ బెల్టు షాపునకు చెన్నూరులోని ఓ వైన్స్​నుంచి మద్యం సరఫరా అవుతోంది. అక్కడ విక్రయిస్తున్న మద్యం సీసాల మూతలు తీసి ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ వైన్​షాపులో మద్యం కొనుగోలు చేసిన కొందరు ఆ ఘటన జరిగిన మరుసటి రోజు వెళ్లి నిలదీయగా, గొడవ అవుతుందని భావించిన షాపు నిర్వాహకులు వారికి మద్యం బాటిళ్లు మార్చి ఇవ్వడంతోపాటు అదనంగా బాటిళ్లు ఇచ్చి పంపించారని సమాచారం.

(ఇతర ప్రాంతాలకు మద్యం ప్రియులు..)

నిర్మల్​లోని పలు దుకాణాల్లో మద్యం కల్తీ చేస్తున్నారనే ఆరోపణలుండడంతో చాలా మంది ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. నిర్మల్ లో అధికార పార్టీ నాయకుల అనుచరులకు టెండర్లో నాలుగు దుకాణాలు దక్కాయి. మరో పార్టీ నాయకుడి అనుచరులకు మరోచోట దక్కింది. బెల్టుషాపులకు విచ్చలవిడిగా మద్యం పంపుతుండగా.. మద్యం ప్రియులు అడిగిన బ్రాండ్లు కాకుండా.. మార్జిన్ ఎక్కువగా వచ్చే మద్యం సరఫరా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

భైంసాలో ఓ మద్యం దుకాణం లక్కీ డ్రాలో ఒకరికి రాగా.. ఈ దుకాణాన్ని పాత మద్యం వ్యాపారి ఒకరు గుడ్ విల్, భాగస్వామ్యం ఇచ్చి తీసుకున్నారు. ఇలాంటి కేసులు జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. భైంసాలో ఇప్పటి వరకు రెండు వర్గాలుగా విడిపోయిన వ్యాపారులు ప్రస్తుతం సిండికేటుగా మారారు. బెల్టుషాపులకు నెలకో దుకాణం నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించే సమయంలోనే వైన్​షాపుల వారు తమ ప్రాబల్యం ఉండేలా చూసుకుంటున్నారు. తర్వాత తమ దుకాణం నుంచే మద్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

సిండికేటైన వ్యాపారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 160 వైన్​షాపులు, 27 బార్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అధికార, ఇతర పార్టీలకు చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులకు చెందినవే ఉన్నాయి. జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్, భైంసా తదితర ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు పార్టీలకతీతంగా సిండికేటుగా మారి.. నిబంధనలకు పాతరేస్తున్నారు. మద్యం అమ్మకాలే టార్గెట్ గా పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులు.. తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైన్​షాపుల్లో మద్యం కల్తీ అవుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. నాన్ పెయిడ్ డ్యూటీ మద్యం రాకుండా.. రాష్ట్రానికి చెందిన మద్యం మాత్రమే విక్రయించేలా చూస్తున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై అధికారులకు టార్గెట్లు విధించటంతో సాధ్యమైనంత మద్యం లిఫ్టి చేసేలా చూస్తున్నారు. ప్రతి దుకాణం నుంచి మామూళ్లు ఎలాగూ వస్తుండటంతో.. నిబంధనలను గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.

వీడీసీల ఆధ్వర్యంలో వేలంపాటలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వేల వరకు బెల్టుషాపులు ఉన్నాయి. వారిని అధికారులతో పాటు వైన్​షాపుల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారనే తెలుస్తోంది. చాలా గ్రామాల్లో బెల్టుషాపులకు వీడీసీ (గ్రామాభివృద్ధి కమిటీ) లు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. దీంతో బెల్టుషాపుల వారు బాటిల్​కు రూ.10 నుంచి రూ.15 అదనంగా తీసుకుంటున్నారు. ఇక పోలీసులకు మామూళ్లు, మద్యం బాటిళ్లు ఇస్తుండగా.. ఎక్సైజ్ అధికారులకు వైన్​షాపుల వారే మామూళ్లు ఇస్తున్నారని తెలుస్తోంది.

డిపోల నుంచి సిండికేట్​ఆఫీసులకు..

ఆదిలాబాద్, మంచిర్యాల, భైంసా, నిర్మల్ లోని పలు వైన్​షాపుల్లో మద్యం కల్తీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. డిపోల నుంచి మద్యం రాగానే.. సిండికేట్ కార్యాలయాలకు చేరుతోంది. రాత్రికి రాత్రే బాటిల్​సీల్​తీసి నీళ్లు, స్పిరిట్ కలుపుతుండగా.. కొన్ని చోట్ల తక్కువ ధరకు లభించే మద్యాన్ని పేరున్న బ్రాండ్లలో కలిపి మళ్లీ సీల్ వేస్తున్నారు. మద్యం కల్తీ చేస్తే.. తొలిసారి రూ.మూడు లక్షలు, రెండో సారి రూ. ఆరు లక్షలు, మూడో సారి వారం పాటు సస్పెన్షన్ చేస్తారు. మద్యం దుకాణం లైసెన్సు ధర కంటే ఏడు రెట్ల వరకు 18 శాతం కమిషన్ ఇస్తుండగా.. తర్వాత 2 నుంచి 3 శాతమే వస్తుంది. దీంతో పాటు ఇటీవల 30 శాతం ధరలు పెరుగగా.. టార్గెట్ లో దీనిని తీసుకోవడం లేదు. దీంతో మద్యం వ్యాపారులు కల్తీ చేసి.. కాసులు వెనకేసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప, అధికారులు దాడులు, తనిఖీలు చేయటం లేదని తెలుస్తోంది. మొత్తానికి మద్యం దందాలో సిండికేట్ వ్యాపారులదే హవా నడుస్తోంది.



Next Story

Most Viewed