ప్రేక్షక దేవుళ్లకు కన్నడ పరిశ్రమ పిలుపు..

by  |
ప్రేక్షక దేవుళ్లకు కన్నడ పరిశ్రమ పిలుపు..
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర మందిరం (సినిమా హాల్).. కొన్ని లక్షల మంది సినీ కళాకారుల జీవితాలతో ముడిపడి ఉంది. ఒక నటుడి కలను సాకారం చేస్తుంది, సాంకేతిక నిపుణుల కష్టాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది. రచయితల సృజనాత్మకతకు ఊపిరిపోస్తుంది, దర్శకుల విధిని పెంచుతుంది. నిర్మాతల డబ్బుకు సమాధానం ఇస్తుంది, డిస్ట్రిబ్యూటర్ల రుణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. థియేటర్ యజమానుల విశ్వాసాన్ని మనుగడలో ఉంచుతుంది. వీరందరికీ చిత్ర మందిరాలు దేవాలయాలైతే.. ప్రేక్షకులే దేవుళ్లు. సింహాసనాన్ని అలంకరించి సినిమా చూసి ఆశీర్వదిస్తాడు. హాస్యానికి ఆస్వాదిస్తాడు.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాడు.. ప్రేమతో బంధించబడతాడు.. సంగీతానికి మైమరచిపోతాడు.

కానీ కరోనా కారణంగా దాదాపుగా ఎనిమిది నెలలుగా సినిమా హాల్స్ మూతపడి.. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. మరి, ప్రేక్షక దేవుళ్లు ఎప్పటిలా థియేటర్‌కు వస్తారా? అంటే చెప్పలేం. కానీ కన్నడ పరిశ్రమ నుంచి విడుదలైన ‘సెలెబ్రేట్ సినిమా అగేన్’ వీడియో మాత్రం సినీ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రేక్షకుడు వస్తాడు, సినిమా చూస్తాడు, మాకు మళ్లీ ప్రోత్సాహాన్ని అందిస్తాడు’ అనే భరోసానిస్తోంది. కన్నడ సూపర్ స్టార్స్ శివ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, శ్రీ మురళి, గణేష్, విజయ్, ధనుంజయ్ కనిపించిన ఈ వీడియోలో.. ప్రేక్షకులు థియేటర్‌కు రావాలని, మళ్లీ సినిమాను సెలెబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. యోగీ జీ రాజ్ దర్శకత్వంలో కేఆర్జీ కనెక్ట్స్ కాన్సెప్ట్‌లో వచ్చిన షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో గిరీశ్ జట్టి, బీపీ గోపాల నటించారు. కాగా ఈ ఎమోషనల్ వీడియోకు ప్రేక్షకులు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ డే ఫస్ట్ షో డేస్ గుర్తొస్తున్నాయని.. చాలా మిస్ అవుతున్నామని.. మళ్లీ అలాంటి రోజులు వస్తాయని, థియేటర్లకు వస్తామని చెబుతున్నారు.

Next Story

Most Viewed