భూమి అంతానికి మ‌న‌మే కార‌ణమా? ఈ మార్గాల్లోనే ఆ ముగింపు రానుంది!

by Disha Web Desk 20 |
భూమి అంతానికి మ‌న‌మే కార‌ణమా? ఈ మార్గాల్లోనే ఆ ముగింపు రానుంది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌నిషి శ‌రీరం ఎంత బ‌లంగా ఉన్నా జీవితం మాత్రం చాలా బ‌ల‌హీన‌మైన‌ది. మాన‌వుడు ప్రమాదకర‌, ప్రాణాంతక‌ ముప్పు నీడ‌లోనే బ‌తుకుతున్నాడు. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే వ్యాపారాల‌కు అనువుగా మారింది. మనల్ని మనం రక్షించుకోడానికి, మ‌న‌పై ఆధార‌ప‌డిన వారిని సంర‌క్షించుకోడానికి ఆరోగ్య, జీవిత బీమాల‌ను ఆశ్ర‌యిస్తున్నాము. అలాగ‌ని, ఎవ్వ‌రూ త‌మ చావును తాము కొని తెచ్చుకోవాల‌ని అనుకోరు. కానీ, నిజం ఏంటంటే, ప్ర‌స్తుత కాలంలో ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద విపత్తులు చూస్తున్నాము. ప్రపంచాన్ని, మానవాళిని నాశనం చేయగల వాటి గురించి ఏంటి? వాటిని సృష్టించింది ఎవ‌రు? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మ‌న‌మే వెతుక్కోవాల్సి ఉంది.

జ్ఞానమే శక్తి అంటారు కొందరు. కాబట్టి ఆ తర్కం ప్రకారం, ప్రపంచం ఎలా అంతం కాబోతుందో తెలుసుకుంటే, ఆ జ్ఞాన‌మే మ‌న‌ల్ని మ‌నం రక్షించుకోడానికి మనకు సహాయం చేస్తుంది. అంటే, స‌మ‌స్య ఏంటో స్ప‌ష్టంగా తెలిస్తే ప‌రిష్కారం సులువుగా దొరుకుతుంది అన్న‌ట్లు. ఈ క్ర‌మంలోనే, గ్లోబల్ ఛాలెంజెస్ ఫౌండేషన్, ప్రపంచ విపత్తు ప్రమాదాలపై వార్షిక అంచనాను సిద్ధం చేసింది. దీన్ని బ‌ట్టి మాన‌వాళి "ముగింపు" జరగడానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఇలా, మనకు సంభ‌వించే అతి పెద్ద విపత్తుల్లో తొమ్మిది ప్ర‌ధాన విప‌త్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

సామూహిక విధ్వంసం చేసే మానవ నిర్మిత ఆయుధాలు

బ‌హుశా, భూమి పుట్టిన‌ప్ప‌టి నుండి, చరిత్రలో మొట్టమొదటిసారిగా, మానవాళికి సంబంధించి ఎక్కువ‌ భాగం విధ్వంసం కావ‌డానికి, సామూహిక విధ్వంసం చేయగల సామర్థ్యాన్ని ఇప్ప‌టి ఆధునిక మానవుడే కలిగి ఉన్నాడు. అణ్వాయుధాలు కొత్తవి కాదు, 1945లో ఈ బాంబులు హిరోషిమా, నాగసాకిలో 129,000 నుండి 226,000 మందిని చంపాయి. ఈ రోజు ఇంత‌కంటే పెద్ద ముప్పు మనందరి తలలపై వేలాడుతోంది. అంత‌ర్జాతీయంగా ఆయుధ రహిత ఒప్పందాల చేసుకున్నా కూడా, ఇంకా అణ్వాయుధాలు అందుబాటులోనే ఉన్నాయి. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఈ అణుబాంబు ముప్పు లేక‌పోలేదు.

మరోవైపు, జీవరసాయన యుద్ధం ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తుంది. కొత్తగా సృష్టించబడి, జన్యుపరంగా మార్పు చెందిన వ్యాధుల ద్వారా, క‌రోనాలా ఊహ‌కంద‌ని రీతిలో, కొత్త కొత్త‌ మహమ్మారులు రావచ్చు. అనుకోకుండానో, ఉద్దేశపూర్వకంగానో ఇలాంటి జీవ‌ర‌సాయ‌న ఆయుధాలు ప్రవేశపెట్టబడితే, ఇక భూమిపైన మ‌నుషులు పిట్ట‌ల్లా రాలిపోవాల్సిందే. కరోనావైరస్ మహమ్మారి చూసిన త‌ర్వాత ఈ ప‌రిస్థితికి మ‌రో ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం లేదు.

