పల్లె కడుపున పాటై పుడితిరి..

by  |
పల్లె కడుపున పాటై పుడితిరి..
X

– కళామతల్లికి పబ్బతి పడితిరి
దిశ, కరీంనగర్: ‘పల్లె..అనే పదమే మనకు తెలియని ఉత్సాహాన్నిస్తుంది.. ఇక ఆ పల్లెలో పూసిన సాహిత్య మల్లెల పరిమళాలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయంటే, ప్రాచీన కళకు సైతం జీవం పోసి ఉర్రూతలూగించాయంటే అది ఆ పల్లె గొప్పతనం కూడా. మరి ఆ గడ్డ మీద పురుడోసుకున్నది మామాలు వ్యక్తులా.. కాదు. ఒకరు తెలుగు సాహిత్యానికి తన రచనలు, కావ్యాలు పాటలతో ఎనలేని సేవలందించడమే కాకుండా, విశ్వంభర కావ్యంతో జ్ఞానపీఠ అవార్డు పొందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె). మరొకరు అక్షర జ్ఞానం లేకున్నా.. ఆశువుగా ఒగ్గు కథలు చెబుతూ ఆ కళకే వన్నెతెచ్చిన మిద్దె రాములు. కళామతల్లికి వీరు చేసిన సేవలు ప్రత్యేకం. ఎవరి స్థాయిలో వారు తాము పుట్టిన గడ్డకు పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఇంతటి గొప్ప కళాకారులను అందించింన ఊరు ఒకటే కావడం విశేషం.

ఓ వైపున మూల వాగు (పెద్దవాగు), మరో వైపున నక్క వాగు..ఈ రెండు వాగుల నడుమ ఉన్న చిన్న పల్లెటూరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలంలోని హన్మాజిపేట. నైజాం పాలనలో పల్లెల్లో చదువుకునే పరిస్థితులు అంతంత మాత్రమే. అయినా తపనతో మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి సిరిసిల్ల సర్కారు బడిలో చదువుకున్నారు సినారె. ఉన్నత విద్య కరీంనగర్ గంజ్ హైస్కూల్‌లో, ఇంటర్ చాదర్‌ఘాట్‌లో, డిగ్రీ, పీజీ ఉస్మానియాలో పూర్తిచేశారు. చిన్ననాట ఊర్లో వేసిన నాటకాల ప్రభావంతో తన ఊరి పొలిమేర మీదుగా ప్రవహిస్తున్న మూలవాగు సాక్షిగా కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ అంటూ తన కలం నుంచి జాలువారిన అక్షరాలతో సినీ గేయ రచయితగా ఎదిగారు. అమ్మతనంలోని కమ్మదనమైనా, కమ్మదనం లేని అమ్మతనం గురించైనా తన పాటలతో ఎత్తి చూపి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు సినారె. సినీ రంగంతో మమేకమైన అతి తక్కువ మంది తెలంగాణా వారిలో సినారె మొదటి తరానికి చెందిన వారనే చెప్పాలి. డిగ్రీ వరకూ ఉర్దూ ప్రధాన మాధ్యమంగా చదివిన సినారె ఉస్మానియాలో తెలుగు సాహిత్యంలో పీజీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. అత్యున్నతమైన ‘జ్ఞానపీఠ’ పురస్కారాన్ని సైతం అందుకున్న సినారె రచనలు జాతీయ అంతర్జాతీయ భాషల్లోకి కూడా అనువదించారు. 1960వ దశాబ్దంలో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన తెలుగు పాటలపై తనదైన ముద్ర వేశారు.

ఇదే గ్రామంలో జన్మించిన మిద్దె రాములు..చదువుకోకున్నా చిన్నప్పుడు గ్రామాల్లో ప్రదర్శిస్తుంటే చూసిన బుర్ర కథలు, హరికథల స్ఫూ్ర్తితో కళారంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తనకు గురవెవరూ లేకున్నా స్వతహాగా ఇంట్లోనే ఆముదపు దీపం వెలుతురులో కాళ్లకు గజ్జెల బదులు తుమ్మకాయలు కట్టుకుని ప్రాక్టీస్ చేసేవారు. దీపపు వెలుతురులో తన కదలికలను గమనించుకుంటూ ఒగ్గు కథ పితామహునిగా ఎదిగాడు. 1980వ దశాబ్దంలో తెలంగాణ పల్లెల్లో మిద్దె రాములు ఒగ్గుకథ చెప్తున్నాడంటే చాలు చుట్టూ ఉన్న గ్రామాల నుంచి జనం ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారు. చదువు అంటేనే తెలియని మిద్దె రాములు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారాడంటేనే ఆయన ప్రజ్ఞ ఏపాటిదో మనకు అర్థమవుతుంది. ఇక నెత్తిన దీపంతో కూడిన బోనం ఎత్తుకుని నేలను ముద్దాడే భంగిమ మిద్దె రాములు ప్రదర్శనల్లోకెల్లా హైలెట్‌గా నిలుస్తుంది. ఉద్యమ సమయంలో నిర్వహించిన ధూం ధూం ప్రోగ్రామ్స్‌లో ఈయన ప్రదర్శన ఖచ్చితంగా ఉండేది. పురాణాలు, చారిత్రక గాథలే కాకుండా తన కథల ద్వారా సామాజిక చైతన్యాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ‘ఒగ్గు కథ పాఠాలకు బడి’ పెట్టాలన్న కోరిక తీరకుండానే ఆయన అనారోగ్యంతో తనువు చాలించారు.



Next Story

Most Viewed