లిక్కర్ డాన్ కేసులో ట్విస్ట్.. అత్యాచార కేసులో అమ్ముడుపోయిన ఖాకీలు.?

by  |
లిక్కర్ డాన్ కేసులో ట్విస్ట్.. అత్యాచార కేసులో అమ్ముడుపోయిన ఖాకీలు.?
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ లిక్కర్ డాన్లుగా పేరు గాంచిన తండ్రీ కొడుకుల అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ కార్పొరేటర్ భర్త, లిక్కర్ డాన్ పుత్రరత్నాని కాపాడేందుకు తెరవెనుక నుంచి ఖద్దరు, ఖాకీ చొక్కాలు బలంగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. లిక్కర్ డాన్ కు అండగా నిలిచిన నేతలపై ప్రజానీకం నుంచి విమర్శలు రావడంతో తమకేం సంబంధం లేదని లీకులు ఇస్తూ తెరవెనుక నుంచి సెటిల్మెంట్ కు యత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన లిక్కర్ డాన్ కొడుకు, తనని మోసం చేసి చివరికి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ఆరోపిస్తూ ఒక యువతి వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వ్యాపారం చేద్దామని సుమారు రూ. కోటి వరకు కూడా తన వద్ద నుంచి దఫాదఫాలుగా తీసుకున్నట్లుగా యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. వాస్తవానికి లిక్కర్ డాన్, ఆయన కొడుకు ఇవ్వజూపిన ఆఫర్లకు స్టేషన్ అధికారులు కేస్ ఫైల్ చేయకుండా చాలా రోజులు పెండింగులో పెట్టారు. ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, నువ్వేం చేయలేవని, స్టేషన్ చుట్టూ తిరిగితే చంపేస్తామని కూడా తండ్రీ కొడుకులు యువతిపై బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అండగా నిలిచే వారి గురించి కూడా ఆరా తీసి ఇదే రీతిలో వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ హోటల్ లో పంచాయితీ..

ఇదే విషయంపై వరంగల్ లో ని ఓ ప్రముఖ హోటల్ లో పోలీసులు, పొలిటికల్ నేతల మధ్య సెటిల్మెంట్ కు యత్నాలు జరిగాయి. ఈ సెటిల్మెంట్ లో కూడా లిక్కర్ డాన్, ఆయన కొడుకు యువతిపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. యువతి మహిళా సంఘాలను, మహిళా కమిషన్ ను ఆశ్రయించడంతో విషయం పోలీసు ఉన్నతాధికారులుకు తెలిసింది. సీపీ తరుణ్ జోషి స్టేషన్ అధికారులను ఘాటుగా మందలించి కేస్ నమోదు చేయాలని ఆదేశించారు. లిక్కర్ డాన్ ఇచ్చే బహుమతులకు అలవాటుపడిన స్టేషన్ అధికారులు బలవంతంగా మనుసు చంపుకుంటూ కార్పొరేటర్ భర్త పై అత్యాచారం, మోసం, బెదిరింపులు, నమ్మకద్రోహం కింద కేసులు నమోదు చేశారు. కొడుకు కోసం యువతిని బెదిరించిన లిక్కర్ డాన్ పైనా కేసు నమోదు చేశారు.

కేసు వివరాలు గోప్యంగా..

మంత్రి, ఎమ్మెల్యే పేరు చెబుతూ కొన్ని రోజులుగా యువతిని బెదిరించిన లిక్కర్ డాన్, ఆయన కొడుకుపై నమోదైన కేసులపై పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇతర కేసుల్లో నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించడం లేదన్న విమర్శలు సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి. పరపతి, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పి గతంలో స్థానికులను బెదిరిస్తూ చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అవసరం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని తిరిగి అడిగితే బెదిరించేవారంటూ లిక్కర్ డాన్లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? ఇంకా ఎన్ని రోజులు పట్టవచ్చు అన్నది వేచి చూడాలి.


Next Story

Most Viewed