క్లైమేట్ ఛేంజ్‌

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కుంటున్న తీవ్ర‌మైన‌ సమస్య వాతావ‌ర‌ణ మార్పు. అంత‌ర్జాతీయంగా ఎన్నో అవ‌గాహ‌నా స‌ద‌స్సులు, ప్ర‌చారాలు చేస్తున్న‌ప్ప‌టికీ, చాలా మంది ఇప్పటికీ ఈ విపత్తును అంత‌ ప్రమాదకరమైనదిగా పరిగణించక పోవ‌డం బాధాక‌రం. అయితే, ఇది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ప్రాథమిక ప్రమాదాలలో ఒకటి. ఈ వాతావరణ మార్పుల ప్రభావాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అంచనాల ప్రకారం, మాన‌వ కార్య‌క‌లాపాలు, ప్ర‌కృతిలో తీవ్ర మార్పుల‌కు కార‌ణ‌మ‌య్యి, భూ గ్రహంపై వాతావరణాన్ని 170 రెట్లు వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 3°C కంటే ఎక్కువ పెరగడం అనేది విపత్క‌ర‌ వాతావరణ మార్పులతో ముడిపడి ఉంటుంది. ప్ర‌స్తుతం ఇదే జ‌రుగుతోంది.

గ్లోబల్ ఛాలెంజెస్ ఫౌండేషన్ ప్రకారం, ఈ స్థాయి గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్‌లల్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. చరిత్రలో అత్యంత ఎక్కువ‌ భూభాగాన్ని కోల్పోవడం వల్ల వాతావరణ ప్రభావాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వలసపోతారు. అదనంగా, ప్రాంతీయ, ప్రపంచ ఆహార భద్రతకు తీవ్రమైన సంక్షోభం, అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమతో కూడిన వాతావ‌ర‌ణం సాధారణ మానవ కార్యకలాపాలకు అపాయం కలిగించడం, భారీ జీవ‌ జాతుల నాశ‌నం వంటివి అంతానికి ప్రేరేపించవచ్చు.

పర్యావరణ పతనం

పర్యావరణ వ్యవస్థలు మానవ జీవితానికి మూలస్తంభం. అవి అనేక రకాల పనులను నిర్వహిస్తాయి. అవి లేకుండా మానవ ఆర్థిక వ్యవస్థలు, సమాజం పనిచేయలేవు. అవే మనకు అవసరమైన గాలి, నీరు, ఆహారం, ఆశ్రయం, శక్తిని అందిస్తాయి. పర్యావరణ వ్యవస్థలు మానవ వినియోగం నుండి కొంత ప్రభావాన్ని తట్టుకోగలవు. తక్కువ హానితో కొంత కాలం తర్వాత కోలుకోగలవు. కానీ, ఒక నిర్దిష్ట "టిప్పింగ్ పాయింట్" దాటి, ఆకస్మాత్తుగా, తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఇది "పర్యావరణ వ్యవస్థ పతనానికి" దారితీస్తుంది. ఈ ప‌రిణామం నేల నాణ్యత, మంచినీటి వనరులను ప్రభావితం చేస్తుంది. ఇది జీవవైవిధ్యం తీవ్రంగా క్షీణించడానికి, వ్యవసాయ ఉత్పాదకత క్షీణించడానికి, మానవుల సాధారణ జీవన పరిస్థితులు గణనీయంగా దిగజార‌డానికి కారణమవుతుంది.

మ‌హ‌మ్మారులు

COVID-19 మహమ్మారి ఆధునిక‌ ప్రపంచానికి మహమ్మారి గురించి చాలా గుణ పాఠాలు నేర్పింది. ప్ర‌పంచవ్యాప్తంగా వ్యాపించే క‌రోనా వంటి చాలా ప్రాణాంతక అనారోగ్యాలు గ‌తంలో కొన్ని ఉన్న‌ప్ప‌టికీ అవి ఇంత ప్ర‌భావ‌వంతంగా వ్యాప్తి చెందిన దాఖ‌లాలు లేవు. అందులోనూ, ఈ స్థాయిలో వైద్య‌, ప‌రిశోధ‌క రంగాలు అభివృద్ధి అయిన త‌ర్వాత కూడా ఇలాంటి మ‌హ‌మ్మారిని ఎదుర్కోలేక చేతులెత్తేయ‌డం భ‌విష్య‌త్తులో మాన‌వాళికి ఉన్న ముప్పును స్ప‌ష్టంగా తెలియ‌జేస్తోంది. ఏది ఏమైనప్పటికీ, మానవుల్లో మరొక కొత్త అంటువ్యాధి ఆగమనం గ‌తంలో కంటే ఇప్పుడు మ‌రింత ప్ర‌మాదాన్ని సూచిస్తోంది. అధిక జనాభా, పట్టణీకరణ, ప్ర‌పంచ‌వ్యాప్తంగా పరస్పరం అనుసంధానించబడిన సమాజంలో అధిక మరణాలు, వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందడానికి దారితీయవచ్చు.

