గిరిజన భాషల పరిరక్షణకు స్కూల్స్‌లో 'లాంగ్వేజ్ బాక్స్'..

by Disha Web Desk 6 |
గిరిజన భాషల పరిరక్షణకు స్కూల్స్‌లో లాంగ్వేజ్ బాక్స్..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని 7,000 సజీవ భాషల్లో దాదాపు 3,000 వరకు 'అంతరించిపోతున్న' భాషలుగా పరిగణించబడ్డాయి. ఒక్క భారతదేశంలోనే దాదాపు 197 భాషలు వివిధ దశల్లో ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి లిపి లేని అనేక గిరిజన భాషలు అంతరించిపోతుండగా.. వీటి సంరక్షణకు తమిళనాడు 'రీడింగ్ అండ్ లాంగ్వేజ్ రిట్రీవల్ మూవ్‌మెంట్' సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సెమ్మనారై గ్రామం(నీలగిరి జిల్లా)లోని ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 'లాంగ్వేజ్ బాక్స్' ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలోని విద్యార్థులు మాతృభాష పదాలను ఎంచుకొని, ఇంగ్లీష్ లేదా తమిళ్‌లో పేపర్‌పై రాసి ఈ పెట్టెలో వేయాలి. ఇలా కనుమరుగవుతున్న పదాలను సేకరిస్తున్నారు.

మాతృభాషల జనాభా లెక్కల ప్రకారం భారతదేశం 1961 నుంచి ఇప్పటివరకు 220 భాషలను కోల్పోయింది. రాబోయే 50 ఏళ్లలో మరో 150-250 భాషలు అంతరించిపోవచ్చని భాషావేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదపు అంచున మిగిలిన గిరిజన భాషలను కాపాడుకునేందుకు 'రీడింగ్ అండ్ లాంగ్వేజ్ రిట్రీవల్ మూవ్‌మెంట్'(ఆర్ఏఎల్‌ఆర్ఎమ్) సభ్యులు స్కూళ్లలో 'లాంగ్వేజ్ బాక్స్'లు ఏర్పాటు చేస్తున్నారు. 'రీడింగ్ అండ్ లాంగ్వేజ్ రిట్రీవల్ మూవ్‌మెంట్' గత రెండేళ్లుగా పిల్లలతో జానపద కథలను రికార్డ్ చేసి అమెరికన్ తమిళ్ రేడియోలో ప్రసారం చేస్తోంది. ఈ చొరవతో ప్రస్తుతం చాలా మంది పిల్లలు తమ మాతృభాషలో కథకులుగా మారారు.

'ఏ భాష అయినా మనుగడ కొసాగించాలంటే అది ప్రాచుర్యంలో ఉండాలి. అందువల్లే 'లాంగ్వేజ్ బాక్స్' ఇనిషియేటివ్ విద్యార్థుల్లో వారి భాష పట్ల గౌరవభావాన్ని పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాతృభాషపై ఆసక్తిని, ఉచ్చారణను మెరుగుపరచడంలో సాయపడుతుందని ఆశిస్తున్నాం. ఈ ప్రాంతంలోని అన్ని గిరిజన పాఠశాలల్లో ఇదేవిధమైన చొరవ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులు కొన్ని పదాలు మరిచిపోతున్నందున ఈ లాంగ్వేజ్ బాక్స్‌ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా మాతృభాష పరిరక్షణలో వారిని పాలుపంచుకునేలా చేయడమే కాక ప్రాచుర్యంలో లేని కొత్త పదాలలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ బాక్స్ ఓ పిగ్గీ బ్యాంకు లాంటిది. కానీ డబ్బు కంటే విలువైన మాతృభాష పదాలను సేకరిస్తుంది. ఆర్నెళ్లకు ఒకసారి పెట్టె తెరిచి అందుకు సహకరించిన విద్యార్థులను సత్కరిస్తాం. ఇక ఈ పదాలను సంకలనం చేసి ఒక పుస్తకం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం.

- ఒడియన్ లక్ష్మణన్, ఆర్ఏఎల్‌ఆర్ఎమ్ లీడర్, ఇరుల పాటల రచయిత

'ప్రతి గిరిజన సమూహానికి ఒక ప్రత్యేక భాష ఉంటుంది. వారికి ప్రత్యేకమైన కథలు, చరిత్ర, పాటలు, సామెతలు ఉన్నాయి. వారి భాషలో మాత్రమే వ్యక్తీకరించే సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. వలసలు, దేశీయ భాషలకు గుర్తింపు లేకపోవడం, తగ్గుతున్న జనాభా, సామాజిక-ఆర్థిక అంశాల వల్ల ఈ భాషలు అంతరించిపోతున్నాయి. వాస్తవానికి ఎంతోమంది గిరిజన పిల్లలు ప్రస్తుతం తమ మాతృభాష మాట్లాడటం లేదు. ఇది భాషకు మాత్రమే కాదు వారి సంప్రదాయానికి కూడా చాలా ప్రమాదకరం. మేము గిరిజనుల పిల్లలను ఇతర భాషలు నేర్చుకోకుండా నిరుత్సాహపరచడం లేదు. కానీ వాటిని సంరక్షించేందుకు వారి మాతృభాషలను నేర్చుకునేలా మాత్రమే మేము వారిని ప్రోత్సహిస్తున్నాం. ఈ నీలగిరి జిల్లాలో మొత్తంగా తోడ, కోట, ఇరుల, ఆలు కురుంబ, బెట్ట కురుంబ, ముల్లు కురుబ, పనియ, కట్టునాయక్‌ వంటి ఎనిమిది ఆదిమ గిరిజన సమూహాలున్నాయి.

- ఎన్ తిరుమూర్తి, గిరిజన భాషల పరిశోధకుడు


Next Story

Most Viewed