పుష్కర్ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయ విశేషాలు

by Disha Web Desk |
పుష్కర్ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయ విశేషాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు ఒకరు. విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ చతుర్ముఖుడు. అసలు బ్రహ్మ లేనిదే సృష్టి లేదు కానీ అలాంటి దేవునికే భూమిపై పూజలు చేయరు. బ్రహ్మ దేవునికి భృగు మహర్షి పెట్టిన శాపం కారణంగానే ఆయనకి ఆలయం కట్టి పూజలు చేయరని పూర్వీకులు చెప్పిన కథనం. అయినప్పటికీ భారత దేశంలో నాలుగు బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్, తమిళనాడు, కాశీ అలాగే మన ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోనూ ఓ ఆలయం ఉంది. ఆ నాలుగు దేవాలయాల్లో ఇప్పుడు మనం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌ జిల్లాలోని పుష్కర్ అనే గ్రామంలో ఉన్నఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న తీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థం. దీన్ని దర్శించుకోకపోతే తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టేనని భావిస్తారు భక్తులు.


స్థల పురాణం

ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పద్మ పురాణంలో చెప్పిన కథ ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే.. బ్రహ్మ తన చేతిలో ఉన్న తామర పుష్పాన్నే ఆయుధంగా చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించాడట. ఆ సమయంలో పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మధ్య పుష్కర్, చివరిది కనిష్ఠ పుష్కర్. బ్రహ్మ చేతిలోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాబట్టి వీటికి పుష్కర్ అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.


బ్రహ్మ చేతిలోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన పుష్కర్ సమీపంలోనే ఎందుకు బ్రహ్మదేవుని ఆలయం నిర్మించారు అనే విషయాన్ని కూడా పురాణాలు చెపుతున్నాయి. బ్రహ్మ లోకకళ్యాణం కోసం అక్కడ ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతలందరిని ఆహ్వానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైందని, ఆహూతులందరు విచ్చేశారు. సరస్వతిని పిలుచుకొని రమ్మని తన కుమారుడు నారదుడిని పంపాడు బ్రహ్మ. తల్లి సావిత్రి (సరస్వతి) దగ్గరికి వెళ్లిన నారదుడు ఆమెతో ఇలా అన్నాడు. నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకురా " అని సలహా ఇచ్చాడు. అందువలన సరస్వతి తన సహచరులైన లక్ష్మి, పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికలో అందరు ఋషులు, దేవతలు సిద్ధంగా ఉన్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సరస్వతి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంభించాలని బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెపుతాడు. ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంభిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయిని తీసుకొని వచ్చాడు. శివుడు, విష్ణువు సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోనికి పంపి శుద్ధిచేశారు. ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి అలంకరిస్తారు. గోవుతో శుద్ధి చేయబడినది కాబట్టి ఆమెకి గాయిత్రి అని నామ కరణంచేసి, ఆమెను పెండ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు.


యజ్ఞం పూర్తవుతున్న సమయానికి సరస్వతి అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని ఉండడం చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారందరిని శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది. అన్నియుద్ధాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది. తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం ఉంది. అక్కడే చిన్న సెలయేరు కూడా ఉంది. దీన్నే సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలో స్నానం చేస్తే నిత్య సుమంగళిగా ఉంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును పూర్తిచేస్తామని అంటారు.


అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ ఉండవని చెబుతుంది. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించుకుంటే యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాన్ని కట్టిస్తాడని చెపుతుంది గాయత్రి. అప్పుడు బ్రహ్మదేవుడు పుష్కర్ గ్రామాన్ని ఎంచుకున్నాడని చరిత్ర చెపుతుంది. ప్రపంచంలోకెల్లా పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని, భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. అక్కడ ఎన్నో అందాలు


Next Story

Most Viewed