కేసీఆర్‌కు లక్ష లేఖలు.. అడ్రస్ ఇదే!

by  |
letter-to-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి భూ పరిష్కార వేదిక సామాజిక ఉద్యమం నుంచి అసైన్డ్, లావునీ పట్టా భూములపై శాశ్వత హక్కులు కల్పించాలనే ఆలోచన పుట్టింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా స్పందన లభిస్తున్నది. ప్రతి ఒక్క అసైన్ మెంట్ భూపట్టాదారుడి నుంచి సీఎంకు లేఖలు రాసేటట్లుగా ఇప్పటికే వ్యూహరచన చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికలపై లేఖలను పోస్టు చేస్తున్నారు. అయితే సీఎంతో పాటు వీటిని ప్రతిపక్ష నేతలైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా ట్యాగ్ చేస్తున్నారు. భూహక్కులపై పోరాడుతున్న పలువురు ఈ లేఖలను ట్విట్టర్ ద్వారా తెలంగాణ సీఎంవో, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లపై ట్యాగ్ చేస్తున్నారు. అడగనిదే అమ్మయినా పెట్టదు. అందుకే అసైన్మెంట్ భూమి కలిగిన ప్రతి ఒక్కరూ శాశ్వత యాజమాన్యపు హక్కుల కోసం ఉత్తరాలు రాయాలంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ధరణి సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ అసైన్ మెంట్ భూహక్కులను కూడా పట్టించుకోవాలన్న డిమాండ్ పెరిగింది. 1958 జులై 25 కంటే ముందు జారీ చేసిన లావునీ పట్టాలకు శాశ్వత యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదే చిరునామా!

ముఖ్యమంత్రి కార్యాలయం, తెలంగాణ సచివాలయం, బీఆర్కే భవన్, హిల్ ఫోర్ట్, ఆదర్శనగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. పిన్. 500063.. అనే చిరునామాకు లేఖలు పంపాలంటూ ఉద్యమకారులు కోరుతున్నారు.

నెరవేరని సీఎం హామీ

తమ వర్గానికి చెందిన పేద రైతుల భూములను అమ్ముకోకుండా చట్టం ఉండటం వల్ల సామాజిక, ఆర్థికంగా వెనుకబాటుతనంలోనే ఉండిపోవాల్సి వస్తుందంటూ అధికార పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అదే పార్టీకి చెందిన దళిత, గిరిజన ఎమ్మెల్యేలు సైతం మద్దతు పలికారు. అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో దీనిపై ఎమ్మెల్యేలతో కమిటీ వేస్తామని, అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే చర్చిద్దామని రెండుసార్లు అసెంబ్లీలో సీఎం హామీ ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదు.

పెద్దలకు పట్టాల జారీ

ఇటీవల రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో పలువురు సినీ, రాజకీయ పెద్దలు పేదల భూములను కొనుగోలు చేశారన్న విషయాన్ని ‘దిశ’ వెలుగులోకి తెచ్చింది. తాజాగా శంకర్ పల్లి మండలం మోకిలలో శ్రీనివాస బిల్డర్స్ రిప్రజెంటెడ్ బై శ్రీనివాసరావు, తండ్రి రామారావు పేరిట సర్వే నెం.97/11 లో 9.37 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. దీనికి ఆధార్, ఈ కేవైసీ కూడా పూర్తయింది. కాకపోతే ధరణి పోర్టల్ అమలైన తర్వాత వాటిని పీఓబీలో ఉంచారు. ఇదే సర్వే నెంబర్ లో అనేక మంది అక్రమార్కులు అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. ధరణి రికార్డులను ర్యాండమ్ గా చెక్ చేస్తేనే ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీటిని ఏ ఎమ్మార్వో, ఏ సబ్ రిజిస్ట్రార్ క్రయవిక్రయాలకు ఊతమిచ్చారో, మ్యుటేషన్ చేశారో దర్యాప్తు చేయాలి. ఒక్క మోకిల గ్రామంలోనే వందలాది మంది పెద్దలు పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారు. ఇలా శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాద్ నగర్, షాబాద్ మండలాల్లో పలుచోట్ల అసైన్డ్ భూములను వెంచర్లు చేసి ప్లాట్లుగా అమ్మేశారు. వీటిని రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్లపై నేటికీ ఎలాంటి చర్యలూ లేవు.

దశాబ్దాల క్రితమే ప్లాట్లు

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పీరంచెరువు రెవెన్యూ పరిధిలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి 50 ఏండ్ల క్రితం పదెకరాల అసైన్ మెంట్ భూమికి పట్టా ఇచ్చారు. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చునని చట్టం చెబుతోంది. అయితే దాన్ని ఆయన 30 ఏండ్ల క్రితమే అమ్మేశారు. రియల్టర్లు కొనుగోలు చేసి వెంచర్ చేశారు. ఆ ఏరియా నగరానికి అత్యంత సమీపంలోనే ఉంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు దగ్గరలో ఉంది. ఈ క్రమంలో ఆ ప్లాట్లను పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేశారు. ఇప్పుడక్కడ గజం ధర రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పలుకుతోంది. ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే ఆ సర్వే నెంబర్లను ప్రభుత్వ భూమిగా పేర్కొని పీవోబీలో చేర్చారు. ఇంకేముంది? ఆ ప్లాట్ల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇండ్ల నిర్మాణాలకు అనుమతుల జారీ ఆగిపోయింది. లబోదిబోమంటూ ప్లాట్ల యజమానులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ధరణిపై నియమించిన కేబినేట్ సబ్ కమిటీ చైర్మన్ హరీశ్ రావుకు వారు తమ ఆవేదనను వివరించారు.

అసైన్ మెంట్ చట్టాల ప్రకారం

– హైకోర్టు వివిధ తీర్పుల్లో తెలంగాణలో 1958కి ముందు అసైన్డ్ చేసిన భూములను పట్టా భూములుగా పరిగణించాలి. కానీ ఖాస్రా పహాణీ ఆధారంగా వాటిని ధరణిలో ప్రభుత్వ భూములుగా, లావునీ పట్టాలుగా నమోదు చేశారు. అదే క్రమంలో నిషేధిత ఆస్తి విభాగంలో చేర్చారు.
– స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములను పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ వాటిని 22ఏ జాబితాలోనే నమోదు చేశారు. కలెక్టర్ నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్లు తేవాలంటూ నిబంధనలను అమలు చేస్తున్నారు.
– తాజాగా భూములు కేటాయించి 30 ఏండ్లు గడిచిన తర్వాతైనా శాశ్వత భూమి హక్కులు కేటాయించాలన్న డిమాండ్ పెరిగింది.


Next Story

Most Viewed