వామపక్షాల ఆన్‌లైన్ బహిరంగ సభ.. మోడీ, కేసీఆర్ విధానాలపై ఆగ్రహం

by  |
వామపక్షాల ఆన్‌లైన్ బహిరంగ సభ.. మోడీ, కేసీఆర్ విధానాలపై ఆగ్రహం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం చెందిందని, లాక్‌డౌన్‌లో కేంద్రం కార్పొరేట్ సంస్థలకు మోకరిల్లిందని వామపక్ష నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం ‘పీపుల్స్ డిమాండ్ డే’గా వామపక్షల ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నరసింహారావు అధ్యక్షతన హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బహిరంగ సభ మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్‌ఎల్‌ నేత పోటు రంగారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ. మెడీ ప్రభుత్వం అజాగ్రత్త వల్ల దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. విపత్కర సమయంలో దేశ ప్రజలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఆర్థికసాయం చేస్తున్నదని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదులు, కరోనా నేపథ్యంలో ముస్లిం వ్యతిరేకతను పెంచి మత చిచ్చు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.

సీపీఐ రాష్ట్ర చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గుడుస్తున్నా విద్య, వైద్యంలో నేటికీ ఎలాంటి మార్పులేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే తెలంగాణ మెత్తం వచ్చినట్టేనా.? అని ప్రశ్నించారు. సీపీఐ (ఎమ్ ఎల్) పోటు రంగారావు మాట్లాడుతూ. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తే పీడియాక్ట్ ద్వారా అరెస్టు చేస్తున్నారన్నారు. వందల హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. మేధావులు, పార్టీలు, ప్రజా సంఘాలు నిరసనలు తెలిపే హక్కు లేకుండా పోయిందన్నారు.



Next Story

Most Viewed