ఆత్మీయుల మరణం పిల్లలపై ప్రభావం.. పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

by Disha Web Desk 13 |
ఆత్మీయుల మరణం పిల్లలపై ప్రభావం.. పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
X

దిశ, ఫీచర్స్: నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య లేదా ఇతర ఆత్మీయులు, బంధువులు ఎవరైనా మరణించినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్వడం సర్వసాధారణం. అయితే పెద్దలకు బాధాకరమైన పరిస్థితులను తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి తర్వాత వారు కుదుట పడుతారు. కానీ ఐదారేళ్లలోపు పిల్లలు ఇటువంటి పరిస్థితుల్లో గందరగోళానికి గురవుతుంటారు. సిచ్యువేషన్ అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో పేరెంట్స్ పిల్లల వయస్సు, మేధో సామర్థ్యాన్ని బట్టి వారిని బుజ్జగించాలని, మరణించినవారు ఇక తిరిగి రాలేరనే విషయాన్ని అర్థం చేయించాలని, వారిలో ధైర్యం కలిగేలా భరోసా ఇవ్వాలని అంటున్న చిన్న పిల్లల వైద్య నిపుణులు.. పలు సూచనలు అందిస్తున్నారు.

* పిల్లల్ని సముదాయించడానికి సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయండి. మీరు ప్రశాంతంగా కనిపిస్తూ నెమ్మదిగా మాట్లాడండి. మీ పిల్లలకు ఇష్టమైన వ్యక్తి మరణం గురించి చెప్పేటప్పుడు నిజాయితీగా, పారదర్శకంగా ఉండండి. మరణ వార్తలను స్వీకరించడానికి, అలాగే స్వతహాగా ఎమోషన్స్‌ను ఫీలవ్వడానికి సమయం ఇవ్వండి.

* ప్రతీ బిడ్డ మరణానికి భిన్నంగా ప్రతిస్పందిస్తుంది. కొందరు ఏడ్వొచ్చు. మరికొందరు పరధ్యానంగా కనిపించవచ్చు. ఈ సమయంలో మీ పిల్లల మాటలు ఓపికగా వినడం, వారిని ఓదార్చడం చాలా ముఖ్యం. వారి ప్రశ్నలకు సమాధానమివ్వండి, వారికి అండగా ఉండండి. మీరు విచారం లేదా దుఃఖాన్ని వ్యక్తం చేయడం సరైందేనని వారికి తెలియజేయండి.

* మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? వ్యక్తి మరణించినప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితి గురించి ఎలా ఆలోచిస్తున్నారు? తెలుసుకోండి. మీ ఫీలింగ్స్, భావోద్వేగాల గురించి కూడా ఏమనుకుంటున్నారో అడగండి. ఇది వారు కూడా మీతో తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అలా భావాలను వ్యక్తపరచడం కరక్టేనని వారికి తెలియజేయండి.

* ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడంవల్ల మీ పిల్లల దినచర్య లేదా జీవితం మారవలసి వస్తే ఏం జరుగుతుందో వివరించండి. రాబోయే మార్పుల కోసం మీ బిడ్డ సిద్ధంగా ఉన్నట్లు భావించడంలో ఇది సహాయపడుతుంది. మరణానికి ఎవరూ బాధ్యులు కాదని గుర్తుచేయండి.

* అంత్యక్రియలు లేదా స్మారక సేవలు వంటి ఆచారాలు, సంప్రదాయాలు, కార్యక్రమాలలో మీ పిల్లలను పాల్గొనే అవకాశం ఇవ్వండి. అక్కడ ఏం జరుగుతుందో వివరించండి. ప్రతి ఒక్కరూ తమ నష్టాన్ని, ఎడబాటును అర్థం చేసుకోవడానికి, వీడ్కోలు చెప్పడానికి సంతాపం ఒక ముఖ్యమైన మార్గమని తెలియజేయండి.

* మీ పిల్లలకు ఇష్టమైన వ్యక్తి చనిపోవడం వారిని బాధలోకి నెడుతుంది. అయితే కోల్పోయిన వ్యక్తితో మరో రూపంలో కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించండి. చనిపోయిన వ్యక్తి పెయింటింగ్ వేయడం, పద్యం చదవడం, ఆ వ్యక్తి గురించి ఏదైనా రాయడం లేదా పాట పాడడం వంటివి చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైంది మరణించిన వ్యక్తి గురించి చర్చించడానికి ఇబ్బంది పడకండి. సంతోషకరమైన జ్ఞాపకాలను పంచుకోవడం సంతాప ప్రక్రియలో సహాయపడవచ్చు.

* వ్యక్తులు మరణించిన సందర్భంలో ఆ ఇంటిలోని పరిస్థితి వల్ల కొంతమంది పిల్లలు నిద్రించడానికి ఇబ్బందిపడవచ్చు. లేదా ఇష్టమైన వ్యక్తి చనిపోవడంతో భయం, ఆందోళన కలిగి ఉండవచ్చు. కాలక్రమేణా ఈ ఫీలింగ్స్ పోతాయని, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పాలి. పేరెంట్స్‌గా మీ పిల్లలకు అదనపు సమయం, సంరక్షణ అందించండి. మరింత సహాయం కావాలంటే సపోర్ట్ గ్రూపులు లేదా కౌన్సెలింగ్‌ను ఎంచుకోండి.

Also Read..

Low Blood Sugar : లో బ్లడ్‌ షుగర్‌తో మాటల్లో తడబాటు.. కారణం అదేనట !

Next Story

Most Viewed