వేడిగాలులతో హీట్ స్ట్రోక్ ముప్పు.. పిల్లల రక్షణకోసం ఏం చేయాలంటే..

by Disha Web Desk 10 |
వేడిగాలులతో హీట్ స్ట్రోక్ ముప్పు.. పిల్లల రక్షణకోసం ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్: రోజురోజుకూ ఎండతీవ్రత పెరుగుతోంది. వేడిగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మరీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధమైన వాతావరణానికి పిల్లలు, పెద్దలు అనారోగ్యాల బారినపడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వడగాడ్పులకు త్వరగా ప్రభావితం అవుతారని, హీట్ స్ట్రోక్‌కు గురవుతారని, వెంటనే గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణహాని సంభవించవచ్చని అంటున్నారు. వీటితోపాటు తీవ్రమైన అలసట, హైపెథెర్మియాతో సహా పలు అనారోగ్యాలు సంభవిస్తాయి.

హీట్ వేవ్ ప్రభావం

హీట్‌వేవ్ అనేది భారతదేశంలోని ఉత్తర-పశ్చిమ, దక్షిణ మధ్య భాగాలలో వేసవి కాలంలో సంభవించే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కాలం. వేడిగాలులకు శరీరంలో వెంటనే ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు. జాగ్రత్తలు పాటించడంవల్ల ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చు. కన్సల్టెంట్-పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ అండ్ పీడియాట్రిక్స్ నిపుణుల ప్రకారం.. “హీట్‌వేవ్స్ తక్కువ వ్యవధిలో అత్యధిక మందిని ప్రభావితం చేస్తాయి. తరచుగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ప్రేరేపిస్తాయి. వడదెబ్బ తగలడం మూలంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అంతేగాక వేడి వాతావరణం సామాజిక, ఆర్థిక అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. వడగాడ్పుల మూలంగా శరీరం పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. స్టార్టప్‌లలో ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. విద్యుత్ కొరత కూడా తోడవడంతో ప్రజలు సౌకర్యాలను ఎదుర్కొంటారు. రవాణా, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు అంతరాయం కలుగుతుంది.

పరోక్ష ప్రభావం

పరోక్షంగా ఇది ఆరోగ్య సంరక్షణ సేవలపై ప్రభావం చూపుతుంది. ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వేడి ఉష్ణోగ్రతలవల్ల పెరుగుతాయి. పిల్లల్లో తీవ్రమైన అలసట, హీట్ స్ట్రోక్ సంభవిస్తాయి. వీటితోపాటు హీట్ ఇల్ నెస్, అతిసార వ్యాధి, వైరల్ హెపటైటిస్, చర్మంపై దద్దుర్లు, కండ్లకలక, చికెన్‌పాక్స్ వంటి వైరల్ ఎక్సాంథెమ్స్ వేడి ఉష్ణోగ్రతలవల్ల సంభవిస్తాయి. కాబట్టి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.

ఐఎండి సూచనలు

ప్రస్తుతం మన దేశం అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో శరీరం కాలిపోయేంత ఎండవేడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు తమను తాము హైడ్రేట్‌గా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ముఖ్యంగా చిన్నపిల్లలను వేడి గాలుల బారిన పడకుండా చూసుకోవాలని భారత వాతావరణ విభాగం (IMD) సూచిస్తోంది. ఈ ఏడాది ఇండో-గంగా మైదానాలు, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందట. అందుకే ఈ సమ్మర్‌లో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) తన ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేసింది. అవేంటంటే..

*ఎండాకాలం పిల్లలతో కలిసి ప్రయాణాలు అంతమంచిది కాదు. తప్పనిసరైనప్పుడు హీట్ స్ట్రోక్‌కు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఎక్కడికైనా వెళ్లినప్పుడు పార్క్ చేసిన కార్లలో పిల్లలను తీసుకొని కూర్చో వద్దు. ఎండకు వాహనాలు వేడెక్కుతాయి.

* పిల్లలకు ఫ్లూయిడ్స్, జ్యూస్, నీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. శిశువులలో వేడి-సంబంధిత వ్యాధులను ఎలా గుర్తించాలో తెలుసుకోండి

* హీట్ స్ట్రోక్‌కు గురైన పిల్లల్లో యూరిన్ ముదురు పసుపు రంగులో వస్తుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read..

‘డీప్ లెర్నింగ్ మోడల్’.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను అంచనా వేసే కొత్త పద్ధతని కనుగొన్న పరిశోధకులు


Next Story