అవకాడోకు ప్రత్నామ్నాయంగా 'ఎకోవాడో'

by Disha Web Desk 22 |
అవకాడోకు ప్రత్నామ్నాయంగా ఎకోవాడో
X

దిశ, ఫీచర్స్ : అనేక ఆరోగ్య ప్రయోజనాలు గల 'అవకాడో' కిరాణా స్టోర్స్ నుంచి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్లా లభిస్తుందని తెలిసిందే. ఇందులోని గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. క్యాన్సర్, మధుమేహం, బీపీ వంటి వ్యాధుల నియంత్రణలోనూ తోడ్పడుతున్నందున వినియోగదారుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ క్రమంలోనే 'ఎకోవాడో' అనే పర్యావరణానుకూల ఫ్రూట్ మార్కెట్‌లోకి రాగా.. దీన్ని అవకాడోకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 బిలియన్ కిలోగ్రాముల అవకాడోలను వినియోగిస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. రెండు దశాబ్దాలుగా ఈ ఫలానికి ఆదరణ పెరిగిన మాట వాస్తవమే. కానీ పెరుగుతున్న డిమాండ్‌ అనుగుణంగా అవకాడో తోటల సాగుకు అడవులు నరికివేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. పైగా ఈ తోటలకు నీటి వనరుల అవసరం ఎక్కువ. ఈ కారణంగానే అవకాడోకు ఆల్టర్నేట్ ఫుడ్‌గా 'ఎకోవాడో' తెరమీదకు వచ్చింది. దీని తయారీకి నాటింగ్‌హామ్ యూనివర్సిటీ ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్‌కు చెందిన ఆహార శాస్త్రవేత్త జాక్ వాల్‌మాన్‌తో లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన మాస్టర్ విద్యార్థిని అరినా షోకౌహి జతకట్టింది. ఈ మేరకు 'ఎకోవాడో'ను పర్యావరణహితంగా రూపొందించారు.

ఎకోవాడో గుజ్జును బ్రాడ్ బీన్స్, హాజెల్ నట్, యాపిల్, రాప్‌సీడ్ ఆయిల్‌ సహా తేనె, ఫుడ్ కలరింగ్‌తో తయారు చేశారు. దీని రుచి క్రీమీ అవకాడోకు చాలా దగ్గరగా ఉంటుందని అరినా పేర్కొంది.



Next Story

Most Viewed