5 నుండి 14వ‌ శతాబ్దాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా ప్లేగు అంటువ్యాధులు విజృంభించాయి. తక్కువ వ్యవధిలో ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం మందిని చంపాయి. అప్పటి నుండి, క్రమబద్ధమైన ఇమ్యునైజేషన్ ప్రయత్నాలతో మనం రెండు వ్యాధులను నిర్మూలించగలిగాము. మానవుల్లో మశూచి, జంతువుల్లో రిండర్‌పెస్ట్ - ఇవి యుగాలుగా నాగరికతను పీడిస్తున్నాయి. ఇక‌, గినియా వార్మ్, పోలియో - ఈ వ్యాధులు పూర్తిగా మాయ‌మ‌వ‌డానికి దగ్గరగా ఉన్నాయి.

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవుల కంటే చాలా తెలివైనదని సాధారణ ఏకాభిప్రాయం. ఇది మానవాళిని కొత్త పుంత‌లు తొక్కించ‌గ‌ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, నిపుణులు మాత్రం ఈ కొత్త ద‌నం మాన‌వ నాశ‌నానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని ఆందోళ‌న‌లో ఉన్నారు. అవి శిక్షణ పొందిన పనుల్లో ఆధునిక కృత్రిమ మేధస్సు వ్యవస్థలు, ఇప్పటికే మానవులను మించిపోయాయి. అయితే, AI అకస్మాత్తుగా మనుషుల్లో సైతం మానసిక ధోరణులను అభివృద్ధి చేస్తుంది. అయితే, అది సినిమాల్లో చూపించిన‌ట్లు, యాదృచ్ఛికంగా ప్ర‌జ‌ల‌పై దండ‌యాత్ర చేసి, చంప‌క‌పోవ‌చ్చు. కానీ, బదులుగా, AI ప్రోగ్రామ్ ఉద్దేశపూర్వకంగా, హాని త‌ల‌పెట్ట‌డానికి ఉపయోగించబడుతుంది.

సూపర్ వోల్కానిక్ విస్ఫోటనం

స‌హ‌జంగా సూపర్-అగ్నిపర్వత విస్ఫోటనం కనీసం 400 కిలో మీట‌ర్ల‌ బల్క్ మెటీరియల్ పేట‌డంతో స‌మానంగా చూడొచ్చు. ఇలాంటి పెద్ద-స్థాయి విస్ఫోటనాలు భవిష్యత్తులో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అవి అత్యంత వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉండవచ్చు. సుమారు 74,000 సంవత్సరాల క్రితం, ఇండోనేషియాలోని టోబా సూపర్‌వాల్కానో విస్ఫోటనం చెందింది. అది వాతావరణంలోకి బిలియన్ల టన్నుల దుమ్ము, సల్ఫర్ డయాక్సైడ్‌ను వెదజల్లింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాలా సంవత్సరాలుగా, ప్రపంచంలో 3-5 ° C చలికి దారితీసింది. అలాగే, ఎన్నో జాతుల మొక్కలు, జంతువులను బ‌లితీసుకుంది. మానవ చరిత్రలో అతిపెద్ద సామూహిక మ‌ర‌ణాల‌కు కారణమైన టోబా మాన‌వ‌ జాతిని అంతరించిపోయే స్థాయికి తీసుకువచ్చిందని కొందరు పేర్కొన్నారు.

ఇక‌, 26,500 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్‌లో సంభవించిన తాజా సూపర్‌వోల్కానిక్ విస్ఫోటనం కూడా ఇలాంటి న‌ష్టాన్నే మిగిల్చింది. సగటున ప్రతి 17,000 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి విస్ఫోటనం జరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ అంచనాల ప్రకారం ఇలాంటి ప్ర‌మాదం లేక‌పోలేదు. భవిష్యత్తులో సూపర్‌వోల్కానిక్ విస్ఫోటనం జ‌రిగే ప్రదేశాలుగా గుర్తించిన USలోని ఎల్లోస్టోన్‌తో సహా అనేక ప్రదేశాలపై శాస్త్రవేత్తలు నిఘా ఉంచినప్పటికీ, మ‌నిషి సాధించిన విజ్ఞానంతో, ప్రస్తుతం కొన్ని వారాలు లేదంటే నెలల కంటే ముందుగా మాత్రమే అగ్నిపర్వత విస్ఫోటనాలను అంచనా వేయగ‌లుగుతున్నాము.


Next Story

Most Viewed