డిజిటల్ డిటాక్స్.. స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు మహారాష్ట్ర విలేజ్‌ కొత్త ప్రయోగం

by Disha Web Desk 7 |
డిజిటల్ డిటాక్స్.. స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు మహారాష్ట్ర విలేజ్‌ కొత్త ప్రయోగం
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని పట్టిపీడిస్తున్న సమస్య 'డిజిటల్ అడిక్షన్'. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ను క్షణమైనా విడిచి ఉండలేని మనుషుల స్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం ప్రతిరోజు గంటన్నర పాటు డిజిటల్ డిటాక్స్ అమలు చేయడం ద్వారా ఆ వ్యసనాన్ని అరికట్టేందుకు కొత్త మార్గాన్ని అమలు చేస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..

ఈ చొరవ వెనకున్న వ్యక్తి మోహిత్యాంచె వడగావ్ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే. గ్రామస్తులను డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. డిటాక్స్ అమలును ఇండికేట్ చేస్తూ రాత్రి 7.00 గంటలకు స్థానిక ఆలయంలో సైరన్ మోగుతుంది. అప్పుడు పుస్తక పఠనం, అధ్యయనం సహా వ్యక్తిగతంగా ఒకరికొకరు సంభాషించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను ప్రజలు తమ ఫోన్‌లు, గాడ్జెట్స్, టీవీ స్క్రీన్లను తప్పనిసరిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇలా గంటన్నరపాటు కొనసాగిన తర్వాత రాత్రి 8:30 గంటలకు డిటాక్స్ పీరియడ్ ముగింపును సూచిస్తూ మరొక సైరన్ మోగుతుంది.

మోహితే ప్రకారం.. కొవిడ్ లాక్‌డౌన్‌లో గ్రామస్తులు వారి ఫోన్లు, టీవీ స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఇక ఆన్‌లైన్ తరగతుల మూలంగా పాఠాలు ముగిసిన తర్వాత కూడా పిల్లలు గంటల తరబడిగా ఫోన్లతో గడిపే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ఫిజికల్ క్లాసెస్ ప్రారంభమైనప్పుడు పిల్లలు సోమరితనంగా, చదవడానికి లేదా వ్రాయడానికి ఆసక్తి చూపకపోవడాన్ని చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. చాలా మంది పాఠశాల సమయానికి ముందు, ఆ తర్వాత ఫోన్లలో నిమగ్నమై ఉంటున్నారనే విషయం అర్థమైంది. అయితే గ్రామాల్లోని ఇండ్లల్లో ఎవరికీ ప్రత్యేక అధ్యయన గదులు లేనందున.. మోహితే ఈ డిజిటల్ డిటాక్స్ ఆలోచనను రూపొందించాడు.

డిటాక్స్ గురించి మొదట ప్రకటించినప్పుడు.. ప్రజలు ఫోన్లు, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండటం సాధ్యంకాదని భావించి సంకోచించారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహిళలతో గ్రామసభను ఏర్పాటు చేసి 'అలారం మోగించడానికి' సైరన్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సేవకులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ టీచర్లు ఇంటింటికీ వెళ్లి ఈ డిజిటల్ డిటాక్స్ గురించి అవగాహన కల్పించారు. ఇక వార్డుల వారీగా ఈ కార్యక్రమం సక్రమంగా అమలవుతుందో లేదో చూసేందుకు ఒక కమిటీ గృహాలను పర్యవేక్షిస్తుంది.

Next Story

Most Viewed