వర్షం కురుస్తున్నప్పుడు పిడుగులు ఎందుకు పడతాయి?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

by Dishafeatures2 |
వర్షం కురుస్తున్నప్పుడు పిడుగులు ఎందుకు పడతాయి?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
X

దిశ, ఫీచర్స్ : వర్షం కురుస్తున్నప్పుడు లేదా కురువడానికి ముందు ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. ఈ సందర్భంలో కొన్నిసార్లు పిడుగులు పడుతుంటాయి. ప్రతీ సంవత్సరం పిడుగు పాటు కారణంగా మన దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అయితే అసలు పిడుగు అంటే ఏమిటి? ఎందుకు పడుతుంది? దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.

ఇలా పుడతాయి..

ఎండలు, అధిక ఉష్ణోగ్రతలవల్ల నీరు ఆవిరిగా మారుతుందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగానే ఆకాశంలో సుమారు 25 వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. ఈ సందర్భంలో పైనుంచి సూర్యరశ్మి అధిక ప్రభావం కారణంగా తక్కువ బరువు ఉన్న ధనావేశిత (+)మేఘాలు పైకి వెళ్తాయి. అదే సందర్భంలో అధిక బరువు ఉండే, దట్టమైన రుణావేశిత మేఘాలు (వీటిలో ఎలక్ట్రాన్లు అధికంగా) కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారం ఇలా వచ్చిన రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు దగ్గరలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షించబడతాయి.

భూమిపై ఎప్పుడు పడతాయి?

కాగా ధనావేశిత మేఘాలు ఎత్తుగా వెళ్లినప్పుడు సమీపంలో మరే వస్తువు ఉన్నా, మనుషులు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ సందర్భంలోనే మేఘాల నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రాన్లు రిలీజై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు వేగంగా దూసుకొస్తాయి. దీనిని పడుగుపాటు లేదా పిడుగు పడటం అంటారు. అలాగే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఉరుములు, మెరుపులు కూడా పుడతాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏప్రిల్ చివరలో, మే నెలలో కురిసే అకాల వర్షాల సందర్భంలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నప్పుడు సురక్షిత ప్రదేశాల్లో, ఇండ్లల్లో ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొలాల్లో పనిచేసే వారు చెట్ల కింద ఉండకుండా గుడిసెల్లోకి, అడవుల్లో సంచరించేవారు రాతి గుహలు, ఇతర సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లడం ద్వారా తప్పించుకోవచ్చు. గ్రామాలు, నగరాల్లో నివసించేవారు కూడా చెట్లు, సెల్‌ఫోన్ టవర్ల కింద ఉండకుండా జాగ్రత్త పడాలి.

వీటికి దూరంగా ఉండాలి

ఇక ఉరుములు, మెరుపుల సమయంలో సెల్‌ఫోన్లు వాడటం, మాట్లాడటం, ఎఫ్ఎం రేడియోలో పాటలు వినడం వంటివి చేయకూడదు. ఇతర ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా యూజ్ చేయకూడదు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో సురక్షిత ప్రదేశంలో లేనివాళ్లు ఉరుములు, మెరుపులు వస్తుంటే, పిడుగు పడే అవకాశం కనబడగానే మోకాళ్లపై చేతులు పెట్టుకొని, తలవాల్చి ముడుచుకొని కూర్చోవాలి. దీనివల్ల పిడుగు పడినప్పుడు విడుదలయ్యే విద్యుత్ ప్రభావం తక్కువగా పడే చాన్స్ ఉంటుంది.

Next Story

Most Viewed